ఊపిరి పీల్చుకున్న ముంబై | Sakshi
Sakshi News home page

ఊపిరి పీల్చుకున్న ముంబై

Published Sat, Aug 1 2015 2:05 AM

Mumbai breath

♦ యాకూబ్ మెమన్ ఉరి నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్
♦ అంతా సవ్యంగా జరగడంతో వీడిన ఉత్కంఠ
♦ ముఖ్య భూమిక పోషించిన రాష్ట్ర పోలీసు శాఖ
 
 సాక్షి, ముంబై : 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలు మొదలుకుని అంత్యక్రియల వరకు అన్నీ ప్రశాంతంగా జరగడంతో ముంబైకర్లు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విధి నిర్వహించిన వేలాది మంది పోలీసులకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాన రహదారులు, కీలక రైల్వే స్టేషన్ల వద్ద అదనపు పోలీసులను మోహరించారు. వాస్తవ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుని, పోలీసులకు ఆదేశాలిచ్చేందుకు రాష్ట్ర డీజీపీ సంజీవ్ దయాల్, నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపారు.  వీరికి తోడుగా అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు దేవేన్ భారతి, అతుల్‌చంద్ర కులకర్ణి, ఐదుగురు అప్పర్ పోలీసు కమిషనర్లు, 12 మంది డిప్యూటీ పోలీసు కమిషనర్లు రాత్రంతా మేలుకుని పరిస్థితులు పర్యవేక్షించారు. ఎట్టకేలకు గురువారం సాయంత్రం యాకూబ్ అంత్యక్రియలు ప్రశాంతంగా పూర్తికావడంతో ఇటు పోలీసులు, అటు రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

 ఎప్పుడు ప్రథమ స్థానంలోనే..
 దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం ఎప్పుడూ ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ప్రథమస్థానంలో ఉంటుంది. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా ముందుగా ముంబైనే అప్రమత్తం చేస్తారు. గతంలో అనేక మత ఘర్షణలు, బాంబు పేలుళ్ల సంఘటనలను 1.50 కోట్ల మంది ముంబైకర్లు కళ్లతో చూశారు. ఇలాంటి వాతావరణంలోనే నాటకీయ పరిణామాల మధ్య జరిగిన యాకూబ్ ఉరి, ఆ తరువాత భారీ జనసందోహం మధ్య జరిగిన అంత్యక్రియలతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ప్రజలు ఆందోళన చెందారు.

రోడ్లపై కాకుండా మసీదులు, ప్రార్థన మందిరాల వద్ద పోలీసులు డేగ కళ్లతో పహారాకాశారు. శాంతి, భద్రతలకు భంగం వాటిళ్లకుండా ముందు జాగ్రత్త చర్యగా నేరచరిత్ర ఉన్న 750 మందిని అదుపులోకి తీసుకున్నారు. యాకూబ్ నివాసముండే బిస్మిల్లా మంజిల్ భవనం వద్ద ఏకంగా 800 మంది సాయుధ పోలీసులను మోహరించారు. వీరంతా విశ్రాంతి, భోజనం లేకుండానే గురువారం అర్ధరాత్రి వరకు విధుల్లో ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement