సాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్ | Sakshi
Sakshi News home page

సాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్

Published Sun, Jul 26 2015 2:38 AM

సాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్ - Sakshi

ఇప్పటి నుంచే ఏర్పాట్లకు సీఎం ఆదేశం
‘పాలమూరు’ కోసం శ్రీశైలం వద్ద 400 కేవీ లైన్
డిండి లేదా మహేశ్వరం నుంచి కరెంట్ సరఫరా
‘మేడిగడ్డ’కు భూపాలపల్లి లేదా జైపూర్ నుంచి లైన్లు
 
హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులపై నిర్మించే సాగునీటి ప్రాజెక్టులకు అవసరమయ్యే విద్యుత్ అందించడానికి ఏర్పాట్లు చేయాలని, ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం వద్ద లిఫ్టు మోటార్ల కోసం 400 కేవీ విద్యుత్ లైన్లు వేయాల్సిన అవసరముందన్నారు. డిండి లేదా మహేశ్వరం సబ్ స్టేషన్ల నుంచి లైన్లు వేయాలని, అవసరమైతే కొత్త సబ్ స్టేషన్లు నిర్మించాలన్నారు. గోదావరిపై మేడిగడ్డ వద్ద నిర్మించే ప్రాజెక్టు కోసం భూపాలపల్లి లేదా జైపూర్ నుంచి లైన్లు వేయాలన్నారు. విద్యుత్, నీటి పారుదల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, భవిష్యత్ డిమాండ్, విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణ పురోగతి తదితర అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు. మంత్రి కేటీఆర్,  సీఎస్ రాజీవ్ శర్మ, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు పాల్గొన్నా రు. 2018 నాటికి 25 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చేలా ఉత్పత్తి కేంద్రాల నిర్మా ణం కావాలని సీఎం సూచించారు. జైపూర్, భూపాలపల్లి విద్యుత్కేంద్రాల నిర్మాణంపై సమీక్షించారు.

ఎంత రేటుకైనా విద్యుత్ కొనండి..
రాష్ట్రంలో వర్షాభావం, వేడి వాతావరణ పరిస్థితులు నెలకొన్నందున పెరుగుతున్న డిమాండుకు తగ్గట్లు విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా సరఫరా జరుగుతుండడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సైతం ఎంత విద్యుత్ అవసరమైనా, ఎంత రేటుకైనా కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు.
 
ఏదుల నుంచే డిండికి నీరు అధికారుల ప్రతిపాదనకు సీఎం ఓకే
నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టుకు నీరు ఎక్కడి నుంచి తరలించాలనే అంశంపై స్పష్టత వచ్చింది. గతం లో ‘పాలమూరు’ ప్రాజెక్టులో అంతర్భాంగా వుండే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలని ప్రతిపాదించారు. అయితే గ్రావిటీ ద్వారా డిండికి నీటిని తరలించే అవకాశం వుండటంతో ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఏదుల రిజర్వాయర్ ఎత్తు 445 మీటర్లు కాగా, అప్పర్ డిండి ఎత్తు 396 మీటర్లు, ఈ నేపథ్యంలో దిగువనకు ఎత్తిపోతలు లేకుండా గ్రావిటీ ద్వారా నీరు వస్తుందని అధికారులు గుర్తించారు. విషయాన్ని సీఎంకు  అధికారులు నివేదించడంతో ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement