ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన

Published Mon, May 1 2017 2:13 AM

ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన - Sakshi

బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ఆరోపణ
అసెంబ్లీలోకి అనుమతించకపోవడానికి నిరసనగా ఆందోళన


సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలోకి తమను అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద బీజేపీ సభ్యులు జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి నల్లకండువాలు ధరించి, నోటికి నల్లగుడ్డలు కట్టుకుని శాసనసభ వరకు నడిచివెళ్లారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, భూసేకరణ చట్టానికి సవరణలు చేసే సమావేశానికి తమను రాకుండా అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు.

  గత సభలో సస్పెండ్‌ అయితే ఈ సభకు రాకూడదని ఏ చట్టంలో ఉన్నదో సీఎం, స్పీకర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  ప్రజాస్వామ్య వ్యతిరేక, నిజాం నిరంకుశ రాచరికం మాదిరిగా ప్రస్తుత పాలన సాగుతోందని, దీనికి టీఆర్‌ఎస్‌ తగిన ప్రతిఫలం అనుభవిస్తుందని హెచ్చరించారు.    భూసేకరణ సవరణ చట్టం తప్పుల తడకలతో కూడినది కాబట్టే కేంద్రం తిప్పి పంపిందని, ఈ విధంగా వెనక్కు రావడం ప్రభుత్వానికి తలవంపులు కాదా అని  కె.లక్ష్మణ్‌ ప్రశ్నించారు. రైతులకు సరైన పరిహారం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు చట్టం తేవడం సరికాదని ఆయన చెప్పారు.   

గవర్నర్‌కు ఫిర్యాదు: శాసనసభ విధానాలను కూలదోసేలా, ప్రతిపక్షాలను పట్టించుకోకుండా, రాజ్యాంగాన్ని అపవిత్రం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నం దున రాజ్యాంగ పరిరక్షకుడిగా జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ నరసింహన్‌కు బీజేపీ ఎమ్మెల్యేలు వినతిపత్రం సమర్పించారు. ఆదివారం జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని కూడా కేవలం పది నిమిషాల్లోనే ముగించిన తీరు ప్రభుత్వ ఆధిపత్య ధోరణిని, అసహనాన్ని స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు. చివరి సమావేశాల్లో సస్పెండ్‌ చేసినా ప్రత్యేక సమావేశాల్లో అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ అన్నారని, దీనిపై స్పీకర్‌తో మాట్లాడతానని చెప్పారన్నారు. తమ సస్పెన్షన్లపై ప్రభుత్వం పునరాలోచించకపోతే కోర్టులను ఆశ్రయించేందుకు వెనకాడబోమని హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement