‘హోదా’కు అడ్డు..బాబు అవినీతే | Sakshi
Sakshi News home page

‘హోదా’కు అడ్డు..బాబు అవినీతే

Published Sun, Jul 31 2016 2:10 AM

‘హోదా’కు అడ్డు..బాబు అవినీతే - Sakshi

చంద్రబాబు.. ప్రత్యేక హోదా సంజీవని కాదన్నారు 
కేసుల భయంతో ప్రధానిని నిలదీయలేకపోతున్నారు
రాష్ట్రానికి నష్టం జరిగినా ఫర్వాలేదు తాము మాత్రం
ఎన్డీయేలోనే కొనసాగుతామంటున్నారు
పార్లమెంట్ సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీకే దిక్కులేదా?
హోదాపై కేంద్రం సాకులు వెతకడానికి బాబే కారణం
బీజేపీ, టీడీపీ ఐదు కోట్ల మందిని మోసగించాయి
వాటి వైఖరికి నిరసనగా రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాం

- విపక్షనేత వైఎస్ జగన్ మండిపాటు
- ఆగస్టు 2న పార్టీలకతీతంగా బంద్‌లో పాల్గొందాం

 రాజ్యసభలో బీజేపీ నేతల ప్రసంగాలు, చంద్రబాబు మాట్లాడిన తీరు చూశాక ఇంత దారుణంగా అబద్ధాలాడుతారా! అని ఆశ్చర్యం కలిగింది. 2014 ఫిబ్రవరి 20న రాష్ట్రాన్ని విడగొడుతూ మిగిలిపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అప్పటి ప్రధాని ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే.. ఐదేళ్లు సరిపోదు, పదేళ్లు కావాలని బీజేపీ, టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. అలా పార్లమెంట్‌లో ఇచ్చిన హామీకే దిక్కు లేకపోతే ఎలా? ఈ పరిస్థితిని చూసి ఇక భావితరాలు ఏమనుకోవాలి?    - వైఎస్ జగన్

 
 సాక్షి, హైదరాబాద్ : ‘‘ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు చాలదు, పదిహేనేళ్లు కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు నాయుడు... ఎన్నికలు ముగిశాక ప్లేటు ఫిరాయిస్తూ ప్రత్యేక హోదా ఏమీ సంజీవని కాదని నీరుగార్చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలా మాట్లాడేసరికి ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఫర్వాలేదనే ఆలోచనకు బీజేపీ నేతలు వచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సాకులు వెదకడానికి ప్రధాన కారణం చంద్రబాబు వైఖరే. చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను రూ.20 కోట్లకు కొనుగోలు చేస్తూ వీడియో టేపుల సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన తరువాత వారానికే ప్రత్యేక హోదాపై మాట మార్చేశారు.

రాజధాని శంకుస్థాపన సభకు ప్రధాని మోదీని ఆహ్వానించి కూడా ప్రత్యేక హోదా కావాలని కనీసం అడగలేకపోయారు. కేసుల భయంతోనే ప్రధానిని గట్టిగా నిలదీయలేకపోతున్నారు’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ, టీడీపీలు ప్రత్యేక హోదా అంశాన్ని ఖూనీ చేసి, ఐదు కోట్ల మంది ప్రజలను దారుణంగా మోసగించాయని ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో తేల్చిచెప్పిన నేపథ్యంలో జగన్ శనివారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీకే దిక్కు లేకపోతే ఎలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా వ్యవహారంలో బీజేపీ, టీడీపీల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. ప్రత్యేక హోదాను సాధించేంత వరకూ ఏపీ ప్రజలు కలిసికట్టుగా పోరాడాలని చెప్పారు. బీజేపీ, టీడీపీల మోసపూరిత వైఖరికి నిరసనగా తమ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 2న రాష్ట్రబంద్‌లో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా కావాలన్న బలీయమైన ఆకాంక్షను చాటి చెప్పాలని కోరారు. విలేకరుల సమావేశం జగన్ ఇంకా ఏం చెప్పారంటే...

 ‘బ్లాక్ అవుట్’ రోజులు గుర్తుకొచ్చాయి
 రాజ్యసభలో గురు, శుక్రవారాల్లో ఏం జరిగిందో అందరం చూశాం. 2014లో రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు లోక్‌సభ నుంచి రాష్ట్ర ఎంపీలందరినీ బయటకు పంపేశారు. టీవీ ప్రసారాలను సైతం నిలిపివేశారు. ‘బ్లాక్ అవుట్’ చేసి రాష్ట్రాన్ని విడగొట్టారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో కేంద్రం వ్యవహరించిన తీరును చూసినప్పుడు ఆ బ్లాక్ అవుట్ రోజులు మళ్లీ గుర్తుకొచ్చాయి. బీజేపీ నేతలు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెబుతూ కుంటిసాకులు వెతికారు. అదయ్యాక సీఎం చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తారు, అల్టిమేటం జారీ చేస్తారని ఎదురుచూశాం. కానీ, మీరు(బీజేపీ) ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. మేం(టీడీపీ) ఎన్డీయే ప్రభుత్వంలోనే కొనసాగుతాం. మేం మాత్రం అల్టిమేటం ఇవ్వబోం, ప్రజలకు నష్టం జరిగినా ఫర్వాలేదు.. అన్న విధంగా మాట్లాడారు. నిజంగా అటువైపు బీజేపీ, ఇటువైపు చంద్రబాబు.. ఇద్దరూ కలిసి ఐదు కోట్ల మంది ప్రజలను దగా చేశారు.

 సిగ్గుతో తల వంచుకోవాలి
 రాజ్యసభలో బీజేపీ నేతల ప్రసంగాలు, చంద్రబాబు మాట్లాడిన తీరు చూశాక ఇంత దారుణంగా అబద్ధాలాడుతారా! అని ఆశ్చర్యం కలిగింది. 2014 ఫిబ్రవరి 20న రాష్ట్రాన్ని విడగొడుతూ మిగిలిపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. విభజన వల్ల మీకు(ఏపీ) జరిగే నష్టాన్ని పూడ్చేందుకు ప్రత్యేక హోదా ఇస్తాం, న్యాయం చేస్తామన్నారు. అప్పటి ప్రధాన మంత్రి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఐదేళ్లు సరిపోదు, పదేళ్లు కావాలని బీజేపీ, టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. అలా పార్లమెంట్‌లో ఇచ్చిన హామీకే దిక్కు లేకపోతే, ఇలా నేతలు అబద్ధాలాడుతున్నా నిలదీయని పరిస్థితిలో ప్రజాస్వామ్యం ఉందంటే ఒక పౌరుడిగా సిగ ు్గతో తల వంచుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని చూసి ఇక భావితరాలు ఏమనుకోవాలి?

 చంద్రబాబు ఏడ్పులు ఏడుస్తాడు కానీ...
 ప్రత్యేక హోదా ఇవ్వలేం అని బీజేపీ వాళ్లు తేల్చి చెప్పినా అదే ప్రభుత్వంలో కొనసాగుతానని చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కార్చడం బాధ కలిగిస్తోంది. ఏడ్పులు ఏడుస్తాడు కానీ ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తానని అల్టిమేటం ఇవ్వడు. ఇలాంటి డ్రామాలను చూసినపుడు రాజకీయాలు దిగజారిపోయాయని బాధ కలుగుతోంది.

  ఆర్థిక సంఘానికి సంబంధం ఏమిటి?
 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదు, ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు మధ్య గల తేడాలను చెప్పలేదు కాబట్టి ఏపీకి హోదా ఇవ్వలేకపోతున్నామని అరుణ్ జైట్లీ రాజ్యసభలో మొసలి కన్నీరు కార్చారు. ఓవైపు హోదా ఉన్న, హోదా లేని రాష్ట్రాల మధ్య తేడాను గుర్తించలేదని చెబుతూ మరోవైపు ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కొనసాగిస్తున్నామని పార్లమెంట్‌లో మా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను ఉపసంహరించుకుంటున్నారా? అని అడిగితే అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని సమాధానం వచ్చింది. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఉన్న, హోదా లేని రాష్ట్రాల మధ్య తేడా గుర్తించలేదంటారు, మరోవైపు 11 రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తామంటారు. వాళ్లు ఒకదానికొకటి పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ల సమాధానాన్ని బట్టే వారు చేసేది ఎంత అన్యాయమో తెలిసిపోతోంది. అసలు 14వ ఆర్థిక సంఘం పరిధి రెండు అంశాలకే పరిమితమై ఉంటుంది. కేంద్రం వసూలు చేసే పన్నులను రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయాలనేది మొదటిదైతే, ప్రణాళికేతర గ్రాంట్లు, రుణాలు ఇవ్వడానికి మార్గదర్శకాలను రూపొందించడం మరొకటి. ప్రత్యేక హోదా ఇవ్వాలా? వద్దా? అనేది తేల్చే అధికారం ఆర్థిక సంఘం చేతిలో ఉండదు.

 ప్రధానికే సంపూర్ణాధికారం
 ప్రత్యేక హోదాను కల్పించే అధికారం నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు ఉంది. దానికి చైర్మన్ ప్రధానమంత్రి. ప్రణాళికా సంఘానికి గానీ, దాని స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్‌కు గానీ చైర్మన్ ప్రధానే. కేంద్ర మంత్రివర్గ సమావేశాలకు కూడా ప్రధానే అధ్యక్షత వహిస్తారు. అందువల్ల ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలా? వద్దా? అనే అధికారం ప్రధాన మంత్రి చేతిలోనే ఉంటుంది. అది కేవలం ఎగ్జిక్యూటివ్ (కార్యనిర్వాహక) నిర్ణయం మాత్రమే. శాసన వ్యవస్థ (పార్లమెంట్) చేయాల్సిన నిర్ణయం కాదనేది తెలిసిపోతూనే ఉంది. అది ఎగ్జిక్యూటివ్ నిర్ణయం కాబట్టే ఆనాడు ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఒకేఒక్క సంతకంతో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించారు.

అది ఎగ్జిక్యూటివ్ నిర్ణయం కాబట్టే 13 జిల్లాల ఏపీకి ప్రత్యేక హోదా కావాలని 2014 మార్చి 1న కేంద్ర కేబినెట్‌లో నిర్ణయించి, దానిని అమలు చేయాల్సిందిగా ప్రణాళికా సంఘానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక హోదాతోపాటు పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడం, కేంద్రం నుంచి వచ్చే విద్యుత్ వాటాలు పంచుకోవడం వంటి వాటిపై కూడా అదే సమయంలో నిర్ణయం తీసుకున్నారు. ముంపు మండలాలను ఏపీలో కలపడం, విద్యుత్.. ఈ రెండు అంశాలకు చట్ట సవరణ అవసరం కనుక పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకుని అమలు చేశారు. ప్రత్యేక హోదా అనేది పార్లమెంట్‌లో నిర్ణయం తీసుకునేది కాదు కాబట్టే మంత్రివర్గంలో ఆమోదించి ప్రణాళికా సంఘానికి పంపారు.

 మీ మేనిఫెస్టో మాటేమిటి?
 కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారి మాటలు దారుణంగా ఉన్నాయి. ఆ రోజు ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కావాలని తాను పార్లమెంట్‌టో అన్నానని అంగీకరిస్తూనే... ఆ మరుసటి రోజు కొన్ని రాష్ట్రాల ఎంపీలు తన వద్దకు వచ్చి ‘మా రాష్ట్రాల పరిస్థితి ఏమిటి’ అని అడిగారని, ఆ రోజే తాము తప్పు చేశామని భావించామని వెంకయ్య నాయుడన్నారు. 2014 ఫిబ్రవరి 20న రాష్ట్రాన్ని విడగొట్టిన తరువాత ఏప్రిల్‌లో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఏపీకి ఐదేళ్లు కాదు, పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ మాటలు చెప్పే వారు ఎన్నికలకు వెళ్లారు. వెంకయ్య నాయుడు అన్నట్లుగా ఆరోజే వారు తప్పు చేశామని అనుకుంటే ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ఎందుకు పేర్కొన్నారు? ఇలా మేనిఫెస్టోను విడుదల చేసి, ప్రజల్లోకి వెళ్లి అబద్ధాలు చెప్పడం ధర్మమేనా?

 రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బాబు
 మునుపటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రణాళికా సంఘం వద్ద తాను ముఖ్యమంత్రి అయిన తరువాత 9 నెలలుగా పెండింగ్‌లో పడి ఉన్నా దాని అమలు కోసం చంద్రబాబు ప్రయత్నించలేదు. ఆయన తన బాధ్యతను విస్మరించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. చంద్రబాబు ఎన్నికలప్పుడు ఎవరినీ వదల్లేదు. అందరికీ ఆబద్ధపు హామీలిచ్చారు. బాబొస్తే జాబొస్తుందని చిన్న పిల్లలను మభ్య పెట్టారు. బాబు వచ్చారు కానీ జాబు రాలేదు సరికదా ఉన్నవే ఊడిపోతున్నాయి. బ్యాంకుల్లోని బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. ఇప్పుడేం జరుగుతోంది? బాబొచ్చా డు కానీ బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని వేలం వేస్తున్నారు. రైతులు, డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తానని బాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వారిని కూడా మోసగించారు. రాష్ట్రంలో, దేశంలో అన్నీ మోసాలే జరుగుతున్నాయి. ఇలాంటి మోసాలను అరికట్టాలంటే మనమంతా చైతన్యవంతం కావాలి. మనమంతా నడుం బిగించి వ్యవస్థలో మార్పు తేవాలి. రాజకీయ నాయకులు ఎన్నికల ముందు ఏదైనా మాట చెబితే... ఆ మాట మీద వారు నిలబడకపోతే ప్రజలు నిలదీస్తారనే భయం వారిలో ఉంటేనే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. అలా నిలదీయడానికే రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చాం.

 అవినీతి వల్లే అడగలేకపోతున్నారు
 ముఖ్యమంత్రి చంద్రబాబు తన రెండేళ్ల మూడు నెలల పాలనలో రూ.లక్షన్నర కోట్ల అవినీతికి పాల్పడ్డారు. అందుకే ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోతున్నారు. పట్టిసీమ, రాజధా ని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు ... ఇలా అన్నింట్లోనూ అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్రంలో విద్యుత్, మద్యం కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. రూ.30 కోట్ల చొప్పున ఇచ్చి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనేశారు. ప్రత్యేక హోదాపై బీజేపీని గట్టిగా అడిగితే తన అవినీతి వ్యవహారాలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తారేమోనని చంద్రబాబు భయపడుతున్నారు. విచారణకు ఆదేశిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని భీతిల్లుతున్నారు. అందుకే హోదా కోసం మోదీకి గట్టిగా అల్టిమేటం ఇచ్చే పరిస్థితిలో చంద్రబాబు లేరు.
 
 తొమ్మిది నెలలు ఎందుకు పట్టించుకోలేదు?
 14వ ఆర్థిక సంఘం గురించి అరుణ్ జైట్లీ రాజ్యసభలో మాట్లాడారు. వాస్తవానికి 2015 దాకా 13వ ఆర్థిక సంఘమే అమల్లో ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఏడాది వరకూ 13వ ఆర్థిక సంఘమే ఉంది. 14వ ఆర్థిక సంఘం ఏర్పడలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత 2014 డిసెంబర్ 30న ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. అంటే అంతకు ముందున్న యూపీఏ ప్రభుత్వం మంత్రివర్గంలో ఆమోదించి పంపిన ప్రత్యేక హోదా తాలూకు ఫైల్ తొమ్మిది నెలల వరకూ పెండింగ్‌లోనే ఉంది. దీని అమలు కోసం చంద్రబాబు పట్టుబట్టలేదు. ప్రధాని మోదీ అసలు పట్టించుకోలేదు.

ఇంత దారుణంగా ఒక పథకం ప్రకారం ప్రత్యేక హోదాను ఖూనీ చేసిన విధానం చూస్తే బాధేస్తోంది. ప్రత్యేక హోదా ఉంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల్లో 10 శాతం మాత్రమే రుణం రూపంలో ఉంటాయి. 90 శాతం గ్రాంటుగా వస్తుంది. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకైతే 30 శాతమే గ్రాంటుగా వస్తాయి. 70 శాతం రుణం రూపంలో వస్తాయి కనుక తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదా వస్తే ఊహించలేని రీతిలో భారీ ఎత్తున రాష్ట్రం పారిశ్రామీకరణ జరుగుతుంది. ఎక్సైజ్ డ్యూటీలోనూ, ఆదాయపు పన్నుల్లోనూ వంద శాతం మినహాయింపు ఉంటే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి క్యూ కడతారు. అప్పుడు పెట్టుబడుల కోసం చంద్రబాబు సింగపూర్, చైనా, రష్యా,  జపాన్ దేశాలకు తిరగాల్సిన పని లేదు. మన రాష్ట్రంలో పరిశ్రమల ఆభివృద్ధి జరిగి ‘నో వేకెన్సీ’ స్థానంలో ‘వాంటెడ్’ అనే బోర్డులు వెలుస్తాయి. మన యువతకు కుప్పలు తెప్పలుగా ఉద్యోగాలు లభిస్తాయి. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే రాజ్యసభలో చర్చ జరిగేటప్పుడు ప్రత్యేక హోదా వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయనే విషయాన్ని కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు ఎవరూ చెప్పలేదు. హోదా రానందు వల్ల వాటిల్లే నష్టం గురించి మాట్లాడలేదు.
 
 అన్యాయానికి నిరసనగానే బంద్
 రాజ్యసభలో ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. ఈ అన్యాయానికి నిరసనగానే బంద్‌కు పిలుపునిచ్చాం. ఈ బంద్‌ను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. ఆగస్టు 2న జరిగే బంద్‌లో పార్టీలకతీతంగా అందరూ ఏకమై పాల్గొనాలి. మనందరి భవిష్యత్తు ప్రత్యేక హోదాపై ఆధారపడి ఉంది. అందుకే ప్రతి కార్మిక సంఘం, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రజాసంఘానికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక పని చేస్తానని చెప్పి రాజకీయ నాయకులు మాట తప్పితే ప్రజలు నిలదీస్తారు అనే భయం కలిగేందుకే ఈ పోరాటం చేయాలని కోరుతున్నాను. మనకు రావాల్సిన ప్రత్యేక హోదా హక్కును సాధించుకోవడం అందరమూ నాలుగడుగులు ముందుకేయాలని పేరు పేరునా విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని జగన్ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, కొలుసు పార్థసారథి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు షేక్ ముస్తఫా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎస్.దుర్గాప్రసాదరాజు పాల్గొన్నారు.   
 
 అందుకే చంద్రబాబు ఇంగ్లిష్‌లో ప్రెస్‌మీట్ పెట్టరు
 చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఇంగ్లిష్‌లో ప్రెస్‌మీట్ పెట్టరు. ఇంగ్లిష్‌లో మాట్లాడితే అది మోదీకి అర్థం అవుతుంది. మోదీకి అర్థం అయితే చంద్రబాబుపై సీబీఐ విచారణకు ఆదేశిస్తారు. ఆయన జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే మనం ఇలాంటి రాజకీయ నాయకులకు జ్ఞానోదయం కలిగించాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement