ఓటుపై వేటు! | Sakshi
Sakshi News home page

ఓటుపై వేటు!

Published Tue, Jul 7 2015 12:10 AM

ఓటుపై వేటు!

45.84 లక్షల మందికి నోటీసులు
‘గ్రేటర్’ ప్రజల్లో కొత్త భయం
 ఓటర్ల మెడపై ‘తొలగింపు’ కత్తి
సిబ్బంది తీరుతో అయోమయం

 
ఇళ్లకు తాళాలు ఉన్నవారు కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో అత్యధికంగా 28 శాతం ఉన్నారు.
చిరునామా మారినవారు సర్కిల్-12 (శేరిలింగంపల్లి)లో అత్యధికంగా 46 శాతం ఉన్నారు
ఆధార్ కార్డులు లేనివారు పాతబస్తీ పరిధిలోని సర్కిల్-5లో అత్యధికంగా 29 శాతం ఉన్నారు.
రెండు చోట్ల పేర్లున్న వారు పాతబస్తీ పరిధిలోని సర్కిల్-4లో అత్యధికంగా 15,125 మంది ఉన్నారు.
అనర్హులైనప్పటికీ జాబితాలో పేరున్న వారు కూకట్‌పల్లి సర్కిల్‌లో  అధికంగా 3,696 మంది ఉన్నారు.
 
 సిటీబ్యూరో  ఓటు... ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రతి ఒక్కరూ ఎంతో ‘గౌరవం’గా భావించే సాధనం. ఈ ‘గౌరవానికి’ భంగం కలిగించే రీతిలో అధికారుల చర్యలు ఉంటున్నాయి. ఈ ఆయుధాన్ని ఓటర్ల చేతి నుంచి తీసేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొందరపడి ఎవరి ఓట్లూ తొలగించబోమని నిన్నటి వరకూ చెప్పిన అధికారులు... నేడు నోటీసులు జారీ చేస్తూ.,. ఓటర్లలో భయాందోళనలు కలిగిస్తున్నారు. గ్రేటర్‌లోని 45.84 లక్షల మంది తమ ఓట్లు ఉంటాయో.. పోతాయో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఓట్లు తొలగిస్తారనే హెచ్చరిక మెడపై కత్తిలా వేలాడుతుండడంతో వీరంతా తలలు పట్టుకుంటున్నారు. ఇళ్లకు తాళాలు ఉన్నాయని.. చిరునామా మారారని.. రెండు చోట్ల పేరుందని.. స్థానికంగా లేరని ఇలా వివిధ కారణాలతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది నోటీసులు జారీ చేస్తున్నారు. తాము ఇంట్లోనే ఉంటున్నా.. లేరనే కారణంతో అందుతున్న నోటీసులతో ప్రజలు హడలిపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం... గ్రేటర్ పరిధిలోని 18 సర్కిళ్లలో మొత్తం 73,62,946 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల జాబితా కోసం ఓటర్లందరూ ‘ఆధార్’తో అనుసంధానం చేసుకోవాలని కొన్ని రోజులుగా అధికారులు చెబుతున్నారు. ఇళ్లకు వచ్చే సిబ్బందికి ఓటరు కార్డు, ఆధార్ కార్డుల నెంబర్లు ఇవ్వాల్సిందిగా సూచిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ (040-21 11 11 11)ను సంప్రదించడం... ఎస్‌ఎంఎస్‌లు, వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ సదుపాయం అందుబాటులో  ఉంటుందని ప్రకటించారు. ఇళ్లకు తాళాలు ఉన్నవారు, చిరునామా మారిన వారు స్థానికంగా లేనట్లు ధ్రువీకరించుకునేందుకు మరో రెండు పర్యాయాలు కూడా పర్యటిస్తారని.. అప్పటికీ వివరాలు దొరక్కపోతే ఓటర్ల జాబితాలో పేరు తొలగిస్తారని తెలిపారు. అయినప్పటికీ.. ఎన్నికల కార్యాలయాలు లేదా పోలింగ్ స్టేషన్లలో బహిరంగంగా ప్రకటించాకే లేనివారి పేర్లు తొలగిస్తామని ప్రకటించారు.
 
ఒక్కసారికే పరిమితం
 గ్రేటర్‌లో ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. ఒక్కసారి మాత్రమే ఇళ్లకు వెళ్లిన సిబ్బంది...రెండోసారి అటువైపు చూడకుండానే ఏకంగా నోటీసులు అందిస్తున్నారని వివిధ ప్రాంతాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. వివరాల కోసం రాకుండానే.. వచ్చినట్టుగా చెబుతూ... నోటీసులిచ్చి వెళ్తున్నారని అంటున్నారు. ఎన్నికల విభాగంలో పనిచేసే అధికారులు, ఉద్యోగుల కుటుంబీకులకు సైతం ఇవే అనుభవాలు ఎదురయ్యాయి. అంతేకాదు.. ఇళ్లలో లేరంటూ ఏకంగా 45 లక్షల మందికి నోటీసులు సిద్ధం చేస్తున్నారు. కొందరికి ఇప్పటికే అందించారు. మిగిలిన వారికి పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే నోటీసులందిన కొందరికి ఈ నెల 12నఉదయం 11 గంటలకు సంబంధిత అధికారిని వ్యక్తిగతంగా కలవాలని... లేనిపక్షంలో తాము ఏమీ చేయలేమని హెచ్చరిస్తున్నారు. అంటే.. ‘మీ ఓటు ఉండద’ని భయపెడుతున్నారు.
  ఇళ్లకు తాళాలు, చిరునామా మార్పులు, ఆధార్ లేనివారు, మృతులు, డూప్లికేట్లు, అనర్హులు కలిపి మొత్తం 48,24,658 మంది (దాదాపు 66 శాతం) ఉన్నారు. వీరందరికీ నోటీసులు జారీ చేస్తున్నారు.

  మృతులు, డూప్లికేట్లు, అనర్హులను మినహాయించినా.. ఇళ్లకు తాళాలు, చిరునామా మార్పులు, ఆధార్ కార్డులు లేనివారు 45,84,155 మంది ఉన్నారు. వీరంతా స్థానికంగా ఉంటున్నట్టు నిరూపించుకోవాలి.  నోటీసులకు స్పందించి.. తాము స్థానికంగానే ఉంటున్నట్లు ఓటర్లు రుజువులు చూపాలని అధికారులు చెబుతున్నారు. దీని కోసం ఆధార్‌తో లింకేజీ చేసుకోవాలని...లేదంటే వెంటనే దరఖాస్తు చేసుకొని ఆ వివరాలు తెలియజేయాలని సూచిస్తున్నారు. ఆధార్‌తో లింకేజీ ఉంటే.. ఎలాంటి అనుమానాలకూ తావుండదని... బోగస్ ఓటర్లు లేకుండా చేసేందుకే ఈ చర్యలని చెబుతున్నారు. అధికారుల మాటలకు.. క్షేత్రస్థాయిలో అమలు తీరుకు వ్యత్యాసం కనిపిస్తోంది. అధికారులు ఇకనైనా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది.
 

Advertisement
Advertisement