జై జవాన్‌ | Sakshi
Sakshi News home page

జై జవాన్‌

Published Wed, Jan 18 2017 3:10 AM

జై జవాన్‌ - Sakshi

సైనికులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు
జవాన్లు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం
మాజీ సైనికుల భార్యలకు డబుల్‌ పెన్షన్‌
రెండో ప్రపంచ యుద్ధ సైనికులకు పింఛన్‌ పెంపు
పరమవీర చక్ర, అశోక చక్ర గ్రహీతలకు దేశంలోనే అత్యధికంగా రూ. 2.25 కోట్లు అందిస్తాం
‘డబుల్‌ బెడ్‌రూం’లో మాజీ సైనికులకు 2% కోటా
సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడి
వరంగల్‌లో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తాం


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తమ ప్రాణం, కుటుంబం కన్నా దేశ రక్షణే ప్రధానమని భావించి అహరహం శ్రమిస్తున్న సైనికులు, వారి కుటుంబాల క్షేమాన్ని సమాజం బాధ్యతగా స్వీకరించాలని, అదే వారికి నిజమైన కృతజ్ఞత అవుతుందని అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల భాగస్వామ్యంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభమైన మంగళవారం ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం సైనిక సంక్షేమం అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘సైనిక సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తున్న ఈ నిధి కోసం నాతో పాటు మంత్రులంతా ఏటా రూ.25 వేలు విరాళంగా ఇస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒకరోజు వేతనాన్ని ఇస్తున్నారు.

సైనికుల పట్ల ఆదరాభిమానాలు చూపించి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు కృతజ్ఞతలు. అలాగే మాజీ సైనికులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే వారికి డబుల్‌ పెన్షన్‌ వస్తుంది. కానీ వారు మరణిస్తే మాత్రం ఆ సైనికుల భార్యలకు డబుల్‌ పెన్షన్‌ వర్తించడం లేదు. తెలంగాణలో డబుల్‌ పెన్షన్‌ పొందిన సైనికులు మరణిస్తే వారి భార్యలకు కూడా డబుల్‌ పెన్షన్‌ విధానాన్ని వర్తింపజేస్తాం’’అని సీఎం వివరించారు. గ్యాలంటరీ అవార్డులు పొందిన సైనికులకు రాష్ట్రం తరఫున గౌరవంగా ఇచ్చే నగదు పారితోషికాన్ని కూడా భారీ ఎత్తున పెంచుతున్నట్టు ప్రకటించారు. మొత్తం 11 రకాల పతకాలకు ఇచ్చే నగదును పెంచుతున్నట్టు తెలిపారు. ‘‘పరమ వీరచక్ర, అశోకచక్ర పతకాలు పొందిన వారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.10 లక్షలు ప్రకటించింది. ఈ అవార్డులు పొందినవారికి పంజాబ్‌ ప్రభుత్వం దేశంలోనే అత్యధికంగా రూ.2 కోట్లు ఇస్తోంది. ఇకపై వారి కన్నా అదనంగా ఇప్పట్నుంచి పరమవీర చక్ర, అశోకచక్ర పొందిన తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.2.25 కోట్లు అందిస్తాం.

మహావీరచక్ర, కీర్తిచక్ర, వీరచక్ర, శౌర్యచక్ర, సేనా మెడల్, యుద్ధసేవా పతకాలకు కూడా నగదు పారితోషికాన్ని పెంచుతున్నాం. సర్వీసులో ఉన్నప్పుడు యుద్ధంలో మరణించే సైనికులకు, అనారోగ్యం, ఇతర కారణాలతో చనిపోయే సైనికులకు కల్పించే పరిహారంలో వ్యత్యాసం ఉంది. ఇక నుంచి రాష్ట్రానికి చెందిన సైనికులు ఎలా మరణించినా ఒకే విధమైన పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే పది జిల్లాల్లో ఉన్న సైనిక సంక్షేమ బోర్డులను కొత్తగా ఏర్పాటయిన 21 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తాం. ఈ బోర్డుల ద్వారానే సైనిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం. మిలటరీ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఇస్తాం. విద్యాసంస్థల్లో స్కౌట్స్, గైడ్స్, ఎన్‌సీసీ శిక్షణను ప్రోత్సహిస్తాం’’అని తెలిపారు.

వరంగల్‌లో సైనిక్‌ స్కూల్‌
తెలంగాణలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని, వరంగల్‌లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కేంద్రంతో ఎంవోయూ కుదుర్చుకోనున్నట్టు వెల్లడించారు. ఉద్యోగ రీత్యా సైనికులు వివిధ రాష్ట్రాలకు మారినప్పుడల్లా వారి సొంత వాహనాలకు లైఫ్‌ ట్యాక్స్‌లు చెల్లించాల్సి వస్తోందని, ఇక నుంచి ఏ రాష్ట్రంలో లైఫ్‌ట్యాక్స్‌ కట్టినా తెలంగాణలో మళ్లీ తీసుకోబోమని పేర్కొన్నారు. సైనికుల ఇళ్లకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నామని, సైనికుల భార్యల పేరిట ఉన్న ఇళ్లకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పారు.

‘‘డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో మాజీ సైనికులకు 2 శాతం కోటా ఇస్తాం. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వీర సైనికులు, వారి భార్యలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతున్నాం. స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్లుగా పనిచేసే మాజీ సైనికోద్యోగుల వేతనాలను కూడా పెంచుతాం. వారికి నెలనెలా జీతం అందేలా చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో సైనిక సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకునేందుకు రాష్ట్రస్థాయిలో సైనిక సలహా మండలి ఏర్పాటు చేస్తున్నాం. ఈ మండలితో చర్చించి రాష్ట్రంలోని సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలు మెరుగైన జీవితాలు గడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం’’అని సీఎం హామీనిచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement