కుంబ్లేలో ఏంజరిగిందంటే.. | Sakshi
Sakshi News home page

కుంబ్లేలో ఏంజరిగిందంటే..

Published Sun, May 1 2016 10:17 AM

కుంబ్లేలో ఏంజరిగిందంటే..

కాసరగోడ్: ప్రపంచంలో అత్యధికంగా చోటుచేసుకునే నేరం ఏది? పోనీ, కేసులు నమోదుకు చేయడానికి పోలీసులు వెనుకాడే నేరం ఏది? రెండు ప్రశ్నలకు సమాధానం ఒకటే.. దొంగతనం. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న పోలీసు కేసుల్లో 60 శాతం దొంగతనాలకు సంబంధించినవే. పెద్దవి, ఒక మోస్తారు, చిన్నతరహా దొంగతనాలపై కేసులు నమోదుచేసే పోలీసులు.. బిందె అపహరణ, చెంబు దొంగతనం లాంటి సిల్లీ సంఘటనలను లైట్ తీసుకుంటారు. లేకుంటే కేసుల్లో దొంగతనాల శాతమే 80దాకా ఉండేది!

64 కళల్లో ఒకటిగా భావించే దొంగతనం చేయడమే దుస్సాహసమనుకుంటే, ఎవ్వరికీ దొరకకుండా పారిపోగలగడం సవాలే! ఆ సవాలును స్వీకరించలేక, పారిపోబోయి బావిలో బొక్కబోర్లాపడి అనూహ్యరీతిలో పట్టుబడ్డ దొంగల ఉదంతం కేరళలోని కుంబ్లే పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల చెప్పిన వివరాలిలాఉన్నాయి..

కుంబ్లే టౌన్ (కాసరగోడ్ జిల్లా)లో నివసించే ఇబ్రహీమ్ అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. అందరూ గాఢ నిద్రలో ఉండగా, లోపలికి వచ్చిన ఇద్దరు దొంగలు బీరువా పగలగొట్టే ప్రయత్నం చేశారు. అలికిడికి నిద్రలేచిన ఇబ్రహీమ్ సోదరుడు.. దొంగలను పసిగట్టి గట్టిగా కేకలు వేశాడు. ఆ కేకలకు వాళ్ల వీధివిధంతా మేల్కొంది. కర్రలు చేతబుచ్చుకున్న యువకులు దొంగలను తరుముకుంటూ వెళ్లారు.

ఎంత దూరం వెళ్లినా సదరు దొంగలు కనపడకపోవడంతో తిరిగి ఇళ్లకు బయలుదేరారు. దారి మధ్యలో పాడుబడ్డ బావి నుంచి మూలుగులు వినిపించడంతో యువకులు లోపలికి తొంగిచూశారు. పారిపోయే ప్రయత్నంలో పొరపాటున బావిలోపడి కాళ్లూ చేతులూ విరగొట్టొకున్న ఆ దొంగలను బయటికి తీసేందుకు ఏకంగా అగ్నిమాపక సిబ్బంది రంగలంకి దిగాల్సివచ్చింది. పెద్ద పెద్ద తాళ్లు, నిచ్చెనలతో దొంగలను వెలికితీసిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆసుపత్రికి తరలించారు. దొంగలిద్దరూ కర్ణాటకకు చెందినవారిగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement