ఐఎస్‌లో చేరిన నగర యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

ఐఎస్‌లో చేరిన నగర యువకుడి మృతి

Published Tue, May 5 2015 5:57 AM

ఐఎస్‌లో చేరిన నగర యువకుడి మృతి - Sakshi

హైదరాబాద్: ఉన్నత చదువులు చదివి... ఇటు కుటుంబానికి.. అటు సమాజానికి పేరు తెస్తాడనుకున్న ఆ యువ  ఇంజనీర్ ఉగ్ర యుద్ధంలో విగతజీవిగా మారాడు. పది రోజుల క్రితం సిరియాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

అదిలాబాద్ జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహ్మద్ అలీ కుమారుల ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల క్రితం తన కుటుంబాన్ని నగరానికి మార్చాడు. శాస్త్రీపురంలో నివాసముం టున్న అలీ పెద్ద కుమారుడు మహ్మద్ అతీఫ్ వసీమ్(28) షాదన్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. కొడుకు లండన్ వెళ్తానని పట్టుబట్టడంతో అలీ అప్పులు చేసి మరీ గత ఏడాది నవంబర్‌లో లండన్‌కు పంపించాడు. అక్కడ అతను ఫేస్‌బుక్ ద్వారా ఇస్లామిక్ స్టేట్స్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థకు ఆకర్షితుడై సిరియాకు వెళ్లాడు. అక్కడి నుంచి తన తండ్రికి ఫోన్ చేశాడు. తాను పవిత్ర యుద్దం కోసం ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరానని చెప్పాడు.

అప్పటి నుంచి ఆందోళనలో ఉన్న అలీ కుటుంబ సభ్యులకు రెండు రోజుల క్రితం పిడుగు లాంటి వార్త తెలిసింది. వసీమ్ సిరియా ఇస్లామిక్ పవిత్ర యుద్దంలో ఏప్రిల్ 24న అమరుడయ్యాడని అక్కడి ఉగ్రవాదులు నగరంలో ఉంటున్న వసీమ్ సోదరుడి  ఈ-మెయిల్‌కు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వసీమ్‌ను చూసేందుకు తమకు కడసారి అవకాశం కూడా లేకుండా పోయిందని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement