శ్రీగౌతమిని వెంటాడి చంపేశారు

శ్రీగౌతమిని వెంటాడి చంపేశారు - Sakshi

  • అనూహ్య మలుపు తిరిగిన రోడ్డు ప్రమాదం కేసు

  • మీడియా ముందుకు విద్యార్థిని చెల్లెలు పావని  

  • టీడీపీ నేత బుజ్జి భార్యే ఈ హత్య చేయించింది

  • బుజ్జితో మా అక్కకు గతేడాదే పెళ్లయ్యింది

  • సాక్షి ప్రతినిధి, ఏలూరు (నర్సాపురం): పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు– నరసాపురం రోడ్డులో నాలుగు రోజుల క్రితం ప్రమాదంలో మరణించిన విద్యార్థిని శ్రీగౌతమి కేసు అనూహ్య మలుపు తిరిగింది. తన అక్కను వెంటాడి మరీ చంపేశారని ఆ ప్రమాదంలోనే గాయపడ్డ శ్రీగౌతమి చెల్లెలు పావని స్పష్టం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె ఆదివారం ఇంటికి చేరుకుని విలేకరులతో మాట్లాడింది. స్థానిక తెలుగుదేశం పార్టీ నేత సజ్జా బుజ్జి భార్య శిరీష, ఆమె డ్రైవర్‌ రాంబాబు కలిసి ఈ హత్య చేశారని ఆరోపించింది.


    (చదవండి: ఐఏఎస్ కావాల్సిన యువతి..)



    కేసును పక్కదోవ పట్టించే యత్నం

    ఈ వ్యవహారంలో తెలుగుదేశం నేత కుటుంబం ఉండటంతో పోలీసులు కేసును పక్కదోవ పట్టిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవ తున్నాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులు దాటినా ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. కారు విశాఖపట్నం నుంచి వచ్చిందని చెబుతున్నారు. కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.  కేసులో పురోగతి లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.



    ప్రమాదం గురించి పావని మాటల్లోనే...

    బుధవారం సాయంత్రం నేనూ, అక్క పాలకొల్లు ఆస్పత్రికి వెళ్లి వస్తున్నాం. పాలకొల్లు దాటిన తర్వాత కొందరు కారులో వెంబడించారు. కారులోంచి కొందరు నా చున్నీ పట్టుకుని లాగేందుకు యత్నించారు. తేరుకునే లోపే మా స్కూటర్‌ను కారుతో ఢీకొట్టారు. దీంతో నేను కారుపై పడ్డాను. నన్ను కొంతదూరం ఈడ్చుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. స్థానిక టీడీపీ నేత సజ్జా బుజ్జితో అక్కకు చాలాకాలంగా పరిచయం ఉంది. 2016 జనవరిలో అక్కను బుజ్జి పెళ్లిచేసుకున్నాడు. అతడికి అంతకు ముందే శిరీషతో పెళ్లయింది. ఆమెతో తనకు పడటం లేదని, త్వరలోనే విడాకులు ఇచ్చేస్తానని బుజ్జి అక్కకు చెప్పేవాడు. బుజ్జి భార్య అక్కను రోజూ వేధించేది. చంపేస్తానని ఫోన్‌లో బెదిరించేది. శిరీషే ఈ హత్య చేయించింది. కారులో నలుగురో, ఐదుగురో ఉన్నారు. డ్రైవర్‌ ఒక్కడే ఉన్నాడని అనడం అబద్ధం. బుజ్జి, అక్క కలిసి ఉన్న ఫొటోలు, ఆసుపత్రి బిల్లులు పోలీసులు తీసుకువెళ్లారు.



    పెద్దవాళ్లకు చెప్పొచ్చు కదా!

    ‘‘నా కుమార్తెను కిరాతకంగా చంపేశారు. మా ఆయన చనిపోయారు. ఇద్దరు ఆడపిల్లలతో బతుకుతున్నాను. శ్రీగౌతమి పెద్దకొడుకుగా ఉండేది. సివిల్స్‌కు ప్రిపేరవుతోంది. శిరీష వాళ్ల ఆయనకు మా అమ్మాయితో సంబంధం ఉంటే నాతోటో, పెద్దలతోనో చెప్పొచ్చు. లేదంటే పోలీసు కేసు పెట్టవచ్చు, కోర్టుకు వెళ్లొచ్చు. ఏకంగా చంపించేస్తారా? కచ్చితంగా శిరీషే ఈ హత్య చేయించింది. మా కుటుంబానికి న్యాయం జరగాలి’’

        – టి.అనంతలక్ష్మి, శ్రీగౌతమి తల్లి

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top