నేటి నుంచి టీఎస్‌ఐసెట్ కౌన్సెలింగ్ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టీఎస్‌ఐసెట్ కౌన్సెలింగ్

Published Fri, Aug 26 2016 1:04 AM

నేటి నుంచి టీఎస్‌ఐసెట్ కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: టీఎస్‌ఐసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శుక్రవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 16 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో తొలిరోజు 1వ ర్యాంకు నుంచి 12 వేల ర్యాంకు వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తామని సాంకేతిక విద్య కమిషనర్ తెలిపారు. ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఈ నెల 30 వరకు వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రవేశ పరీక్ష రాసినపుడు నమోదు చేసుకున్న బయోమెట్రిక్ వివరాలను కూడా పరిశీలిస్తారని చెప్పారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో మొత్తం 20,120 ఎంబీఏ సీట్లు ఉండగా, 1,845 ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

మొదటి దశ కౌన్సెలింగ్‌లోనే మెరుగైన కాలేజీలో సీటు పొందేందుకు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమవెంట ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఆధార్ కార్డు, డిగ్రీ ప్రొవిజనల్, మార్కుల మెమోలు, ఇంటర్, టెన్త్ పాస్ సర్టిఫికెట్లు, టీసీ, కుల, ఆదాయ, నివాస ధ్రువ పత్రాలు, వికలాంగులైతే వైకల్య ధ్రువపత్రం, స్పోర్ట్స్, ఎన్‌సీసీ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రాసెసింగ్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500, ఇతర కేటగిరీల అభ్యర్థులు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. షెడ్యూల్, తదితర వివరాలకు https://tsicet.nic.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

Advertisement
Advertisement