ఎస్పీ కోసం గాలింపు | Sakshi
Sakshi News home page

ఎస్పీ కోసం గాలింపు

Published Thu, Jun 29 2017 4:23 AM

ఎస్పీ కోసం గాలింపు - Sakshi

తిరువళ్లూరు ఎస్పీ కార్యాలయంలో రహస్య విచారణ
సన్నిహితుల వద్ద సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం
పొన్నేరిలోనూ ఖాదర్‌బాషా పంచాయతీ లీలలు

తిరువళ్లూరు: రూ.20 కోట్ల రూపాయలు విలువ చేసే పంచలోహ విగ్రహాలను అక్రమంగా తరలించడంతో పాటు వాటిని విక్రయించిన కేసులో చిక్కుకుని పరారీలో ఉన్న డీసీబీ డీఎస్పీ ఖాదర్‌బాషా ఆచూకీ కోసం తిరువళ్లూరులో రహస్య విచారణను చెన్నై పోలీసులు చేపట్టారు. మదురై జిల్లా అరుప్పుకోటై సమీపంలోని ఆలపాడి ప్రాంతానికి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ ఆరోగ్యరాజ్‌కు చెందిన వ్యవసాయ భూమిలో 2008వ సంవత్సరం వ్యవసాయ పనులను సాగించారు.

అప్పట్లో అరక దున్నుతుండగా శివపార్వతీల పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. అయితే వ్యవసాయభూమిలో బయటపడ్డ పంచలోహ విగ్రహాలపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వని ఆరోగ్యరాజ్‌ తన సన్నిహితుడు సంతానం కలిసి రహస్యంగా దాచి పెట్టారు. అనంతరం అదే ప్రాంతానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ సుందరమూర్తి చేత ఫొటోలు తీయించి అంతర్జాతీయ స్మగ్లర్‌కు పంపించారు. ఈ విషయం  ఆలస్యంగా బయటకు పొక్కడంతో  అక్కడే సీఐగా పనిచేస్తున్న ఖాదర్‌బాష, హెడ్‌కానిస్టేబుల్‌ సుబ్బురాజ్‌ కలిసి ఆరోగ్యరాజ్‌ను పలిపించి తమదైన శైలిలో విచారణ చేపట్టి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.

అంతర్జాతీయ స్మగ్లర్‌తో చేతులు కలిపిన వైనం:  ఆరోగ్యరాజ్‌ నుంచి పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ ఖాదర్‌బాష, హెడ్‌కానిస్టేబుల్‌ సుబ్బురాజ్‌ విగ్రహంపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అంతర్జాతీయ స్మగ్లర్‌ దీనదయాళన్‌తో సంప్రదింపులు జరిపారు. అనంతరం  ఎవ్వరీకి తెలియకుండా శివపార్వతీల పంచలోహ విగ్రహాలను 20 లక్షల రూ పాయలకు విక్రయించి తద్వారా వచ్చిన సొమ్మును ఇద్దరు కలిసి పంచుకున్నారు.

వెలుగులోకి ఇలా:  
గమ్మత్తుగా సాగిన విగ్రహల స్మగ్లింగ్‌ 2016 జూన్‌1న ఢిల్లీలో అంతర్జాతీయ స్మగ్లర్‌ దీనదయాళన్‌ అరెస్టుతో తిరువళ్లూరు డీఎస్పీ మెడకు ఉచ్చుబిగిసింది. దీనదయాళన్‌ వద్ద విచారణ జరిపిన పోలీసులు తిరువళ్లూరు డీఎస్పీ ఖాదర్‌బాష నుంచి సైతం విగ్రహాలను కొనుగోలు  చేసినట్టు నిర్ధారించి కేసు నమోదు చేశారు. సుబ్బురాజ్‌ను అరెస్టు చేసిన పోలీసులు డీఎస్పీ ఖాదర్‌బాష కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పరారీలో డీఎస్పీ: సుబ్బురాజ్‌ అరెస్టు విషయం తెలుసుకున్న డీఎస్పీ మెడికల్‌ లీవు పెట్టి వెళ్లిపోయారు. అయితే డీఎస్పీ అచూకీ కోసం  ఆరుగురితో కూడిన రెండు బృందాలు తిరువళ్లూరు ఎస్పీ కార్యాలయం, పోలీసు క్వార్టర్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో రహస్యంగా తనిఖీ చేశారు. కాగా పొన్నేరీ డీఎస్పీగా ఉన్నప్పుడు భూసంబంధిత వివాదంలో తలదూర్చి రూ.80 లక్షల వరకు వసూలు చేశారన్న విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు షాక్‌ తిన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ చేపట్టిన పోలీసులు, సాయంత్రం ఏడున్నర వరకు విచారణను కొనసాగించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడడానికి నిరాకరించిన విచారణ బృందం, కొన్ని కీలక సమాచారాన్ని  రాబట్టామని చెప్పి వెళ్లిపోయారు.

Advertisement
Advertisement