ఫ్యాక్టరీలు, షాప్‌ల వద్దా ‘బతుకమ్మ’ | Sakshi
Sakshi News home page

ఫ్యాక్టరీలు, షాప్‌ల వద్దా ‘బతుకమ్మ’

Published Sun, Sep 21 2014 2:09 AM

ఫ్యాక్టరీలు, షాప్‌ల వద్దా ‘బతుకమ్మ’ - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను  ప్రతిబింబించే విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఫ్యాక్టరీలు, దుకాణాలు, ప్రైవేటు సంసల్లో కూడా బతుకమ్మ వేడకలను  ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్, డెరైక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌ను ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగను వైభంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ప్రైవేటు సంస్థలు, షాపులు, ఫాక్యక్టరీల్లో కూడా అక్కడి మహిళా ఉద్యోగులు, కార్మికులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం కోరింది. దీనికి సంబంధించి కార్మిక శాఖ జాయింట్ కమిషనర్‌లు, డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలోని దుకాణాలు, ప్రైవేటు ఫ్యాక్టరీలు, సంస్థల యామాన్యాలు, కార్మిక సంఘాలు, వివిధ సంస్థలతో సమావేశాలను నిర్వహించి వారికి బతుకమ్మ పండుగ నిర్వహించడానికి దిశానిర్దేశం చేయాలని  కోరింది.  దుకాణాలను సుందరంగా అలంకరించిన యజమానులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేయనున్నామని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ చంద్రవదన్  శనివారం  ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో..

ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు బంగారు బతుకమ్మ ఉత ్సవాలను వివిధ జిల్లాల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రాజీవ్‌సాగర్ వెల్లడించారు. అక్టోబరు 2న సద్దుల బతుకమ్మను హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తామని తెలిపారు.

టీఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో...

 ఈ నెల 29న అన్ని జిల్లాల మహిళా ఉద్యోగులతో హైదరాబాద్‌లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని టీఎన్‌జీఓస్ సమావేశం నిర్ణయించింది. శనివారం టీఎన్‌జీవోస్ మహిళా విభాగం చైర్‌పర్సన్ రేచల్ ఆధ్వర్యంలో టీఎన్‌జీఓస్ సమావేశం జరిగింది.
 

Advertisement
Advertisement