విషాదం మిగిల్చిన భూకంపం | Sakshi
Sakshi News home page

విషాదం మిగిల్చిన భూకంపం

Published Fri, Aug 26 2016 2:36 AM

విషాదం మిగిల్చిన భూకంపం

ఇటలీ భూకంప మృతులు 247
ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు

అక్యుమోలి: ఎటు చూసినా శిథిలాలు.. కుప్పకూలిన భవనాలు, వంతెనలు.. శవాల కుప్పలు.. ఆర్తనాదాలు.. తీవ్ర భూకంపంతో చిగురుటాకులా వణికిన ఇటలీలో తాజా పరిస్థితి ఇది. బుధవారం ఇటలీని 6.2 తీవ్రతతో భూకంపం అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. భూకంప మృతుల సంఖ్య 247కి చేరింది. వందలాది మంది తీవ్రంగా గాయపడగా మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది, వలంటీర్లు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇటలీలోని పర్వత ప్రాంతాల్లో అనేక గ్రామాలు భూకంప తాకిడికి ఆనవాళ్లు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి.

ఈ గ్రామాల్లో బతికున్న వారిని రక్షించేందుకు అత్యవసర బృందాలు రాత్రి  సమయాల్లోనూ గాలింపు జరుపుతున్నాయి. ఇటలీ ప్రధానమంత్రి మాటో రెంజి భూకంప ప్రభావానికి గురైన అమట్రికా గ్రామంలో పర్యటించి పరిస్థితి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూకంప మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు వందలాది మంది తీవ్రమైన చలిలో టెంట్లలోనే రాత్రంతా గడిపారు. భూప్రకంపనల భయంతో చాలా మంది ఇళ్లకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. తమ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఏమైపోయారో తెలియక చాలా మంది కన్నీరుమున్నీరవుతున్నారు. వారిని సురక్షితంగా బయట పడేయాలని దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు. 2009లో భూకంపం తాకిడికి గురైన లాక్విలా నగరానికి సమీపంలోనే తాజాగా భూప్రకంపనలు సంభవించాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement