లక్ష ఇస్తే చాలు లీకేజీకి రెడీ | Sakshi
Sakshi News home page

లక్ష ఇస్తే చాలు లీకేజీకి రెడీ

Published Thu, Apr 20 2017 3:40 AM

లక్ష ఇస్తే చాలు లీకేజీకి రెడీ - Sakshi

- ఇదీ ఎంసెట్‌ కేసులో  ప్రధాన నిందితుడి వ్యవహారం
- ఇప్పటికి పది ఎంట్రన్స్‌ పరీక్ష పత్రాలు లీక్‌ చేశాడు: సీఐడీ అదనపు డీజీపీ


సాక్షి, హైదరాబాద్‌: రూ.లక్ష ఇస్తే చాలు ఏ రాష్ట్రంలోని ఎంతటి ప్రతిష్టాత్మకమైన ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రాన్ని అయినా అతను లీక్‌ చేసేస్తాడు. ఇలా ఇప్పటికి వివిధ రాష్ట్రాలకు చెందిన పది ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలను శివబహదూర్‌సింగ్‌ అలియాస్‌ ఎస్బీసింగ్‌ లీక్‌ చేసినట్టు సీఐడీ విచారణలో తేలింది. ఎంసెట్‌ ప్రశ్నపత్రం కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్బీసింగ్‌ విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. లీకేజీ కుట్ర మొత్తం మృతిచెందిన కమలేశ్‌కుమార్‌దని, అతడి ఆదేశాల మేరకే తాను ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేసే రావత్‌నుంచి రూ.లక్ష ఇచ్చి రెండు సెట్ల పత్రాలను బయటకు తెచ్చానని సీఐడీ విచారణలో ఎస్బీసింగ్‌ ఒప్పుకున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. అయితే కమలేశ్‌కుమార్‌ డీల్‌ ప్రకారం ప్రశ్నపత్రాలు తెస్తే తనకు కూడా రూ.లక్ష ఇచ్చాడని అంత వరకే తన పాత్ర ఉందని చెప్పినట్టు తెలిసింది.

పన్నెండేళ్లుగా ఇదే వృత్తి...
ప్రశ్నపత్రాలు లీక్‌ చేయడంలో ఎస్బీసింగ్‌ సిద్ధహస్తుడని, 2005 నుంచి ఇదే వృత్తిలో ఉన్నాడని సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌సింగ్‌ బుధవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌ జాన్‌పూర్‌ జిల్లా మొజ్రా గ్రామానికి చెందిన ఎస్బీసింగ్, అతడికి సహకరించిన మరో వ్యక్తి అనూప్‌కుమార్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేసినట్టు ఆయన వెల్లడించారు. ఎంసెట్‌ ప్రశ్నపత్రం కేసులో ఎస్బీసింగ్‌ ప్రధాన నిందితుడని పేర్కొన్నారు.

అన్ని రాష్ట్రాల పరీక్షల్లోనూ...
ఉత్తర్‌ప్రదేశ్‌లో రైల్వే గ్రూప్‌–డీ ప్రశ్నపత్రాలు, అలహాబాద్‌ రైల్వే డ్రైవర్ల ప్రశ్నపత్రం, పంజాబ్‌లో టెట్‌ ఎగ్జామ్, జమ్మూకశ్మీర్‌లో ఉపాధ్యాయ పరీక్షలు, కోల్‌ ఇండియా, వర్దాన్‌ మెడికల్‌ కాలేజ్‌ ప్రవేశ పరీక్ష, చండీఘర్‌ టీచర్‌ ఎగ్జామినేషన్, కల్‌కత్తా టెట్‌ ఎగ్జామ్, డీఎంఆర్‌సీ పరీక్ష ప్రశ్నపత్రం, చివరగా ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీక్‌.. ఇవన్నీ ఎస్బీసింగ్‌ చేసినట్టు తమ విచారణలో ఒప్పుకున్నాడని సీఐడీ తెలిపింది.

Advertisement
Advertisement