విద్యార్థులు లేని స్కూళ్ల సమాచారం సేకరణ | Sakshi
Sakshi News home page

విద్యార్థులు లేని స్కూళ్ల సమాచారం సేకరణ

Published Wed, Oct 1 2014 3:16 AM

collection of information  schools who do not have students

ఖమ్మం: ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కనీస సంఖ్యలో విద్యార్థులు లేని పాఠశాలలను మూసివేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలో ఎన్ని పాఠశాలలను మూసివేయాల్సి వస్తుందనే సమాచారం ఓ కొలిక్కి వచ్చింది.

డీఈవో రవీంద్రనాధ్‌రెడ్డి జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి ఆయా మండలాల్లో ఉన్న పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను తీసుకున్నారు. వారిచ్చిన జాబితాను పరిశీలించి జిల్లా వ్యాప్తంగా మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో 622 పాఠశాలలకు మూసివేత ముప్పు పొంచి ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలిసింది. ఇందులో 143 సక్సెస్ పాఠశాలలు కూడా ఉండటం గమనార్హం. దీంతో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు రెండు వేల మంది ఉపాధ్యాయులకు స్థానచనలం కలుగనుంది.

అయితే విద్యాసంవత్సరం మధ్యలో తగినంత మంది పిల్లలు లేరని  పాఠశాలలు మూసివేస్తే ఆయా పాఠశాలల్లో చదివే ఒక్కరిద్దరు విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందికరంగా మారనుందని, ఇప్పటికిప్పుడు పాఠశాలలు మూసివేయడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో హేతుబద్ధీకరణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి పాఠశాలలు మూసివేయడం లేదని చెప్పడం గమనార్హం. కానీ, విద్యామంత్రి హామీ ఇచ్చిన విధంగా ఇప్పటికే విడుదలయిన ఉత్తర్వులలో మార్పులు తేకుంటే జిల్లా యంత్రాంగం సేకరించిన 622 పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని విద్యాశాఖ వర్గాలంటున్నాయి.

 మూసివేయకపోయినా వెయ్యి మంది బదిలీ?
 ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రకారం 20 మంది లోపు విద్యార్థులు ఉన్న పీఎస్‌లు, 6,7 తరగతులు కలిపి 40 మందికంటే తక్కువ విద్యార్థులు ఉన్న యూపీఎప్‌లు, 75 మంది విద్యార్థులకంటే తక్కువగా ఉన్న హైస్కూళ్లు, సక్సెస్ స్కూల్స్‌ను మూసివేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నిబంధనల ప్రకారం ప్రతి జిల్లాలో పాఠశాలలు, అక్కడ చదువుతున్న విద్యార్థులు, పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

దీంతో డీఈవో ఎంఈవోల ద్వారా పూర్తి వివరాలు సేకరించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 289 ప్రాథమిక పాఠశాలలు, 182 యూపీఎస్‌లు, హైస్కూళ్లలో 8 తెలుగు మీడియం, 143 ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు... మొత్తం 622 పాఠశాలలను మూసివేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందులో మైదాన ప్రాంతంలో పీఎస్‌లు 93, యూపీఎస్‌లు 69, హైస్కూల్స్ తెలుగు మీడియంలో 4, ఇంగ్లిష్ మీడియంలో 100 ఉన్నాయి.

అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో పీఎస్‌లు 196, యూపీఎస్‌లు 113, హైస్కూల్స్ తెలుగు మీడియంలో 4, ఇంగ్లిష్ మీడియంలో 43 ఉన్నాయి. దీంతో ఒక వైపు రేషనలైజేషన్, మరోవైపు పాఠశాలల మూసివేత కారణంగా జిల్లాలో సుమారు రెండు వేల మంది ఉపాధ్యాయులకు స్థాన చెలనం కలగాల్సి ఉంది.

ఒక వేళ విద్యాశాఖ మంత్రి ప్రకటించినట్లు పాఠశాలలు మూసివేయక పోయినా, రేషనలేజేషన్ ప్రకారం చూసినా జిల్లాలో వెయ్యిమంది ఉపాధ్యాయులు వారు పనిచేస్తున్న పాఠశాలల నుంచి బయటకు రావాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో పనిచేస్తున్న 463 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయలేదు. దీనికి తోడు ఇప్పుడు రేషలైజేషన్ ప్రకారం మిగిలిన ఉపాధ్యాయులను ఎలా సర్దుబాటు చేస్తారో వేచి చూడాలి.

  మంత్రి ప్రకటనతో ఊరట..
 తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు మూసివేసేందుకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంగళవారం డీఈవో కార్యాలయంలో ఎంఈవోలతో సమావేశం ఏర్పాటు చేసి మూసివేసే పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి, సమీప పాఠశాలల్లో చేర్చడం, రేషనలైజేషన్ ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనల గురించి చర్చించారు. ఎంఈవోలు ఇచ్చిన నివేధికతో జిల్లాలో 622 పాఠశాలకు మూసివేత గండం పొంచి ఉందని స్పష్టం చేశారు.

దీంతో తమకు స్థానం చలనం కలుగుతుందని ఉపాధ్యాయులు, తమ ఊళ్లో పాఠశాల మూసివేస్తారని గ్రామస్తులు, విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అయితే హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఒక్క పాఠశాలను కూడా మూసివేయడం లేదని, విద్యార్థుల సంఖ్యతో సబంధం లేకుండా పాఠశాలలు కొనసాగిస్తామని చెప్పారు.

రేషనలైజేషన్ ప్రక్రియ మాత్రం కొససాగిస్తామని తెలిపారు. ఈ పరిస్థితిలో మారుమూల గ్రామాల్లో ఉన్న పాఠశాలలు యథాతధంగా ఉన్నా పలు పాఠశాలల్లో ముఖ్యంగా సక్సెస్ పాఠశాలల్లో 5,10 మంది విద్యార్థులే ఉన్నారు. హైస్కూళ్లలో ప్రతి 240 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలనే నిబంధన అమలు చేస్తే ఆయా పాఠశాలల్లో  ఉపాధ్యాయుల సంఖ్య భారీగా తగ్గే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏవిధంగా ఉంటుందోనని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement