ముంబై మిస్టరీ! | Sakshi
Sakshi News home page

ముంబై మిస్టరీ!

Published Mon, Jul 6 2015 9:54 AM

ముంబై మిస్టరీ!

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రతి నెలా 884 మంది అదృశ్యమవుతున్నట్టు పోలీసుశాఖ ప్రకటించింది. వీరిలో 90 శాతం మంది ఆచూకీ కనుకుంటున్నామని ప్రకటించింది. అయితే బాధితుల్లో పురుషులతో పోలిస్తే బాలికలు, మహిళల సంఖ్య అధికంగా ఉంది.
 
ముంబై:
మెట్రో నగరం ముంబైలో ప్రతి నెలా సగటున 884 మంది అదృశ్యమవుతున్నట్టు తేలింది. వీరిలో ఎక్కువ మంది మైనర్ బాలికలే ఉన్నారని పోలీసుల గణాంకాలు తెలియజేస్తున్నాయి. గత దశాబ్దకాలంగా ఈ పరిస్థితి కొనసాగుతోందని నగర పోలీసులు తెలిపారు. వీరిలో అత్యధికుల ఆచూకీని తిరిగి కనుగొన్నారు. 2005 నుంచి ఈ ఏడాది మే వరకు మొత్తం 1,10,547 మంది ముంబైకర్లు కనిపించకుండాపోయారు. వీరిలో 1,00,439 మంది ఆచూకీ కనుగొన్నా 10,108 మంది జాడ ఇప్పటికీ దొరకలేదు. ముంబై సీఐడీ వ్యక్తుల అదృశ్య విభాగం ఈ గణాంకాలు విడుదల చేసింది. బాధితుల్లో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య అధికంగా ఉంది. వీరిలో 18,547 మంది బాలికలు కాగా, 37,603 మంది మహిళలు, 17,195 మంది బాలురు, 37,202 మంది పురుషులు ఉన్నారు.

ప్రతి నెలా అదృశ్యమవుతున్న 884 మంది 90 శాతం .. అంటే 803 మంది జాడ కనుగొంటున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో అదృశ్యమైన 582 మంది మైనర్ బాలికలు, 2,944 మంది మహిళల ఆచూకీ మాత్రం ఇప్పటికీ దొరకలేదు. ముంబైలో 50 శాతం మంది ప్రజలు మురికివాడల్లో ఉంటున్నారని, అదృశ్యమయ్యేవారిలో అత్యధికులు గుడిసెల వాసులేనని సీఐడీ అధికారి ఒకరు వివరించారు. ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలు, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో తప్పిపోయిన, అదృశ్యమైన వారిని గుర్తించడం సులువవుతోందని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement