ఢిల్లీకి ‘మహా’ పొత్తుల గొడవ | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి ‘మహా’ పొత్తుల గొడవ

Published Mon, Sep 22 2014 3:32 AM

ఢిల్లీకి ‘మహా’ పొత్తుల గొడవ - Sakshi

* శివసేన వైఖరిపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చ
* 119 మించి ఇవ్వబోమని తేల్చిచెప్పిన శివసేన
* 135కి తగ్గమంటున్న బీజేపీ

 
ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. 151 స్థానాలకు పోటీ చేసి తీరుతామని తెగేసి చెబుతున్న శివసేన.. బీజేపీకి 119కి సీట్లకు మించి ఒక్కటి కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఇదే తమ తుది మాట అని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. 135 స్థానాలకు తక్కువగా పోటీ చేయవద్దని, అవసరమైతే ఒంటరిగా బరిలో దిగుదామన్న పార్టీ మహారాష్ట్ర శాఖ వాదనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తదితరులతో కూడిన కమిటీ చర్చించింది. అయితే, శివసేనతో పొత్తును వదులుకోవడంపై మోదీ, అమిత్‌షాలు అంత ఆసక్తి చూపలేదని సమాచారం.
 
సమావేశం మధ్యలో మోదీ, షాలు కాసేపు ఏకాంతంగా చర్చలు జరిపారని, ఆ తరువాత అమిత్ షా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్‌లో మాట్లాడారని తెలిసింది. ఆ తరువాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలోనూ ఈ అంశంపై చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి పదవి శివసేనకు ఇచ్చేందుకు అంగీకరిస్తే.. శివసేన మరి కొన్ని సీట్లు బీజేపీకి ఇచ్చేందుకు ఒప్పుకోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మెుత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నారుు. ఆదివారం ఉదయం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం తర్వాత శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కార్యకర్తలతో మాట్లాడారు. ‘బీజేపీకి ఇంకెలాంటి రారుుతీ ఇవ్వదలుచుకోలేదు. ప్రతిపక్ష పార్టీల మహాయుతి (విపక్షాల మహా కూటమి) చెదిరిపోకుండా ఉండేందుకు నేనో చివరి ప్రయత్నం చేస్తున్నా.
 
119 సీట్లు బీజేపీకి వదిలి మనం 151 స్థానాల్లో బరిలోకి దిగుతాం. మిగతావి ఇతర మిత్రపక్షాలకు ఇస్తాం’ అని చెప్పారు. ‘2002 గుజరాత్ ఘర్షణల అనంతరం శివసేన దివంగత అధినేత బాల్ థాకరే మీకు వెన్నుదన్నుగా నిలిచిన విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి’  అంటూ ప్రధాని మోదీకి ఠాక్రే సూచించారు. గోధ్రా అల్లర్ల తర్వాత మోడీని గుజరాత్ సీఎం పదవి నుంచి తప్పించాలని అందరూ అన్నారని, అయితే హిందూ సిద్ధాంతం కోసం ఆయనను పదవిలో ఉంచాలని బాలసాహేబ్ ఒక్కరే  అద్వానీకి నచ్చజెప్పారన్నారు. కూటమి కొనసాగాలన్నదే తన అభిమతమని, అన్ని సీట్లకు పోటీ చేసేందుకు సైతం తాము సిద్ధమని ఉద్ధవ్ స్పష్టం చేశారు. అయితే శివసేన తుది ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని మహారాష్ట్ర బీజేపీ నేతలు పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement