దేశ సమగ్రతకే ఇది ముప్పు | Sakshi
Sakshi News home page

దేశ సమగ్రతకే ఇది ముప్పు

Published Tue, Sep 23 2014 1:57 AM

High Court objects on Fast programme

 ‘ఫాస్ట్’పై టీ సర్కారుకు హైకోర్టు మొట్టికాయలు
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన ‘ఫాస్ట్’ వంటి పథకం దేశ సమగ్రతకే ముప్పు అని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి ఉత్తర్వులు దేశంలో వేర్పాటువాదానికి దారితీస్తాయంటూ తెలంగాణ సర్కారుపై మండిపడింది. అసలు ఈ విషయంలో ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లోని తెలుగు మాట్లాడే విద్యార్థులకు ఇలాంటి పరిస్థితే వస్తే మీకు ఎలా ఉంటుందని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ... విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణలో 1956 నవంబర్ 1వ తేదీకి ముందు నుంచీ నివాసముంటున్న కుటుంబాల విద్యార్థులకు మాత్రమే ఫీజులు చెల్లిస్తామంటూ... ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్)’ పేరిట తెలంగాణ ప్రభుత్వం పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జీవో కూడా జారీ అయింది. దీనిని సవాలు చేస్తూ.. మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్ వేర్వేరుగా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ‘‘భారతదేశం ఒక్కటే. ఇక్కడ నివసిస్తున్న వారంతా ఈ దేశ పౌరులే. పేద విద్యార్థులకు (ఎస్సీ, ఎస్సీ, బీసీల)కు ఆర్థిక సాయం చేస్తున్నామంటే మేం అర్థం చేసుకోగలం. తెలంగాణ విద్యార్థులను ఉద్దేశించి మాత్రమే ప్రభుత్వం ఎందుకు ‘ఫాస్ట్’ జీవోను తీసుకువచ్చింది..? దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులకు ఎందుకు వర్తింపజేయడం లేదు. ఎందుకీ వివక్ష..? తెలంగాణ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి.,’’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
 
 వివక్ష చూపుతున్నారు..: పిటిషనర్లు
 
 తొలుత పితాని సత్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ... నివాస ప్రాంతం ఆధారంగా విద్యార్థుల పట్ల వివక్ష చూపే విధంగా ‘ఫాస్ట్’ జీవో ఉందని ధర్మాసనానికి నివేదించారు. జూన్ 2 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉందని, హైదరాబాద్‌లో తెలంగాణేతర విద్యార్థులు వేలాది మంది విద్యను అభ్యసిస్తున్నారని... ‘ఫాస్ట్’ జీవో వల్ల వారంతా నష్టపోతారని విన్నవించుకున్నారు.
 
 ఇంకా అమలు చేయలేదు..: ప్రభుత్వం
 
 పిటిషనర్ల వాదనపై తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ... ‘ఫాస్ట్’ జీవో జారీ చేసినప్పటికీ, దానిని ఇప్పటివరకూ అమలు చేయలేదని కోర్టుకు తెలిపారు. ‘ఫాస్ట్’ జీవో వల్ల పిటిషనర్లకు వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పారు. అందువల్ల ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదని, వాటిని కొట్టివేయాలని ఆయన కోర్టును కోరారు.
 
 అది రాజ్యాంగ విరుద్ధం..: ధర్మాసనం
 
 ఏజీ వాదనలపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘‘మీరు జారీ చేసిన ‘ఫాస్ట్’ జీవో జాతీయ సమగ్రతను ప్రతిబింబించే విధంగా ఉందా..? మీరు ఈ జీవోను ఎలా సమర్థించుకుంటారు? ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి ఎంత మాత్రం అభినందనీయంగా లేదు. ప్రభుత్వ చర్యలు రాజ్యాంగంలోని 19వ అధికరణకు విరుద్ధంగా ఉన్నాయి. ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు విధానాలు రూపొందించుకుంటూ పోతే... మరి ఇతర రాష్ట్రాలు కూడా చెల్లించిన పన్నుల్లో కేంద్రం నుంచి వాటా ఎలా అడుగుతారు..? మీ విధానం ద్వారా మీరు ఒక వర్గం విద్యార్థులకు రాజ్యాంగపరంగా సమకూరాల్సిన ప్రయోజనాలను కాలరాస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు మాట్లాడే విద్యార్థులందరూ కూడా ఆ రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితే ఎదుర్కొంటే మీకు ఎలా ఉంటుంది..?’’ అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
 
 వివక్ష చూపొద్దు..
 
 ‘‘మనం సమైక్య రాజ్యంలో ఉన్నాం. ఆ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలా..? సమైక్య రాజ్యంలో వివక్షకు తావు లేవు. స్థానికత ఆధారంగా ప్రజల పట్ల వివక్ష చూపడానికి వీల్లేదు. విధానం ఏదైనా సరే అది జాతి సమగ్రతను, సమైక్య స్ఫూర్తిని పెంపొందించేదిగా ఉండాలి. ఇటువంటి వివక్షాపూరిత విధానాలను మనం అడ్డుకోకుంటే... దుష్టశక్తులు ప్రవేశించి మన రాజ్యాంగ, సమైక్య స్ఫూర్తిని నాశనం చేస్తాయి. ప్రభుత్వాలు విధానాల రూపకల్పన చేసే ముందు జాతి సమగ్రతను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుత వ్యవహారంలో జాతి సమగ్రత లోపించినట్లు కనిపిస్తోంది..’’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఫాస్ట్’ జీవో అమలుపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి, తాము ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం లేదని ధర్మాసనం పేర్కొంది. ఓ వర్గం విద్యార్థులకే ప్రయోజనాలను వర్తింప చేస్తూ జారీ చేసిన ఆ జీవోను ఎలా సమర్థించుకుంటారో వివరిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
 

Advertisement
Advertisement