పిల్లల చేతికి స్టీరింగ్ ఇస్తే... ఇక అంతే..! | Sakshi
Sakshi News home page

పిల్లల చేతికి స్టీరింగ్ ఇస్తే... ఇక అంతే..!

Published Fri, Jul 3 2015 9:46 PM

పిల్లల చేతికి స్టీరింగ్ ఇస్తే... ఇక అంతే..! - Sakshi

లంగర్‌హౌస్ (హైదరాబాద్): బాధ్యత తెలియని వయస్సులో కారు నడిపే అవకాశం పెద్దలు ఇస్తే ఏజరుగుతుందనే దానికి తాజా ఉదాహరణ ఇది. నిర్లక్ష్యంతో అతివేగంగా కారును నడుపుతూ బీభత్సం సృష్టించారు ఆ బాలురు. రద్దీగా ఉండే ప్రాంతంలో రోడ్డు పక్కన జనం అప్రమత్తం కావటంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నందినగర్‌లో నివాసముండే ఓ విద్యార్థి(16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో షికారుకు బయలుదేరాడు.

టోలీచౌకి వైపు నుంచి వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలో డివైడర్‌ను ఢీ కొట్టింది. అంతటితో ఆగక ముందుకు దూసుకెళ్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ముందు నిలిపి ఉన్న సెవెన్ సీటర్ ఆటోను బలంగా ఢీకొని ముందుకు ఈడ్చుకెళ్లింది. రెండు వాహనాలు కూడా కొద్ది దూరంలో ఉన్న చెట్టును ఢీ కొట్టి నిలిచిపోయాయి. ఇక్కడే హోటళ్ల సముదాయం ఉండటంతో ఈ ప్రాంతం రద్దీగా ఉంది. కారు దూసుకు రావడంతో గమనించి జనం పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో అందులో ఉన్న నలుగురు బాలురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ట్రాఫిక్ ఎస్సై మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement