హన్సిఖామణి | Sakshi
Sakshi News home page

హన్సిఖామణి

Published Sun, Aug 30 2015 12:22 AM

హన్సిఖామణి - Sakshi

హన్సిక మంచి నటే కాదు... మంచి మనసున్న వ్యక్తి కూడా. ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేస్తుంది. ఎందరో అనాథ పిల్లలను దత్తత తీసుకుంది. వారికో మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆరాట పడుతోంది. ఒక వృద్ధాశ్రమం కట్టి నీడ లేని వృద్ధులకు ఆశ్రయం కూడా ఇవ్వాలనుకుంటోంది. ఇన్ని మంచి గుణాలున్న హన్సిక ఓ విలువైన మణి. అందుకే ఆమె... హన్సిఖామణి!


 
  ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. అసలు మీకెప్పుడైనా కోపమొస్తుందా?
 చాలా తక్కువ. ఎప్పుడైనా వచ్చినా వెంటనే కంట్రోల్ చేసుకుని కూల్ అయిపోతాను. కోపం చాలా చెడ్డది. అందుకే దాన్ని దగ్గరకు రానివ్వను.
 
   మీ ఇష్టాయిష్టాల గురించి చెప్పండి?
 నాకు గ్యాడ్జెట్స్ అంటే పిచ్చి. ఐ ప్యాడ్, ఐ ఫోన్, ఐ టచ్... అవి లేకపోతే బతకలేను. ఎప్పుడూ కొత్తవి కొంటూనే ఉంటాను. పాతవి నా అసిస్టెంట్లకి ఇచ్చేస్తాను. అలాగే డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టం. ముంబైలో ఉన్నప్పుడు నా కారు నేనే డ్రైవ్ చేసుకుంటాను.
 
  ఫ్రీ టైమ్ దొరికితే..?
 స్క్వాష్ ఆడతాను. స్విమ్మింగ్ చేస్తాను. ప్రతి సినిమానీ ఫస్ట్ డే, ఫస్ట్ షో చూస్తాను. వంట కూడా చేస్తుంటాను. వెజ్, నాన్‌వెజ్... ఏదైనా అదరగొట్టేస్తా.
 
మీకు డిసిప్లిన్ ఎక్కువట..?
 అవును. ఉదయం లేవడం దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకూ అన్నీ టైమ్ ప్రకారం చేస్తాను. షూటింగ్‌కి ఎప్పుడూ ఆలస్యంగా వెళ్లను. ఏ పనినీ వాయిదా వేయను. అన్నీ పద్ధతి ప్రకారం జరిగి పోవాలి. నాకే కాదు, ప్రతి మనిషికీ డిసిప్లిన్ అవసరమంటాను నేను.
 
దేవుణ్ని నమ్ముతారా?
 ఎంత నమ్మాలో అంతే నమ్ముతాను తప్ప మూఢభక్తి లేదు. నిజానికి నాకు బౌద్ధమతమంటే చాలా ఇష్టం. ఎందుకంటే అది మతానికి ఏమీ చేయమనదు. నీ కోసం, నువ్వు మంచిగా బతకడం కోసం, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవడం కోసం ఏమైనా చేయమంటుంది. హోమాలు, పూజలు చేసే బదులు సాటి మనిషికి సాయం చేయమంటుంది.
 
మీరు ఎలాగూ చేస్తారుగా?
 ఏదో నాకు చేతనైనంత. మా అమ్మమ్మ సమాజ సేవ చాలా చేసేది. అమ్మ కూడా అంతే. చిన్నప్పుడు పండు గలొస్తే సినిమాలకీ షికార్లకీ కాకుండా... ఓల్డేజ్ హోమ్స్‌కీ, అనాథాశ్రమాలకీ తీసుకెళ్లేవారు. అక్కడివాళ్లకు అన్నీ పంచిపెట్టి సెలెబ్రేట్ చేసేవాళ్లు. అవన్నీ చూశాక ఎదుటివారికి ఇవ్వడంలోనే ఆనందం ఉందని తెలుసుకున్నాను.
 
డబ్బుకి విలువిస్తారా?
 లేదు. నా రెమ్యునరేషన్ గురించి కూడా నేను మాట్లాడను. అన్నీ అమ్మే చూసుకుంటుంది. అందరు పిల్లల్లాగే నేను కూడా అమ్మ దగ్గర పాకెట్ మనీ తీసు కుంటాను. అంతకుమించి ఎంత వస్తోంది, ఎంత ఖర్చవుతోంది అని లెక్కలేసే అలవాటు నాకు లేదు.
 
కాంప్లిమెంట్స్ కోరుకుంటారా?
 కోరుకుంటే వచ్చేవి కాదు కాంప్లిమెంట్స్. మనం చేసే పనిని బట్టి అవి లభిస్తాయి. అసలు ఎవరో పొగడాలని ఏ పనీ చేయకూడదు. ప్రతిఫలం ఆశించకుండా చేస్తేనే పనికి సార్థకత లభిస్తుంది.

 గాసిప్స్‌కి మీ రియాక్షన్?
 రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందనుకోను. రకరకాల మనుషులు ఉంటారు. వారికి తోచినట్టు ఆలోచిస్తుంటారు. వారి ఆలోచనల్ని మనం నియంత్రించలేం. అయినా నిజం మనకు తెలిసినప్పుడు ఎవరో ఊహించి మాట్లాడే మాటలను పట్టించుకోవడం అవసరమా!
 
పెళ్లి ఎప్పుడు?
 పుట్టుక, మరణం మన చేతిలో లేనట్టే పెళ్లి కూడా ఉండదు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది.
 
మీ డ్రీమ్ లవర్ ఎలా ఉండాలి?
 ఎవరు, ఎప్పుడు మన జీవితంలోకి వస్తారో మనకు తెలియదు కదా! అప్పటి పరిస్థితులను బట్టి, అతని వ్యక్తిత్వాన్ని బట్టి ఇష్టపడటం, పడకపోవడం అనేది ఉంటుంది. కాబట్టి అతను ఇలా ఉండాలి అని ఇప్పుడు చెప్పమంటే చెప్పలేను.
 
మీ లైఫ్ యాంబిషన్?
 చాలామంది పేద పిల్లల్ని దత్తత తీసుకుని, వారి అవసరాలన్నీ తీరుస్తున్నాను. అలాగే ఓల్డేజ్ హోమ్ కట్టి, నా అన్నవాళ్లు లేని వృద్ధులకు ఆశ్రయం ఇవ్వాలని ఉంది. ప్రాణమున్నంత వరకూ ఎదుటివాళ్లకు సాయపడటమే నా లక్ష్యం!
 

Advertisement

తప్పక చదవండి

Advertisement