మహిళా క్రికెట్ లో తొలిసారి.. | Sakshi
Sakshi News home page

మహిళా క్రికెట్ లో తొలిసారి..

Published Tue, Jun 27 2017 1:30 PM

మహిళా క్రికెట్ లో తొలిసారి..

డెర్బీ: మహిళల వన్డే ప్రపంచకప్ను భారత జట్టు ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. శనివారం పటిష్టమైన ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన భారత జట్టు శుభారంభం చేసింది. అయితే భారత్ జట్టు విజయంతో పాటు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మహిళల క్రికెట్ లో అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ను ప్రవేశపెట్టిన తరువాత దాన్ని ఉపయోగించిన తొలి జట్టుగా రికార్డులెక్కింది.  ఈ విషయాన్ని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మహిళల క్రికెట్ లో డీఆర్ఎస్ను వినియోగించిన మొదటి జట్టుగా భారత్ నిలిచిన విషయాన్ని స్పష్టం చేశారు.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో భాగంగా దీప్తిశర్మ వేసిన 18ఓవర్ తొలి బంతిని ఇంగ్లండ్ బ్యాట్స్వుమన్ నాటలీ స్క్రివర్ స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించారు. అది ఆమె గ్లోవ్స్ ను తాకి భారత వికెట్ కీపర్ సుష్మా వర్మ చేతుల్లో పడింది. దీనిపై అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ తిరస్కరించారు. దాంతో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ డీఆర్ఎస్ను ఆశ్రయించి సక్సెస్ అయ్యారు. తద్వారా మహిళల క్రికెట్ లో డీఆర్ఎస్ ను తొలిసారి వినియోగించుకోవడమే కాకుండా, సక్సెస్ అయిన మొదటి జట్టుగా కూడా భారత్ గుర్తింపు సాధించింది.

Advertisement
Advertisement