‘వేటు’కు విరామం...! | Sakshi
Sakshi News home page

‘వేటు’కు విరామం...!

Published Fri, Sep 8 2017 5:05 AM

‘వేటు’కు విరామం...! - Sakshi

చర్యలు వద్దు
స్పీకర్‌కు హైకోర్టు ఆదేశం
డీఎంకే ఎమ్మెల్యేలకు తాత్కాలిక ఊరట
గవర్నర్‌తో భేటీకి స్టాలిన్‌ నిర్ణయం


సస్పెన్షన్‌ వేటు నుంచి డీఎంకే ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి బయటపడ్డారు. మద్రాసు హైకోర్టు రూంలో తాత్కాలికంగా ఊరట లభించింది. గుట్కా కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్‌ ధనపాల్‌కు హైకోర్టు న్యాయమూర్తి దురై స్వామి గురువారం ఆదేశాలు ఇచ్చారు.
 
సాక్షి, చెన్నై :  గవర్నర్‌ బల పరీక్షకు ఆదేశిస్తే, సంకటంలో పడుతామన్న ఆందోళనతో సీఎం పళని స్వామి నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త ఎత్తుగడకు సిద్ధపడ్డ విషయం తెలిసిందే. ఆ మేరకు అసెంబ్లీలో సాగిన గుట్కా వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని డీఎంకే సభ్యులు 21 మందిని సస్పెండ్‌ చేయడానికి తగ్గ కార్యాచరణ సిద్ధం చేశారు. సభా హక్కుల సంఘం ద్వారా ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు సైతం ఇప్పించారు.

నోటీసుకు వివరణ ఇవ్వడానికి మరో పదిహేను రోజులు సమయం కావాలని ఇప్పటికే డీఎంకే సభ్యులు అసెంబ్లీ కార్యదర్శి భూపతికి విజ్ఞప్తి చేశారు. అలాగే, గుట్కా వ్యవహారం కోర్టులో విచారణలో ఉండడం, ఇప్పటికే నిషేధిత వస్తువులపై కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఉండటాన్ని అస్త్రంగా చేసుకుని సభా హక్కుల ఉల్లంఘన నోటీసు రద్దుకు డీఎంకే సభ్యులు హైకోర్టు తలుపు తట్టారు. ఈ తలుపులు తెరచుకోవడంతో ప్రస్తుతానికి సస్పెన్షన్‌ వేటు నుంచి డీఎంకే సభ్యులకు ఊరట కల్గినట్టు అయింది.

వేటుకు విరామం
సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ డీఎంకే సభ్యులు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ గురువారం న్యాయమూర్తి దురై స్వామి నేతృత్వంలోని బెంచ్‌ ముందుకు వచ్చింది. డీఎంకే తరపున సీనియర్‌ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ హాజరయ్యారు. నిషేధిత గుట్కాల వ్యవహారం, జోరుగా సాగుతున్న విక్రయాల వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బయట నిషేధిత వస్తువుల విక్రయాలు జోరుగా సాగుతున్న సమయంలో, ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా,  వాటిని ఆధారాలతో సహా నిరూపించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉందని ఈసందర్భంగా ప్రస్తావించారు.

బల పరీక్షలో నెగ్గాలన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, గుట్కా అస్త్రంతో డీఎంకే సభ్యులను సస్పెండ్‌ చేయడానికి ప్రయత్నాలు సాగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంతలో అడ్వకేట్‌ జనరల్‌ విజయనారాయణన్‌ జోక్యం చేసుకుని, అసలు ఈ పిటిషన్‌ విచారణ యోగ్యమా..? కాదా..? అన్నది తేల్చాల్సి ఉందని వాదన వినిపించారు. అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని ఇదివరకే హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ఇక్కడ గుట్కా వ్యవహారం ముడిపడి ఉందని డీఎంకే తరపున కపిల్‌ సిబల్‌ వాదన వినిపించడంతో వెనక్కు తగ్గక తప్పలేదు.

వివరణ ఇవ్వడానికి సమయం
సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు, తదితర అంశాల్ని పరిశీలించి కోర్టుకు వివరణ ఇవ్వడానికి సమయం ఇవ్వాలని అడ్వకేట్‌ జనరల్‌ విజ్ఞప్తి చేశారు. అంతవరకు సస్పెన్షన్‌ విషయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోమని కోర్టుకు హామీ ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి జోక్యం చేసుకుని, సమగ్ర వివరాలను కోర్టు ముందు ఉంచాలని పేర్కొంటూ, గుట్కా వ్యవహారంగా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు డీఎంకే సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు వీలు లేదని అసెంబ్లీ స్పీకర్‌ ధనపాల్‌కు ఆదేశాలు ఇచ్చారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసుకు తాత్కాలిక స్టే విధిస్తూ, తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేశారు. కోర్టు అభయంతో ప్రస్తుతానికి డీఎంకే సభ్యుల సస్పెండ్‌కు విరామం పడ్డట్టే. గుట్కా విషయంగాకోర్టులో పలు పిటిషన్లు సైతం ఉన్న దృష్ట్యా, తదుపరి విచారణ సమయంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయోనన్న ఎదురు చూపులు డీఎంకే వర్గాల్లో నెలకొన్నాయి.

గవర్నర్‌ చెంతకు
కోర్టు స్టేతో డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ హర్షం వ్యక్తంచేశారు. కోర్టు స్టే ప్రజాస్వామ్య విజయంగా వ్యాఖ్యానించారు. మైనారిటీలో ఉన్న సీఎం పళని స్వామి బాధ్యతాయుతంగా పదవి నుంచి తప్పుకుంటే మంచిదని హితవు పలికారు. మెజారిటీని నిరూపించుకోవాలని పదేపదే తాము డిమాండ్‌ చేస్తూ వస్తున్నామని, అయితే, దొడ్డిదారిన నెగ్గడానికి తమ మీద సస్పెన్షన్‌ వేటు వేయడానికి వ్యూహరచన చేశారని మండి పడ్డారు. ప్రస్తుతం మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా గవర్నర్‌కు లేఖల్ని సమర్పించారని అన్నారు. ఈ విషయంగా గవర్నర్‌తో భేటీకి అనుమతి కోరినట్టు తెలిపారు. పదో తేదీన అనుమతి కోరామని, అక్కడి నుంచి వచ్చే సమాధానం మేరకు తదుపరి నిర్ణయం ఉంటుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement