ఆదివాసీలే త్యాగాలు చేయాలా ? | Sakshi
Sakshi News home page

ఆదివాసీలే త్యాగాలు చేయాలా ?

Published Mon, Jan 30 2017 12:47 AM

ఆదివాసీలే త్యాగాలు చేయాలా ? - Sakshi

మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి కృష్ణ

ఏటూరునాగారం: ఎవరి భవిష్యత్‌ అవసరాలకైనా ఆదివాసీలే త్యాగాలు చేయాలా? అని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి(హెచ్‌ఆర్‌ఎఫ్‌) వీఎస్‌.కృష్ణ ప్రశ్నించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ఏటూరునాగారంలో ఆదివారం ఆదివాసీ ఉద్యమ నేత దివంగత చంద పాపారావు సంస్మరణ సభ, ఆదివాసీలపై కె.బాలగోపాల్‌ రాసిన పుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది. కార్యక్రమంలో కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆదివాసీల మనుగడ దినదిన గండంగా మారిందని, సీఎంలుగా ఉన్న చంద్రబాబు, కేసీఆర్‌లు ఆదివాసీలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు.

పోలవరం ముంపు ఆదివాసీ ప్రాంతాలను మేకపోతుల్లా ఆంధ్రాకు బలిచ్చిన కేసీఆర్‌ నేడు జిల్లాల పేరిట 5వ షెడ్యూల్డ్‌ భూభాగాన్ని ముక్కలు చేశారన్నారు. ఆదివాసీ ప్రాంతా లను ఐక్యం కాకుండా కుట్రపన్ని నేడు భారీ ప్రాజెక్టులు, ఓపెన్‌ కాస్టులు, టైగర్‌ జోన్‌ ల పేరిట మరో బలిదానానికి సిద్ధం చేస్తున్నాడని చెప్పారు. ఆదివాసీలకు అన్యాయం చేయాలని చూస్తే ప్రభుత్వాలకు ఎదురు దెబ్బతగలడం తప్పదని కృష్ణ పేర్కొన్నారు. దండకారణ్యం లాంటి ప్రాంతాలలో బాలగోపాల్‌ మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేశాడని, ఆయన తుదిశ్వాస విడిచే వరకు ఆదివాసీ సమాజంలోనే ఉన్నారని వివరించారు. కార్యక్రమంలో మానవహక్కుల వేదిక నేతలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement