కశ్యప్ శుభారంభం | Sakshi
Sakshi News home page

కశ్యప్ శుభారంభం

Published Thu, Apr 24 2014 1:38 AM

కశ్యప్ శుభారంభం

శ్రమించి నెగ్గిన సింధు, గురుసాయిదత్
 శ్రీకాంత్ పరాజయం    
 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
 
 గిమ్‌చియోన్ (కొరియా): అనుకూలమైన ‘డ్రా’ను సద్వినియోగం చేసుకొని... కనీసం కాంస్యం సాధించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన భారత స్టార్ పారుపల్లి కశ్యప్ తొలి అడ్డంకిని అధిగమించాడు. బుధవారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో కశ్యప్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో 21-14, 21-17తో గో సూన్ హువాట్ (మలేసియా)పై గెలిచాడు. 35 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్ రెండు గేముల్లోనూ స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సూ జెన్ హావో (చైనీస్ తైపీ)తో కశ్యప్ ఆడతాడు. గతేడాది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో సూ జెన్ హావోతో ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వరుస గేముల్లో నెగ్గాడు. మరోవైపు పురుషుల సింగిల్స్ బరిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల్లో గురుసాయిదత్ ముందంజ వేయగా... కిడాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. తొలి రౌండ్‌లో గురుసాయిదత్ 22-20, 23-21తో ఫెట్‌ప్రదాబ్ ఖోసిట్ (థాయ్‌లాండ్)పై కష్టపడి గెలుపొందాడు. ప్రపంచ చాంపియన్ లిన్ డాన్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 7-21, 14-21తో ఓడిపోయాడు.
 
 మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 10వ ర్యాంకర్ పి.వి.సింధు శ్రమించి గెలిచింది. ప్రపంచ 147వ ర్యాంకర్ చుయెంగ్ ఎన్‌గాన్ యి (హాంకాంగ్)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 21-15, 15-21, 21-18తో విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 16వ ర్యాంకర్ హిరోస్ (జపాన్)తో సింధు తలపడుతుంది. హిరోస్‌తో గతంలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ సింధు ఓడిపోవడం గమనార్హం.
 
 మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప (భారత్) జోడి 21-18, 21-15తో ఫూ మింగ్తియాన్-నియో వానెస్సా (సింగపూర్) జంటను ఓడించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) 21-16, 13-21, 20-22తో లో జువాన్ షెన్-హెగ్ నెల్సన్ (మలేసియా) చేతిలో; అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా (భారత్) 18-21, 19-21తో జాంగ్ వెన్-వాంగ్ యిల్వ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు.
 

Advertisement
Advertisement