అమ్మో.. దోమ | Sakshi
Sakshi News home page

అమ్మో.. దోమ

Published Tue, Jul 29 2014 11:54 PM

అమ్మో.. దోమ

 జిల్లాలో వర్షాలు జోరందుకున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించింది. దోమలు ప్రబలాయి. ఫలితంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఏటా జూలై నుంచి సీజనల్ వ్యాధులు ప్రజలను ఇబ్బంది పెడుతుంటాయి. ఈ వ్యాధుల సమస్య సెప్టెంబర్ వరకూ కొనసాగుతుంది. ఇప్పటికే ప్రబలిన వ్యాధులను అరికట్టేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజలు కూడా ఈ వ్యాధులపై  అవగాహన పెంచుకుని, పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వాటిని అదుపుచేసే అవకాశం ఉంటుంది.
 - నల్లగొండటౌన్
 
 దోమల నివారణకు చర్యలు
 జిల్లాలో దోమల నివారణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. మురుగుకాల్వలను శుభ్రం చేయించడం, గుంతలలో నిల్వ ఉన్న నీటిని తొలగించడం వంట చర్యలు చేపట్టాం. ముఖ్యంగా ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇంటి పరిసరాలలోని మురుగుకాల్వలను శుభ్రం చేసుకుని దోమలవ్యాప్తి లేకుండా చేసుకోవాలి. నీటి ట్యాంకులకు మూతలను ఏర్పాటు చేసుకుని, ఇంటిలోకి దోమలు రాకుండా కిటికీలకు, తలుపులకు మెష్‌లను ఏర్పాటు చేసుకోవాలి. దోమలు కుట్టకుండా దోమతెరలు, నివారణ కాయిల్స్‌ను ఉపయోగించుకోవాలి. మలేరియా వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి రక్త పరీక్షలు నిర్వహించి చికిత్సల కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలలో అవగాహన కల్పించడానికి గ్రామాలలో సదస్సులను నిర్వహిస్తున్నాం.     ఓంప్రకాష్, జిల్లా మలేరియా అధికారి
 
 ప్రణాళికాబద్ధంగా చర్యలు
 వర్షాకాలంలో వ్యాధులు సోకకుండా జిల్లా ఉన్నతాధికారులు ముందు జాగ్రత్తల చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి శుక్రవారం గ్రామాల్లో డ్రై డేను నిర్వహిస్తున్నాం. ఆశా, అంగన్‌వాడీ వర్కర్ల ద్వారా ప్రతి ఇంటిలోనూ సర్వేచేసి జ్వర పీడితులకు మందులు పంపిణీచేస్తున్నారు.  దోమల లార్వాను నిర్మూలించేందుకు మురుగు కాలువలు, గుంతల్లో ఎబెట్, మలాథిన్ మందులు పిచికారీ చేస్తున్నారు. డెంగీ వ్యాధి గ్రస్తులు ఉన్న ప్రాంతంలో పైరిథాన్ మందు చల్లిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఫాగింగ్ కూడా చేస్తున్నారు.
 
 ఏటా పీడితులు అధికమే
 మలేరియా కేసులు జిల్లాలో 2008 నుంచి 2013 వరకు మొత్తం 714 నమోదయ్యాయి. అదే విధంగా  2014లో  ఇప్పటి వరకు 3 కేసులు నమోదయ్యాయి. డెంగీ 2007 నుంచి 2013 వరకు  211 కేసులు, 2014లో ఇప్పటి వరకు  6 కేసులు  గుర్తించారు. మెదడువాపునకు సంబంధించి 2007 నుంచి 2013 వరకు 4కేసులు నమోదు అయ్యాయి. అదే విధంగా చికున్‌గున్యా కేసులు 2007 నుంచి 2013 వరకు 41 కేసులు నమోదు కాగా 2014లో 11 కేసులను నమోదయ్యాయి. బోధకాలు వ్యాధుగ్రస్తులు జిల్లాలో 5,829 మంది ఉండగా అత్యధికంగా సూర్యాపేట డివిజన్‌లో ఉన్నారు.
 
 ముందు జాగ్రత్తలు ముఖ్యం
 వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల నియంత్రణకు ముందు జాగ్రత్త చర్యలు ఉపయోగడపతాయని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి. వాటి నివారణ ఏమిటి? అన్న విషయాలు ప్రజలకు అవగాహన చేయటం ఎంతో అవసరమని అంటున్నారు. జిల్లా ప్రజల్లో అవగాహన కల్పిస్తే, మలేరియా, డెంగీ వ్యాధి బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు. ఈ సూచనలను పాటిస్తే, రోగాల బారిన పడకుండా ఉంటారని అంటున్నారు.
 
 మలేరియా వ్యాప్తి ఇలా...
 ‘ఎనాఫిలిస్’ రకం దోమ ద్వారా ఈ వ్యాధికి కారణమైన ప్లాస్మోడియా క్రిమి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలు మంచినీటి నిల్వల్లో గడ్లు పెడతాయి. అవి లార్వా, ప్యూపాగా పెరిగి పెద్ద దోమలుగా మారతాయి. దోమకాటు నుంచి రక్షణ, వ్యాధి నివారణలో ముఖ్యం. దోమ కుట్టిన 8 నుంచి 12 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయట పడతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు, గర్భిణులకు ఈ వ్యాధి ప్రమాదకరమైంది.
 
 లక్షణాలు ఇవీ
 చలి, వణుకుతో కూడిన జ్వరం వస్తుంది. సరైన వ్యాధి నిర్ధారణ, చికిత్స అందకపోతే నెలల తరబడి బాధిస్తుంది. ప్లాస్మోడియా జాతికి చెందిన రెండు క్రిముల వలన మన ప్రాంతాల్లో మలేరియా వ్యాపిస్తోంది. ‘వైవాక్స్’ మలేరియా తక్కువ బాధిస్తే, ‘పాల్సీఫారం’ మలేరియా ప్రమాదకరస్థాయిలో ఇబ్బందిపెడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైవాక్స్ మలేరియా ఎక్కువగా ప్రబలుతెంది. ఎనాఫిలిస్ దోమ ఎక్కడైనా పెరుగుతుంది. దీంతో వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
 

Advertisement
Advertisement