ఇద్దరు ముఖ్యమంత్రులతో ప్రకటన ఇప్పిస్తాం | Sakshi
Sakshi News home page

ఇద్దరు ముఖ్యమంత్రులతో ప్రకటన ఇప్పిస్తాం

Published Tue, Jun 24 2014 11:49 PM

ఇద్దరు ముఖ్యమంత్రులతో ప్రకటన ఇప్పిస్తాం - Sakshi

 ‘‘తెలుగు సినీ పరిశ్రమను వైజాగ్‌కు తరలిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. తెలుగు సినిమా హైదరాబాద్‌లోనే స్థిరంగా ఉంటుంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్‌గారిని కూర్చోబెట్టి వారిద్దరి ద్వారా ఈ విషయంపై ఓ ప్రకటన ఇప్పించనున్నాం. వారిద్దరూ కలిసి ఓ ప్రకటన చేస్తే ఇక ఈ విషయంపై ఎలాంటి సందేహాలూ ఉండవు’’ అని తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు మురళీమోహన్ అన్నారు. 
 
 మంగళవారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మురళీ మోహన్ మాట్లాడుతూ -‘‘చెన్నయ్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కి తరలిరావడానికి 20 ఏళ్లు పట్టింది. మళ్లీ ఇక్కడ్నుంచీ వైజాగ్ అంటే... మాలాంటి వారికి తేలికే కానీ, పరిశ్రమలోని చిన్న చిన్న కార్మికులకు, జూనియర్ ఆర్టిస్టులకు అది కష్టతరమైన విషయం’’ అని చెప్పారు. 
 
 ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఈ విషయంపై కలిశామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని మురళీమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్‌తో పాటు నటుడు రఘుబాబు పుట్టిన రోజును కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. పరుచూరి గోపాలకృష్ణ, మహర్షి రాఘవ, కృష్ణుడు, ఉత్తేజ్, శశాంక్ తదితరులు కూడా  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement