హెచ్‌ఎండీఏకు కొత్త రక్తం! | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎండీఏకు కొత్త రక్తం!

Published Mon, Apr 27 2015 11:49 PM

హెచ్‌ఎండీఏకు కొత్త రక్తం!

ఖాళీల భర్తీకి మళ్లీ ‘డిప్యుటేషన్’
నియామకానికి కమిషనర్ గ్రీన్‌సిగ్నల్
ప్లానింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టి

 
సిటీబ్యూరో : హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు కొత్త రక్తం ఎక్కించేందుకు రంగం సిద్ధమైంది. ప్రధానంగా రెవెన్యూ, ఫారెస్ట్, డీటీసీపీ తదితర విభాగాల్లో మంచి రికార్డు ఉన్న అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకోవాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా నిర్ణయించారు. ఈ మేరకు ఆయా విభాగాలకు ఉన్నతాధికారులకు లేఖలు రాయాలని అధికారులను ఆదే శించారు. సంస్థలో పేరుకుపోయిన అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు గాను కొత్త జట్టును ఏర్పాటు చేసే దిశగా ఆమె చర్యలు చేపట్టారు. కాగా  హెచ్‌ఎండీఏలో డిప్యుటేషన్‌పై  దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు అధికారులను ఇటీవల మాతృ సంస్థలకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ పనుల నిమిత్తం హెచ్‌ఎండీఏకు వచ్చే వారికి సత్వర సేవలందించేందుకుగాను సంస్థను సమూలంగా సంస్కరించాలని కమిషనర్ పట్టుదలతో ఉన్నారు.

ఇందులో భాగంగా నిజాయితీ పరులతో కూడిన కొత్త బృందాన్ని ఏర్పాటు చేసి పారదర్శన పాలన అందించాలని ఆమె యోచిస్తున్నారు. గతంలో భూ పరిపాలనా విభాగం, ఓఆర్‌ఆర్ ప్రాజెక్టులో 36మంది రెవిన్యూ విభాగానికి చెందిన అధికారులు డిప్యుటేషన్‌పై పనిచేసేవారు. ప్రస్తుతం వారి సంఖ్యను కుదించి  ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు, తాహశీల్దార్లు-5, డిప్యూటీ తాహశీల్దార్లు-10, ఐదుగురు  సర్వేయర్లతో కలిసి  మొత్తం 22మందిని కొత్తగా డిప్యుటేషన్‌పై తీసుకోనున్నారు. అంతేగాకుండా హెచ్‌ఎండీఏలో కీలకమైన చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (సీఏఓ) పోస్టు భర్తీకి అకౌంటెంట్ జనరల్ (ఏజీ)కు లేఖ రాయనున్నారు. ప్లానింగ్ విభాగాన్ని పూర్తిస్థాయిలో సంస్కరించాల్సి ఉన్నందున దీనిపై  ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందుకుగాను ఎం.ఎ. అండ్ యూడీ లేదా డీటీసీపీ విభాగాల నుంచి  నిజాయితీ పరులైన అధికారులను డెరైక్టర్లు, ప్లానింగ్ ఆఫీసర్లుగా తీసుకోవాలని నిర్ణయించారు.
 
అటవీ శాఖ నుంచి...

 
ఔటర్ రింగ్‌రోడ్డుతో పాటు హెచ్‌ఎండీఏ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధికి కమిషనర్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. హరిత హారం పథకం కింది హెచ్‌ఎండీఏకు ఇప్పటికే రూ.50కోట్లు నిధులు కేటాయించినందున వాటిని చక్కగా సద్వినియోగం చేసుకొని హరిత హైదరాబాద్‌గా తీర్చిదిద్దాలని ఆమె లక్ష్యంగా నిర్ణయించారు. అయితే... అర్బన్ ఫారెస్ట్రీ విభాగంలోని అటవీ శాఖ అధికారులందరినీ మూకుమ్మడిగా మాతృశాఖకు పంపినందున, ఇప్పుడు అదే శాఖ నుంచి మళ్లీ కొత్తగా 12మంది అధికారులను తీసుకోవాలని నిర్ణయించారు. దీనికితోడు ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ సిబ్బంది లేకపోవడంతో హెచ్‌ఎండీఏలో పనులు పూర్తిగా స్తంభించిపోవడంతో త్వరలో టెండర్ పిలిచి 50-60మంది సిబ్బందిని తీసుకోవాలని నిర్ణయించారు. కాగా ఇప్పటికే రోడ్డునపడ్డ అవుట్ సోర్సింగ్ సిబ్బంది తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement