అసలేం జరిగింది? | Sakshi
Sakshi News home page

అసలేం జరిగింది?

Published Thu, May 5 2016 7:45 AM

అసలేం జరిగింది? - Sakshi

ఇంజినీరింగ్ విద్యార్థిని దేవి మరణం వెనక మిస్టరీ
కేసును తిరగదోడే దిశగా  పోలీసుల కసరత్తు
కీలకం కానున్న శాస్త్రీయ ఆధారాలు
పోలీసుల చేతికి పోస్టుమార్టం రిపోర్టు

 
 
సాక్షి, సిటీబ్యూరో జూబ్లీహిల్స్‌లో ఆదివారం తెల్లవారుజామున చెట్టుకు కారు ఢీ కొట్టిన ప్రమాదంలో మరణించిన ఇంజినీరింగ్ విద్యార్థిని క ట్కూరి దేవిరెడ్డి(21) మరణం మిస్టరీగా మారింది. ఈ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు సీరియస్‌గా రంగంలోకి దిగారు. అసలు సంఘటన జరిగిన రోజు ఏం జరిగిందనేది తెలుసుకునేందుకు అన్నికోణాల నుంచి దర్యాప్తు ప్రారంభించారు. నానక్‌రాంగూడలో ఒక హోటల్ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యేందుకు శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ నెం.70 డీకేనగర్ తులిప్ రెసిడెన్సీ నుండి బయలుదేరిన దేవి, ఆదివారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు జర్నలిస్ట్ కాలనీ సమీపంలోని హుడా ఎన్‌క్లేవ్ వద్ద కారు చెట్టుకు ఢీకొట్టిన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదంలో దేవి మృతి చెందగా, కారు నడుపుతున్న ఆమె స్నేహితుడు భరతసింహారెడ్డి క్షేమంగా బయటపడ్డారు. అయితే తొలుత ప్రమాదంగా భావించి, అంత్యక్రియలు చేసిన బంధువులు, అనంతరం తమ కూతురు మరణంపై అనుమానాలున్నాయని చెప్పారు. ఈమేరకు దేవి తల్లిదండ్రులు పోలీస్‌లకు ఫిర్యాదు చేయటంతో కేసును మళ్లీ మొదటి నుండి విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు బుధవారం ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న భరత్‌సింహారెడ్డితో పాటు ఆ రోజు ఆమెతో ఉన్న స్నేహితురాళ్లను కూడా విచారిస్తున్నారు.

 అన్ని కోణాల్లోనూ...
 శనివారం సాయంత్రం మొదలుకుని ప్రమాదం జరి గేంత వరకు అసలు ఏం జరిగింది?, దేవితో పాటు ఆ రోజు ఎవరెవరు హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు? నానక్‌రాంగూడ నుండి ఏ రూట్‌లో ప్రయాణిం చారు, ఎక్కడెక్కడ ఆగుతూ వచ్చారు, ప్రయాణించే సమయంలో ఎవరెవరితో మాట్లాడారన్న అంశాలకు సంబంధించి ఆయా రూట్లలో సీసీ కెమెరా ఫుటేజీలు, సెల్‌ఫోన్ టవర్ల వారిగా లోకేషన్లు, అందరి కాల్‌లిస్ట్‌ల వివరాలను పోలీసులు సేకరించారు. దేవి, ఆమె స్నేహితులు చెప్పిన వివరాలతో వాటిని సరిచూసే పనిలో పడ్డారు. దేవి పోస్ట్‌మార్టం నివేదికలో కూడా మల్టీపుల్ ఇంజురీస్(పలు ప్రాంతాల్లో గాయాలు) అని రావటంతో మరింత లోతు గా నిపుణులతో విశ్లేషించాలని పోలీసులు నిర్ణయించారు.


 నిష్పక్షపాతంగా నిజాలు నిగ్గు తేలుస్తాం: వెస్ట్ జోన్ డీసీపీ
 ఇంజినీరింగ్ విద్యార్థిని దేవి మృతిపై నిష్పక్షపాతంగా విచారణ నిర్వహిస్తామని, అన్ని కోణాల్లో విచారించి ఆమె మృతిపై ఉన్న మిస్టరీని ఛేదిస్తామని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన బుధవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తులందరినీ విచారిస్తున్నామని, శాస్త్రీయ పద్ధతుల్లో కేసును ముందుకు తీసుకువెళ్లి, అన్ని అనుమానాలను నివృత్తి చేస్తామని చెప్పారు.
 
 న్యాయం చేయాలంటూ కొవ్వొత్తుల ర్యాలీ
 బంజారాహిల్స్: కట్కూరి దేవి మృతికి సంతాప సూచకంగా ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బుధవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కువద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పెద్దసంఖ్యలో దేవి స్నేహితులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దేవి మృతిపై అనుమానాలున్నాయని, న్యాయం కావాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మృతురాలు దేవి తండ్రి నిరంజన్‌రెడ్డి, పెద్దనాన్న నరేందర్‌రెడ్డి, సోదరి మానస పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవిది హత్య అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ర్యాలీ అనంతరం దేవి తండ్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తనకూతురు మృతిపట్ల సమగ్ర విచారణ జరిపించి దోషులనుకఠినంగా శిక్షించాలని, ఈ విషయంలో సీఎం చొరవ చూపాలని కోరారు. తన కూతురిది ఖచ్చితంగా హత్యేనని ఆరోజు కారులో భరతసింహారెడ్డితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నట్లు ప్రత్యక్షసాక్షులు వెల్లడిస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరిపించి   భరతసింహారెడ్డితో పాటు మిగతా ఇద్దరిపైనా నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేయాలని డిమాండ్‌చేశారు. మృతురాలి సోదరి మానస మాట్లాడుతూ ఈ మరణం వెనుక ఎన్నో సందేహాలు ఉన్నాయని రోదిస్తూ చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement