ట్రాఫిక్‌ పోలీసులను తప్పించుకోబోయి.. | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ పోలీసులను తప్పించుకోబోయి..

Published Mon, May 22 2017 3:04 AM

ట్రాఫిక్‌ పోలీసులను తప్పించుకోబోయి.. - Sakshi

- బైక్‌పై రాంగ్‌రూట్‌లో వెనక్కి వెళ్లిన యువకులు
- దూసుకొచ్చిన లారీ.. మద్యం మత్తులో లారీ డ్రైవర్‌
- యువకుల బైక్‌ను ఢీ కొట్టిన లారీ, అక్కడికక్కడే మృతి


హైదరాబాద్‌: మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు.. ట్రాఫిక్‌ పోలీసులను గమనించి తమ వాహనాన్ని వెనక్కి తిప్పి రాంగ్‌రూట్‌లో వెళ్లడం మొదలుపెట్టారు. ఇదే సమయం లో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ లారీ యువకుల వాహనాన్నీ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. శనివారం అర్ధరాత్రి టోలిచౌకిలోని బాపూఘాట్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాపూఘాట్‌ సమీపంలో శనివారం రాత్రి ‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌(19), రాజేశ్‌(24) నార్సింగ్‌ వైపు నుంచి లంగర్‌హౌస్‌ వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు.

మద్యం మత్తులో వాహనం నడుపుతున్న వీరు దూరం నుంచే ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు చేస్తున్న విషయం గమనించి వాహనాన్ని (ఏపీ11ఏసీ0480) వెనక్కి తిప్పి.. రాంగ్‌రూట్‌లో వెళ్లే ప్రయత్నం చేశారు. అదే సమయం లో సిమెంట్‌ లోడ్‌తో వస్తున్న లారీ(ఏపీ21టీబ్ల్యూ3521)ని మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ నడుపుతున్నాడు. మితిమీరిన వేగంతో అదుపు తప్పిన లారీ.. ముందు వెళ్తున్న కారును.. ట్రాఫిక్‌ పోలీసుల క్రేన్‌తో పాటు రాంగ్‌ రూట్‌లో వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో శ్రీనివాస్, రాజేశ్‌ మరణించారు. కొడంగల్‌ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్‌ అనంతయ్య(27)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బ్రీత్‌ అనలైజర్‌తో పరీక్షించగా.. అతడి బీఏసీ కౌంట్‌ 550 వచ్చింది. రక్తంలో ఉండే ఆల్కహాల్‌ శాతాన్ని బీఏసీ కౌంట్‌ అంటారు. ప్రతి 100 గ్రాముల రక్తంలో 30 మిల్లీగ్రాముల ఆల్కహాల్‌ ఉంటే.. బీఏసీ కౌంట్‌ 30 ఉన్నట్లు. ఇది దాటితే ఆ స్థితిలో వాహనాన్ని నడపటం తీవ్రమైన ఉల్లంఘన కిందికి వస్తుంది. లారీ డ్రైవర్‌ను ట్రాఫిక్‌ పోలీసులు లంగర్‌హౌస్‌ శాంతిభద్రతల విభాగం అధికారులకు అప్పగించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement