రాష్ట్ర హోదానే మా ప్రధాన ఎజెండా | Sakshi
Sakshi News home page

రాష్ట్ర హోదానే మా ప్రధాన ఎజెండా

Published Fri, Apr 26 2019 2:43 AM

Arvind Kejriwal promises to get full statehood for Delhi - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఎజెండాతోనే లోక్‌సభ ఎన్నికలకు వెళుతున్నామని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కన్వీనర్, ఢిల్లీ సీఎంæ కేజ్రీవాల్‌ తెలిపారు.  మోదీ–అమిత్‌షా ద్వయాన్ని అధికారానికి దూరంగా ఉంచేందుకు ఏ లౌకికవాద కూటమికైనా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. మే 12న ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌ గురువారం ఆప్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇచ్చే కూటమికి తాము మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించారు. జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌) ప్రజలకు కళాశాలలు, ఉద్యోగాల్లో 85 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని మేనిఫెస్టోలో వెల్లడించారు. ఈ మేనిఫెస్టోను ఆప్‌ రెండుగా విభజించింది. ఒక విభాగంలో పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లేకుండానే గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం ఏం సాధించిందో వివరించింది. ఒకవేళ హోదా లభిస్తే ఏమేం చేస్తామో మరో భాగంలో ప్రస్తావించింది.

రాహులే కారణం..
ఢిల్లీకి రాష్ట్రహోదా ఇస్తామని చెప్పి బీజేపీ ప్రజలను మోసం చేసిందని కేజ్రీవాల్‌ మండిపడ్డారు. లండన్, బెర్లిన్, మాస్కో, వాషింగ్టన్‌ వంటి నగరాల్లో పోలీసులతో పాటు ఇతర అధికారుల నియామకాలు, బదిలీలు, నగర ప్రణాళిక విషయంలో స్థానిక ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయనీ, అక్కడ ఎదురుకాని ఇబ్బందులు ఇక్కడెందుకు వస్తాయని ప్రశ్నించారు. ఒకవేళ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దానికి కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ తమతో పొత్తు కుదర్చుకోకుండా మాటలకే పరిమితమైందన్నారు. కాంగ్రెస్‌ కోరినట్లు 3 లోక్‌సభ స్థానాలను ఇచ్చుంటే వాటిని బీజేపీ గెలుచుకునేదన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement