పంతుళ్లకూ పరీక్షలే! | Sakshi
Sakshi News home page

పంతుళ్లకూ పరీక్షలే!

Published Tue, Oct 21 2014 11:56 PM

పంతుళ్లకూ పరీక్షలే! - Sakshi

దోమ: ప్రభుత్వ ఉపాధ్యాయుల పనితీరును మెరుగుపరిచి తద్వారా విద్యా ప్రమాణాల్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఓ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పరీక్షల ద్వారా కేవలం విద్యార్థుల ప్రగతిని మాత్రమే అంచనా వేసి దానికి తగినట్లుగా బోధనాభ్యసన వ్యవస్థలో మార్పులు, చేర్పులు చేసేవారు. ఇకమీదట ఉపాధ్యాయుల పనితీరును కూడా పరిగణనలోకి తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.

విద్యార్థులు సాధించిన ప్రగతిని కొలమానంగా తీసుకొని ఉపాధ్యాయులకు రేటింగ్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యా సంవత్సరంలో నాలుగుసార్లు విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేస్తారు. తమ పనితీరును తామే బేరీజు వేసుకుని సంబంధిత ఉపాధ్యాయులే నిజాయతీగా నివేదికలు ఇచ్చేలా అధికారులు నిబంధనలు రూపొందించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే పాఠశాలలకు సైతం చేరవేశారు. వాటిని నింపడంపై ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
 
‘విద్యాహక్కు’ నిబంధనలకనుగుణంగా..
విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 24, 29లలో పొందుపరిచిన అంశాల ఆధారంగా విద్యార్థుల గ్రేడింగ్‌లతో పాటు ఉపాధ్యాయుల పనితీరు ఎలా ఉందనే విషయాన్ని పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. అభ్యసన అనుభవం, ప్రణాళిక రూపకల్పన, పాఠ్యాంశాల వారీగా విద్యార్థులు సాధించిన ప్రగతి, అవగాహన స్థాయి, అభ్యసనకు అవలంబిస్తున్న విధానాలు, విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు, హెచ్‌ఎం, ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులతో మమేకమైన తీరు, వృత్తిపర అభివృద్ధి, పాఠశాల అభివృద్దికి చేసిన కృషి, పాఠశాల హాజరు తదితర అన్ని రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేయడానికి చర్యలు చేపట్టారు.

మొత్తం 7 విభాగాల్లో 54 అంశాల వారీగా ఉపాధ్యాయుల పనితీరును లెక్కించనున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు తమకు తామే పనితీరును అంచనా వేసుకునే విధంగా.. 1. నిర్దేశించిన అంశాల్లో లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాను... 2. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఉన్నాను... 3. లక్ష్యాన్ని చేరుకున్నాను... 4. లక్ష్యాన్ని దాటి ముందుకు వెళ్లాను. అనే ఆప్షన్లను ఇచ్చారు. వీటి ఆధారంగా సమర్పించే నివేదికను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ, డిప్యూటీ డీఈఓలు పరిశీలించి ఉపాధ్యాయుడి పనితీరును అంచనా వేస్తారు.

ఆన్‌లైన్‌లో వివరాల నమోదు..
ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సమర్పించే నివేదికల సారాంశాన్ని అంతా ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పొందుపరుస్తారు. దీని ఆధారంగా పాఠశాల పర్యవేక్షణ పత్రంలో పార్ట్ ఎ, పార్ట్ బి, పార్ట్ సీలలో నమోదైన మొత్తం వివరాలను డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్‌ఈ) వెబ్‌సైట్‌కు అనుసంధానం చేస్తారు. ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఏ పాఠశాలలో విద్యార్థులు ఏయే విషయాల్లో వెనుకబడి ఉన్నారు, కనీసం అభ్యసనా స్థాయిని చేరుకోలేని వారెందరు అనే విషయాలను తెలుసుకునే వీలుంటుందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు వారు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement