ఉలిక్కిపడ్డ జగిత్యాల | Sakshi
Sakshi News home page

ఉలిక్కిపడ్డ జగిత్యాల

Published Wed, Sep 24 2014 3:28 AM

ఉలిక్కిపడ్డ జగిత్యాల - Sakshi

జగిత్యాల:
 తెల్లవారు జామున జరిగిన హత్యతో జగిత్యాల ఉలిక్కిపడింది. పట్టణంలోని పార్క్‌లైన్ రోడ్డులో మంగళవారం నడి రోడ్డుపై ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు.. సిద్దిపేటలోని కాళ్లకుంట ప్రశాంత్‌నగర్ చెందిన ఎండీ.లాల్‌మహ్మద్(40). తలపై రాయితో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజుల క్రితం పాత బస్టాండ్‌లో యాచకుడి హత్య ఘటన మరిచిపోకముందే మరో హత్య జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వివరాలు కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. లాల్‌మహ్మద్, అతని తమ్ముడి యాకుబ్ కుటుంబాలు బతుకుదెరువు కోసం గ్రామాల్లో తిరుగుతూ పాతసామగ్రిని బాగు చేస్తుంటారు. బిందెలకు రంద్రాలు, చొట్టలు పడితే తీస్తుంటారు. ఈక్రమంలో గత నెల 19న సిద్దిపేట నుంచి బయలుదేరారు. పలు పల్లెలు తిరుగుతూ ఉపాధి పొందుతున్నారు. బక్రీద్ పండుగ కోసం ఇంటికెళ్లాలనుకున్నారు. ఈక్రమంలో ధర్మపురి మండలం తిమ్మాపూర్ నుంచి సోమవారం రాత్రి బస్సులో బయలుదేరి జగిత్యాల బస్టాండ్‌కు చేరుకున్నారు. భార్య, బిడ్డలను బస్టాండ్‌లో ఉంచి ఇద్దరన్నదమ్ములు పక్కనే ఉన్న కల్లుపాకలోకి వెళ్లారు. కల్లు తాగిన తర్వాత భార్య, బిడ్డలకు అన్నం తెచ్చి పెట్టమని తమ్ముడిని పంపించి, లాల్‌మహ్మద్ అక్కడే కూర్చున్నాడు. బస్టాండ్‌కు వచ్చిన యాకూబ్ కుటుంబసభ్యులకు తినుబండారాలు ఇచ్చి తను రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉన్నాడు. అప్పటికీ అన్న రాకపోవడంతో యాకూబ్ కల్లుపాకకు వెళ్లి చూడగా లాల్‌మహ్మద్ అక్కడ కనిపించలేదు. చుట్టుపక్కల పరిశీలించిన ఆచూకీ లభించకపోవడంతో తిరిగి బస్టాండ్‌కు వెళ్లి ఈ విషయాన్ని వదినకు చెప్పి పడుకున్నాడు.  
 పెట్రోలింగ్‌తో వెలుగులోకి..
 తెల్లవారుజామున పోలీసులు పెట్రోలింగ్‌కు బయలుదేరడంతో ఈ హత్య విషయం వెలుగుచూసింది. స్థానిక పార్క్‌సంధిలో నడిరోడ్డుపై మృతదేహం కనిపించింది. రాయితో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. వీరి జీపును చూసి పరుగెత్తిన మతిస్థిమితం లేని వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  
 బస్టాండ్ వద్ద నిలిచిన జాగిలం
 హత్య ఘటనను పరిశోధించేందుకు పోలీసులు కరీంనగర్ నుంచి జాగిలాన్ని తీసుకొచ్చారు. జాగిలం సంఘటన స్థలం నుంచి బస్టాండ్ వరకు వచ్చి ఆగిపోయిందని సీఐ నరేశ్‌కుమార్ తెలిపారు. తన మరిది యాకూబ్ రాత్రి రెండు గంటల ప్రాంతంలో బస్టాండ్ నుంచి లేచి వెళ్లాడని మృతుడి భార్య బీజానా భేగం ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పారు.



 

Advertisement
Advertisement