'వచ్చే ఉగాదికి మెట్రో పరుగులు' | Sakshi
Sakshi News home page

'వచ్చే ఉగాదికి మెట్రో పరుగులు'

Published Thu, Nov 26 2015 7:04 PM

few sections of metro rail may be thrown open in 2016

హైదరాబాద్ : వచ్చే ఏడాది ఏప్రిల్ మాసంలో నగరంలో మెట్రో రైళ్ల రాకపోకలు ప్రారంభించే అవకాశాలున్నాయని ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైలు మేనేజింగ్ డైరక్టర్ వీబీ గాడ్గిల్ సూచనప్రాయంగా తెలిపారు. తేదీని మాత్రం ప్రభుత్వమే ప్రకటిస్తుందన్నారు. ప్రస్తుతం మియాపూర్-ఎస్.ఆర్.నగర్ రూట్లో మెట్రో రైళ్లకు ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అసెంబ్లీ, సుల్తాన్‌బజార్ ప్రాంతాల్లో ముందుగా నిర్ణయించిన మార్గం(ఒరిజినల్ అలైన్‌మెంట్) ప్రకారమే పనులు చేపడతామని..అసెంబ్లీ ముందు నుంచి, సుల్తాన్‌బజార్ చారిత్రక మార్కెట్ మధ్య నుంచి మెట్రో పనులు జరగనున్నాయని స్పష్టం చేశారు. పాతనగరంలోనూ గతంలో నిర్ణయించిన మార్గంలోనే పనులు చేపట్టే అవకాశాలున్నాయని, అయితే ఈ విషయంలో ఆస్తుల సేకరణకు బాధితులతో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకే పాతనగరంలో ఫలక్‌నుమా మెట్రో డిపోతోపాటు మెట్రో మార్గం పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.ప్రభుత్వంతో ఎలాంటి పేచీ లేదని, మెట్రో పనులు చేపట్టినప్పటి నుంచి ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని మొక్కవోని దీక్షతో పనులను పూర్తిచేస్తున్నామన్నారు. మూసీ నది మధ్య నుంచి మెట్రో పనులు చేపట్టడం సాంకేతికంగా అనేక సవాళ్లతో కూడుకున్నదన్నారు. గురువారం ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రిటెయిల్ అవుట్‌లెట్,వాణిజ్య ప్రకటనల బోర్డులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

నాగోలు-సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మార్గంలో బోయిగూడా,ఆలుగడ్డబావి, ఒలిఫెంటాబ్రిడ్జి ప్రాంతాల్లో రైలు ఓవర్‌బ్రిడ్జి (ఆర్‌ఓబీ)లను వచ్చే ఏడాది నవంబరు నాటికి పూర్తి చేస్తేనే ఈ మార్గంలో మెట్రో రైళ్లు పరుగులుతీసే అవకాశాలున్నాయన్నారు. ప్రస్తుతం కమీషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అనుమతులు దక్కితే మియాపూర్-ఎస్.ఆర్.నగర్ రూట్లో మెట్రో రైళ్ల వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలుంటాయని చెప్పారు. అమీర్‌పేట్, గ్రీన్‌ల్యాండ్స్, యూసుఫ్‌గూడా ప్రాంతాల్లో ఆస్తుల సేకరణ, విద్యుద్దీపాలు, మంచినీటి పైప్‌లైన్ల మార్పు పనులు కొలిక్కి వస్తున్నాయన్నారు. ఆస్తులు కోల్పోయిన బాధితులకు మెరుగైన పరిహారం అందించి, వాహనాల రాకపోకలకు అవసరమైన రోడ్డు(రైట్‌ ఆఫ్‌ వే) ఏర్పాటుచేసిన తరవాతనే మెట్రో పనులు చేపడుతున్నామని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement