చీటర్‌నే మోసం చేసి.. 30 లక్షలకు టోకరా | Sakshi
Sakshi News home page

చీటర్‌నే మోసం చేసి.. 30 లక్షలకు టోకరా

Published Fri, Feb 24 2017 3:16 PM

చీటర్‌నే మోసం చేసి.. 30 లక్షలకు టోకరా - Sakshi

  • బోగస్‌ బ్యాంక్‌ ఖాతాలతో టోపీ 
  • డిపాజిట్‌ అయిన సొమ్ముతో పరారీ
  •  
    హైదరాబాద్
    జాబ్‌ పోర్టల్స్‌ నుంచి నిరుద్యోగుల డేటాను ఖరీదు చేస్తూ స్థానికంగా ఉద్యోగాల పేరుతో భారీగా మోసాలకు పాల్పడిన ఢిల్లీ గ్యాంగ్‌ నాయకుడు సైతం మోసపోయాడు. ఇతడికి బోగస్‌ వివరాలతో తెరిచిన ఖాతాలు సమకూర్చిన ఓ బిహారీ రూ. 30 లక్షలు కాజేశాడు. దీంతో కంగుతిన్న సదరు చీటర్‌ ‘పేటీఎం’  మార్గం ఎంచుకున్నాడు. సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసిన న్యూ ఢిల్లీ వాసి విజయ్‌ మాన్‌ నేపథ్యమిది. 
     
    పని చేసిన అనుభవంతో సొంతంగా...
    న్యూఢిల్లీలోని సుభాష్‌నగర్‌కు చెందిన విజయ్‌ మాన్‌ బీటెక్‌ పూర్తిచేశాడు. కొన్నాళ్ల పాటు ఓ కాల్‌ సెంటర్‌లో నెలకు రూ.10 వేల జీతానికి పనిచేశాడు. నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో కాల్స్‌ చేయడం, డబ్బు డిపాజిట్‌ చేసుకోవడం ఈ కాల్‌ సెంటర్‌ దందా. మూడు నెలల పాటు దాని కార్యకలాపాలను అధ్యయనం చేసిన విజయ్‌ తానే స్వయంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. న్యూఢిల్లీ కీర్తినగర్‌లో ఓ ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ కార్యాలయాన్ని అద్దెకు తీసుకుని, ఈ–మీడియా వెబ్‌ టెక్నాలజీస్‌ పేరుతో సంస్థను ఏర్పాటుచేశాడు. దీనికి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన అభిషేక్‌ సింగ్‌ను మేనేజర్‌గా నియమించుకున్నాడు. ఇంటర్మీడియట్, డిగ్రీ డ్రాపౌట్స్‌ను టెలీకాలర్లుగా నియమించుకున్న విజయ్‌ వారి ద్వారానే కథ నడిపాడు. 
     
    జాబ్‌ పోర్టల్స్‌ నుంచి బయోడేటాలు..
    వివిధ రకాలైన జాబ్‌ పోర్టల్స్‌లో నిరుద్యోగులు అప్‌లోడ్‌ చేసిన బయోడేటాలను విజయ్‌ ఖరీదు చేసేవాడు. వాటిలోని వివరాల ఆధారంగా టెలీకాలర్ల ద్వారా నిరుద్యోగులకు ఫోన్లు చేయించి ఉద్యోగం ఆశ చూపిస్తాడు. ఆసక్తి చూపిన వారికి వివిధ రకాల రుసుముల పేర్లు చెప్పి డబ్బు డిమాండ్‌ చేస్తుంటాడు. ఈ నగదును నేరుగా తన ఖాతాల్లో డిపాజిట్‌ చేయించుకుంటే తేలిగ్గా చిక్కుతామనే ఉద్దేశంతో బోగస్‌ ఖాతాలు అందించే వారి కోసం అన్వేషించాడు. బీహార్‌కు చెందిన హరీందర్‌ కుమార్‌ ఇలాంటి ఖాతాలు అందించడంలో దిట్ట. నిరుద్యోగులు డిపాజిట్‌ చేసిన డబ్బును డ్రా చేసే ఇతగాడు 20 శాతం కమీషన్‌ తీసుకుని మిగిలింది విజయ్‌కు అందించేవాడు. 
     
    డీమానిటైజేషన్‌ను ఆసరాగా చేసుకుని...
    విజయ్‌ తన కాల్‌ సెంటర్‌ నుంచి ప్రతిరోజూ కనీసం 400 మంది నిరుద్యోగులకు ఫోన్లు చేయించేవాడు. వీరిలో ఒక శాతం మంది వలలో పడినా... వారికి హరీందర్‌ కుమార్‌ అందించే ఖాతాల వివరాలు చెప్పి అందులో డబ్బు డిపాజిట్‌ చేయిస్తాడు. ఇలా వచ్చిన సొమ్మును హరీందర్‌ ప్రతిరోజూ తెచ్చి ఇచ్చేవాడు. నవంబర్‌లో డీమానిటైజేషన్‌ ప్రకటన తర్వాత డ్రా చేయడం ఇబ్బందిగా మారిందని, వీలు చూసుకుని డ్రా చేసుకు వస్తానని చెప్పాడు. విజయ్‌ అంగీకరించడంతో ‘తన ఖాతాల్లో’ రూ.30లక్షలు డిపాజట్‌ అయ్యేవరకు ఎదురుచూసి... ఆపై  పత్తాలేకుండా పోయాడు. 
     
    పంథా మార్చిన విజయ్‌ మాన్‌
    దీంతో సదరు మోసగాడు తన పంథా మార్చాడు. ‘బోగస్‌ ఖాతాలు’ అందించిన వారి నుంచి డెబిట్‌ కార్డులు తానే తీసుకోవడం ప్రారంభించాడు. డిపాజిట్‌ అయిన డబ్బును అతడే డ్రా చేసి కమీషన్‌ మాత్రం వారికి ఇవ్వడం మొదలెట్టాడు. గడిచిన రెండు నెలలుగా నిరుద్యోగుల నుంచి ‘పేటీఎం’ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేయించుకోవడం మొదలెట్టాడు. ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసే ఫోన్లలోనూ బోగస్‌ వివరాలతో తీసుకున్న ప్రీ పెయిడ్‌ సిమ్‌కార్డులు వేస్తున్నాడు. సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్‌ పి.రవికిరణ్‌ నేతృత్వంలోని బృందం చాకచక్యంగా విజయ్, అభిషేక్‌లకు పట్టుకుంది. వాస్తవానికి రూ.1.13 లక్షల మోసం కేసులో వీరిని అరెస్టు చేయగా.. మరో రూ.70 వేల మోసం చేసిన కేసు సైతం వీరిపై సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement