ప్రజాస్వామ్యం నవ్వులపాలు | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం నవ్వులపాలు

Published Tue, Feb 28 2017 1:37 AM

ప్రజాస్వామ్యం నవ్వులపాలు - Sakshi

శాసన సభ స్పీకర్‌కు వైఎస్‌ జగన్‌ ఘాటు లేఖ
తాత్కాలిక అసెంబ్లీ భవనంలోకి అడుగు పెడుతున్న
శుభ సమయంలో మా నుంచి దొంగిలించిన ఎమ్మెల్యేలను సీఎం తీసుకెళ్తారా?
కొత్త అసెంబ్లీకి మకిలి అంటకుండా చూడండి.. అది మీ చేతుల్లోనే ఉంది


సాక్షి, హైదరాబాద్‌ : తమ పార్టీ నుంచి వందల కోట్ల రూపాయలు వెచ్చించి టీడీపీలో చేర్చు కున్న ఎమ్మెల్యేలతో అమరావతిలోని కొత్త అసెంబ్లీలోకి ప్రవేశించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్న ఈ శుభ సమ యంలో దొంగిలించిన ఎమ్మెల్యేలను తీసు కెళ్లడం ఏమిటని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు. ఇలా దొంగ సొత్తుతో చంద్రబాబు అమరావతిలోని కొత్త అసెంబ్లీలోకి ప్రవేశించకుండా నిరోధించాల్సిన బాధ్యత స్పీకర్‌ చేతుల్లోనే ఉందని అన్నారు. జగన్‌ సోమవారం ఈ మేరకు ఏపీ శాసనసభ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుకు ఒక ఘాటైన బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖను పార్టీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, ఆదిమూలపు సురేశ్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ గారికి
అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీలోకి వెళ్లబోతున్న ఈ సమయంలో, ఎమ్మెల్యేలు కొత్త ఇంటిలోకి కాలు పెడుతున్న ఈ శుభ సందర్భంలో.. ఇందుకు దారితీసిన పరిస్థితులను మీకు గుర్తు చేస్తున్నాను. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్‌.చంద్రబాబు నాయుడు తెలంగాణ అసెంబ్లీలోని ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోవడం వల్లే హైదరాబాద్‌ నుంచి అమరావతి వెళ్లే ప్రక్రియ ఇంత వేగంగా జరిగిన విషయం మీకు తెలుసు.

తన పార్టీకి చెందని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దొంగతనమే కదా?
► హెదరాబాద్‌లో అసెంబ్లీ ఉండగా ఆయన చేసిన మరో దొంగతనం మా పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలకు తన పార్టీ కండువాలు కప్పటం, ఇందుకోసం వందల కోట్ల రూపాయలు వెచ్చించటం.
► ఈ 21 మంది ఎమ్మెల్యేలు రాజ్యాంగం ప్రకారం దొంగ సొత్తే. వీరిని అనర్హులుగా ప్రక టించండి అని ఏనాడో అడిగినా ఇంతవరకూ మీరు నిర్ణయం తీసుకోకపోవటంగానీ, వారిని సభలోకి అనుమతించడంగానీ ప్రజాస్వామ్యా న్ని అపహాస్యం చేయడమే.
► ఒక దొంగతనంలో దొరికి హైదరాబాద్‌ అసెంబ్లీని ఖాళీ చేసిన ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు రెండో దొంగతనం సొత్తుతో అమరావతిలోని కొత్త అసెంబ్లీలోకి ప్రవేశించకుండా నిరోధించటం అన్నది ఇప్పుడు మీ చేతుల్లో ఉంది.
► ఇది రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య బద్ధంగా స్పీకర్‌ పదవికి ఉన్న గౌరవం దృష్ట్యా మీ బాధ్యత. మీ బాధ్యతను తక్షణం మీరు నిర్వర్తించి, పార్టీ మారిన 21 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులను అనర్హులను చేసి కొత్త రాజధానిలో కొత్త సభకు మకిలి అంటకుండా ఆపాలని ఈ బహిరంగ లేఖ ద్వారా కోరుతున్నాం.
► మీరు ఎంత తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన సభ్యులు అయినా రాజ్యాంగానికి, ప్రజల తీర్పునకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను.      అభినందనలతో..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి


చంద్రబాబు నీతులు
ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచిన తర్వాత వేరే పార్టీలో మంత్రిగా చేరాలను కున్నప్పుడు కనీసం రాజీనామా చేయాలి...     
... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నీ కేబెనెట్‌లో మంత్రిగా ఉండటం నీకు బాధగా లేదా?
(తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లో చేరుతున్న సంద ర్భంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు)
వెంకయ్య మాటలు : ఒక పార్టీ గుర్తుతో గెలిచిన వాళ్లు వేరే పార్టీలోకి వెళ్లి కూర్చుంటున్నారు. దర్జాగా వేరే పార్టీ కండువాలు కప్పుకొంటున్నారు. బహిరంగ వేదికలపై ప్రసంగాలు చేస్తున్నారు. వేరే పార్టీలోకి వెళ్లి మంత్రి పదవి చేపడుతున్నారు. ఇంత చేస్తున్నా.. వారిపై అనర్హత వేటు పడటంలేదు. అందుకే ఈ ఫిరాయింపుల చట్టంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి.
(ఫిరాయింపులపై పార్లమెంటు వద్ద విలేకరులతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు)

Advertisement
Advertisement