ఇది ఎంత వరకు నిజం? | Sakshi
Sakshi News home page

ఇది ఎంత వరకు నిజం?

Published Sun, Jul 23 2017 12:36 AM

ఇది ఎంత వరకు నిజం?

నేను ప్రెగ్నెంట్‌ని. అయితే నాకు స్వీట్లు, తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. ఈ సమయంలో తినడం వల్ల పుట్టబోయే బిడ్డలకు అలర్జీ, ఆస్తమా సమస్యలు ఎదురవుతాయని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? స్వీట్లు తినడం పూర్తిగా మానేయమంటారా?
– ఆర్‌.వి, తిరుపతి

ప్రెగ్నెన్సీ సమయంలో స్వీట్లు, తీపి పదార్థాలు తినడం వల్ల బిడ్డకు ఎటువంటి అలర్జీ సమస్యలు రావు. కాకపోతే, ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు ఎక్కువగా పెరగటం, శరీర తత్వాన్ని బట్టి ప్రెగ్నెన్సీ సమయంలో మధుమేహ వ్యాధి రావడం, బీపీ పెరగడం, అధిక బరువు వల్ల ఆయాసం, ఇబ్బంది ఏర్పడతాయి. అలాగే బిడ్డ బరువు పెరిగి కాన్పు సమయంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. నీ బరువును బట్టి స్వీట్లు అప్పుడప్పుడు కొద్దిగా తీసుకోవచ్చు. బరువు అధికంగా ఉంటే, స్వీట్లు పూర్తిగా మానేయకపోయినా ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు. తీసుకున్న రోజు, అన్నం తక్కువగా తినడం మంచిది. మీ షుగర్‌ లెవల్స్‌ ఎలా ఉన్నాయో చెక్‌ చేసుకుని, దాన్ని బట్టి స్వీట్లు అప్పుడప్పుడు తీసుకోవచ్చు.

ర్యాడికల్‌ సర్జరీ అనే మాటను ఈమధ్య విన్నాను. ఇది ఏ పరిస్థితుల్లో చేస్తారు? అండాశయం, గర్భసంచిలను ఏ పరిస్థితుల కారణంగా తొలగించడం జరుగుతుంది. ఒకవేళ తొలగిస్తే దాని ప్రభావం ఆరోగ్యంపై ప్రతికూలంగా ఏమైనా ఉంటుందా?
 – డి.వనజ, కర్నూల్‌

ర్యాడికల్‌ సర్జరీ అంటే మీరు చెప్పేది ర్యాడికల్‌ హిస్టెరెక్టమీ సర్జరీ అయితే, ఇందులో గర్భాశయంతో పాటు అండాశయాలు, ట్యూబ్‌లు, లింఫ్‌నోడ్స్, ఒమెన్‌టమ్‌ వంటి గర్భాశయం చుట్టూ ఉండే పెల్విక్‌ టిష్యూ, కణజాలం తీసివేయడం జరుగుతుంది. ఇది గర్భాశయం, అండాశయం, సెర్వికల్‌ క్యాన్సర్‌ నిర్ధారణ అయినవాళ్లకి చెయ్యడం జరుగుతుంది. దీనివల్ల క్యాన్సర్‌ ఇంకా ఎక్కువ పాకకుండా దోహదపడుతుంది.గర్భాశయంలో గడ్డలు, అండాశయంలో కంతులు, ఇంకా ఎన్నో సమస్యలు, వాటివల్ల కలిగే ఇబ్బందులూ ఎక్కువ ఉన్నప్పుడు, గర్భాశయం, అండాశయాలను తొలగించడం జరుగుతుంది. వీటిని 40–45 సం.ల కంటే ముందుగా తొలగించడం వల్ల శరీరానికి కావలసిన అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ పూర్తిగా తగ్గిపోయి, ఒంట్లో నీరసంగా, ఒళ్లు నొప్పులు, కాళ్ల నొప్పులు, మానసిక మార్పులు, కాల్షియం తగ్గిపోవడం, ఎముకలు బలహీన పడటం, సెక్స్‌ మీద ఆసక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి వివిధ రకాల తీవ్రతతో ఏర్పడవచ్చు. కానీ వాటిని తొలగించకుండా ఉంటే వచ్చే కాంప్లికేషన్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు, వయసుతో సంబంధం లేకుండా తొలగించవలసి ఉంటుంది.గర్భాశయం, అండాశయాలు తీసివేసిన తర్వాత వచ్చే సమస్యలకు తీవ్రతను బట్టి, విటమిన్స్, కాల్షియం, ఆహారంలో మార్పులు, అవసరమైతే ఈస్ట్రోజన్‌ మాత్రలు వంటివి డాక్టర్‌ పర్యవేక్షణలో వాడవలసి ఉంటుంది.

పదహారేళ్ల వయసులో నెలసరి రాకపోతే భవిష్యత్‌లో క్యాన్సర్‌ ముప్పు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందా? జన్యుపరమైన లోపాల వల్ల ‘గొనాడ్స్‌’ అనేవి అండాశయంగా మారకపోవడం వల్ల క్యాన్సర్‌ కణాలుగా మారే ప్రమాదం ఉంది అనే విషయం చదివాను. ఇది ఎంత వరకు నిజం?
– ఎన్‌.కీర్తి, సంగారెడ్డి

పదహారేళ్ల లోపల నెలసరి రాకపోతే, భవిష్యత్‌లో క్యాన్సర్‌ ముప్పు ఉండాలని ఏమీలేదు. కాకపోతే పదహారేళ్లు వచ్చినా పీరియడ్స్‌ ఎందుకు రావట్లేదు అని తెలుసుకోవడానికి అవసరమైన పరీక్షలు చేయించుకుని, దానికి తగ్గ చికిత్స తీసుకోవలసి ఉంటుంది. తల్లి కడుపులో శిశువు ఉన్నప్పుడు తొమ్మిది వారాలకే శిశువులో జన్యువులను బట్టి, గొనాడ్స్‌ ఎక్స్‌ ఎక్స్‌ జన్యువులు అయితే అండాశయాలుగా లేదా ఎక్స్‌ వై అయితే టెస్టిస్‌ (వృషణం)గా మెల్లగా ఏర్పడటం మొదలవుతుంది. అవి పైపొట్టలో మొదలై, శిశువు జన్మించే సమయానికి వాటి స్థానం అంటే కిందకి జారుతాయి. ఆడబిడ్డలో అయితే పొత్తికడుపులోకి జారుతాయి. మగబిడ్డలో రెండు వృషణాలు బిడ్డ జన్మించేటప్పటికి కడుపులో నుంచి బయటకు వచ్చి స్క్రోటమ్‌లోకి చేరుతాయి. అన్‌డిసెండెడ్‌ టెస్టికల్స్‌ 10% మందిలో వృషణాలు స్క్రోటమ్‌లోకి దిగవు. వీరిలో కొంతమందిలో 9–12 నెలల లోపల దిగుతాయి. వృషణాలు కిందకి దిగకుండా ఎక్కువ కాలం కడుపులో ఉండటం వల్ల, లోపల వాతావరణానికి, వేడికి అవి పాడవటం, అలాగే వాటిలో క్యాన్సర్‌ ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ఆడవారిలో కూడా జన్యుపరమైన కారణాల వల్ల గొనాడ్స్‌ అండాశయంగా మారకపోయినా, ఒకవేళ మారినా, అవి పూర్తి స్థాయిలో మారకుండా, వాటిలో టిష్యూ, ఫాలికల్స్‌ సరిగా ఏర్పడకపోయినా, కొందరిలో క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు అవసరమైతే, సర్జరీ ద్వారా వాటిని తొలగించడం జరుగుతుంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement