స్వరాష్ర్టంలో తొలిసారి పుష్కరం | Sakshi
Sakshi News home page

స్వరాష్ర్టంలో తొలిసారి పుష్కరం

Published Wed, Jul 1 2015 11:09 AM

స్వరాష్ర్టంలో తొలిసారి పుష్కరం - Sakshi

పుణ్యస్నానం.. పునీతం
14 నుంచి గోదావరి పుష్కరాలు
తరలిరానున్న లక్షలాది భక్తులు

 
పుష్కరస్నానం పరమ పవిత్రం. నదీ జలాలకు... జనజీవనానికి అనాదిగా ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తు చేస్తూ మరోసారి పుష్కర పులకింతకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి వచ్చిన గోదావరి పుష్కర పండుగకు ముహూర్తం దగ్గరపడింది. పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాల్లో పుణ్యస్నానమాచరించి పుణీతులయ్యేందుకు పుష్కరఘాట్లు సిద్ధమవుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్ వద్ద మన జిల్లాలో ప్రవేశించే గోదావరి నది ప్రముఖ పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కోటిలింగాల, మంథని, కాళేశ్వరం నుంచి మహదేవపూర్ మండలం ముకునూర్ వద్ద వరంగల్ జిల్లాలో ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో జిల్లాలో పుష్కరస్నానం చేసి పుణీతులయ్యేందుకు జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు.  - కోరుట్ల
 
వెల్గటూరు : గోదావరి పుష్కరాలు మరో 13 రోజుల్లో ప్రారంభం కానుండగా గోదావరిలో నీటి మట్టం ఆందోళన కలిగిస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి కావడంతో బ్యాక్ వాటర్ నిలిచి కోటిలింగాల వద్ద నీటితో జలకళ ఉట్టిపడుతుండగా... ఎగువన బాసర నుంచి రాయపట్నం వరకు, ఎల్లంపల్లి దిగువ నుంచి కాళేశ్వరం వరకు నీరు లేక వెలవెలబోతోంది. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి వద్ద గోదావరి నీళ్లు లేక ఎండిపోయింది. గోదావరిఖని వద్ద సైతం చుక్క నీరు లేదు. తూర్పున ఇటీవల కురిసిన వర్షాలకు కాళేశ్వరం వద్ద గోదావరి కొంత జలకళ సంతరించుకోగా... కోటిలింగాల వద్ద ఎల్లంపల్లి నీటి అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో భక్తులు ఎక్కువగా కోటిలింగాలకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
 
పుష్కరాలంటే..
పురాణాల ప్రకారం.. తుందిలుడు అనే మహర్షి శివుని కోసం ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ వెంటనే తుందిలుడు శివైక్యం కోరతాడు. భక్తుని కోరికను మన్నించిన శివుడు తుందిలుడిని తనలో ఐక్యం చేసుకుంటాడు. తుందిలుడు పంచభూతాలకు ప్రతీకగా నిలిచి అన్నింటిని కలిగి ఉన్నవాడు కావడంతో శివైక్యం అయిన తుందిలుడిని భూలోక సృష్టికోసం బ్రహ్మ కోరతాడు. తిరిగి బ్రహ్మ నుంచి బృహస్పతి చెంతకు తుందిలుడు చేరతాడు. అనంతరం బృహస్పతి తుందిలునికి పుష్కరునిగా పేరు మార్చి లోకకల్యాణం కోసం భూమిమీదికి పంపుతారు. ‘పుష్కరుడు’.. అన్న పదానికి అన్ని కలిగి ఈయగలిగిన వాడని అర్థం. అన్ని ఈయగలిగిన పుష్కరుడు పన్నెండు పుణ్యనదుల్లో రాశులకు అనుగుణంగా ప్రవేశించి భూలోక కల్యాణం నిర్వహిస్తాడని ప్రతీతి. బృహస్పతి సింహారాశిలోకి ప్రవేశిస్తున్న తరుణంలో గోదావరి నదిలో పుష్కరుడు ప్రవేశిస్తాడు. ఈ క్రమంలో గోదావరి నదీ స్నానం పరమ పవిత్రం.
 
జిల్లాలో 170 కిలోమీటర్లు
మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకంలో జన్మించిన గోదావరి నది అక్కడి నుంచి అదిలాబాద్ జిల్లాలో మొదటి ప్రవేశిస్తుంది. ఆపై కరీంనగర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం కొమటి కొండాపూర్‌లో ప్రారంభ మై మహదేవ్‌పూర్ మండలం ముకునూర్ వరకు ప్రవహిస్తుంది. ఈ క్రమంలో జిల్లాలోని 11 మండలాల్లో 69 గ్రామాలను ఆనుకుని 170 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. గోదావరి తీరం వెంట గతంలో కేవలం ఏడు పుష్కర ఘాట్లు మాత్రమే ఉండగా.. స్వరాష్ట్రంలో సంబరం ఘనంగా నిర్వహించాలని ఈసారి తెలంగాణ ప్రభుత్వం పుష్కర ఘాట్ల సంఖ్యను 36కు పెంచింది. ఘాట్ల నిర్మాణంతోపాటు భక్తులకు సౌకర్యాల కల్పనకు రూ.122 కోట్లు నిధులు కేటాయించింది.
 
పన్నెండు రోజులు పండుగే..
జూలై 14 నుంచి ప్రారంభమయ్యే పుష్కరాలు పన్నెండు రోజులపాటు నిర్వహిస్తారు. జిల్లాలో నిత్యం సుమారు 10 లక్షల మంది భక్తులు పుష్కర పుణ్య స్నానం చేస్తారని అంచనా. ఈ లెక్కన మొత్తం పుష్కరాలు ముగిసేసరికి ఎంత తక్కువ అనుకున్నా కోటికి పైచిలుకు భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ప్రధానంగా జిల్లాలోని ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల ఘాట్ల వద్ద అత్యధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానం ఆచరించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఆయా పుణ్యక్షేత్రాల్లో కొలువుదీరిన దేవాలయాలను ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పుష్కరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎగువన నీరు లేక గోదావరి వెలవెలబోగా ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌తో కోటిలింగాల వద్ద గోదావరి కళకళలాడుతోంది. ఇటీవలి వర్షాలతో కాళేశ్వరం వద్ద కూడా నీరు వచ్చింది. దీంతో పుణ్యస్నానాల కోసం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా జిల్లాకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాాశముంది.
 
జగిత్యాల డివిజన్‌లో అత్యధికం
గోదావరి తీరం అత్యధికంగా ఉన్న జగిత్యాల డివిజన్‌లో పుష్కర ఘాట్లు అత్యధికంగా ఉన్నాయి. మొదటగా డివిజన్‌లోని కోరుట్ల సెగ్మెంట్‌లోని ఇబ్రహీంపట్నం మండలంలో ఆరు ఘాట్లు, మల్లాపూర్ మండలంలో తొమ్మిది  ఘాట్లు, ధర్మపురి మండలంలో మూడు ఘాట్లు, రాయికల్, సారంగాపూర్ , వెల్గటూర్ మండలాల్లో ఒక్కో ఘాట్ ఉన్నాయి. ధర్మపురి, వెల్గటూర్ మండలం కోటిలింగాల, మల్లాపూర్ మండలం వాల్గొండ పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధమైనవిగా గుర్తింపు పొందాయి. ధర్మపురిలో శ్రీలక్ష్మీనృసింహాలయం, వెల్గటూరులో కోటిలింగాల దేవాలయం, వాల్గొండలో త్రికూట రామలింగేశ్వరాలయాలు పుష్కరాల కోసం సిద్ధమయ్యాయి. ఆయా చోట్ల ఘాట్ల ఏర్పాటు, సౌకర్యాల కల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు.
 
జిల్లాలో పుష్కర ఘాట్లు,
ఆలయాల వివరాలు
 
మండలం    ఘాట్లు    ఆలయాల వివరాలు
ఇబ్రహీంపట్నం    కోమటికొండాపూర్    గంగామాత ఆలయం
ఇబ్రహీంపట్నం    ఎర్దండి    గంగామాత ఆలయం
ఇబ్రహీంపట్నం    మూలరాంపూర్    గంగామాత ఆలయం
ఇబ్రహీంపట్నం    వేములకుర్తి    గంగామాత ఆలయం
ఇబ్రహీంపట్నం    రత్నాలమడుగు(యామాపూర్)    -
ఇబ్రహీంపట్నం    ఫకీర్‌కొండాపూర్    -

మల్లాపూర్    మొగిలిపేట    గంగామాత
మల్లాపూర్    ఒబులాపూర్    -
మల్లాపూర్    పాతదాంరాజ్‌పల్లి    -
మల్లాపూర్    కొత్తదాంరాజ్‌పల్లి    -
మల్లాపూర్    వాల్గొండ(3ఘాట్లు)    రామలింగేశ్వరాలయం
మల్లాపూర్    వివిరావుపేట్(2ఘాట్లు)    గంగగౌరీశ్వరాలయం

రాయికల్    బోర్నపెల్లి    రామాలయం    
సారంగపూర్    కమ్మునూర్ ఆంజనేయస్వామి
వెల్గటూర్    వెల్గటూర్(కోటిలింగాల)    కోటిలింగాల ఆలయం
ధర్మపురి    ధర్మపురి    లక్ష్మీనర్సింహస్వామి
రాయపట్నం    రాయపట్నం    గూడెంగుట్ట  సత్యనారాయణస్వామి    
మల్లాపూర్    తిమ్మాపూర్    -
రామగుండం    పెద్దంపేట్    అర్బన్ ఘాట్(సమ్మక్క జాతరవద్ద)    లింగేశ్వరాలయం
 కమాన్‌పూర్    సుందిళ్ల    -
 మంథని    మంథని    గౌతమేశ్వరాలయం
 మహదేవపూర్    కాళేశ్వరం    ముక్తీశ్వరాలయం
 
పుష్కరాలకు వాలంటీర్ల ఎంపిక నేటి నుంచి
శాతవాహన యూనివర్సిటీ : గోదావరి పుష్కరాల్లో విధులు నిర్వహించడానికి వాలంటీర్ల ఎంపికను కరీంనగర్‌లోని ఎస్సారార్ కాలేజీలో బుధవారం నుంచి 3 వరకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ బి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. పుష్కర విధుల్లో పాలుపంచుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయం, పోలీస్‌శాఖ నుంచి ప్రశంసాపత్రాలు అందిస్తారని పేర్కొన్నారు. ఎంపిక శిబిరానికి ఎక్కువ సంఖ్యలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు హాజరుకావాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement