ఇంటిదొంగలకు ఉచ్చు! | Sakshi
Sakshi News home page

ఇంటిదొంగలకు ఉచ్చు!

Published Fri, Aug 22 2014 12:09 AM

CID officers are investigating the completed on indiramma house scheme

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇందిరమ్మ ‘ఇంటి దొంగల’పై ఉచ్చు బిగుసుకుంటోంది. జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలోని నాలుగు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జరిగిన అక్రమాలపై సీఐడీ దర్యాప్తు పూర్తి చేసింది. దర్యాప్తు నివేదికను గురువారం సీఐడీ అధికారులు ఐజీకి అందజేశారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు బాధ్యులైన వారిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నాలుగు గ్రామాల్లో దాదాపు రూ.2కోట్లకుపైగా జరిగిన అవకతవకల్లో హౌసింగ్ శాఖ డీఈ, ఇద్దరు ఏఈలు, ఐదుగురు మండల హౌసింగ్ అధికారులున్నట్లు తెలిసింది. అదేవిధంగా మరో ఆరుగురు మధ్యవర్తులు సైతం ఈ తంతులో భాగస్వాములని సీఐడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సీఐడీ అధికారులు గురువారం ఆ శాఖ ఉన్నతాధికారికి నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో అక్రమార్కులను వీలైనంత త్వరలో అరెస్టు చేసి జైలుకు పంపించనున్నట్లు తెలుస్తోంది.

 బోగస్ లబ్ధిదారులపైనా..
 ఇందిరమ్మ అక్రమాల్లో భాగస్వాములైన అధికారులు, మధ్యవర్తులపై చర్యలు ఉపక్రమించనున్న అధికారులు.. బోగస్ లబ్ధిదారులపైనా చర్యలు తీసుకునే దిశలో ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వివరించిన అనంతరం.. ఆయన ఆదేశానుసారం తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.

Advertisement
Advertisement