ఆకుపచ్చ సూర్యోదయం | Sakshi
Sakshi News home page

ఆకుపచ్చ సూర్యోదయం

Published Sat, Feb 18 2017 11:41 PM

ఆకుపచ్చ సూర్యోదయం

1 ఆకురాల్చిన అడవి మళ్లీ చిగురించి, సౌందర్యాన్ని విరబూసింది. లేలేత ఆకుపచ్చ ఎండలో గూడు కట్టిన ఆ రెండెడ్ల బండి కృష్ణదేవిపేట దిశగా వెళుతోంది. చిటికెల నారాయణమూర్తి తోలుతున్నాడు. ఎద్దుల నుదుర్ల మీద మువ్వలు, మెడలో గంటలు పెద్దగా శబ్దం చేస్తున్నాయి.గూడుకి వెనకా, ముందూ కూడా దుప్పట్లు కట్టారు–లోపల ఉన్నవాళ్లు కనిపించకుండా. అదోSరకం ఘోషా. లోపల రామరాజు కన్నతల్లి సూర్యనారాయణమ్మ, అమ్మమ్మ అచ్యుతమ్మ, చెల్లెలు సీత కూర్చుని ఉన్నారు. అచ్యుతమ్మ ఒళ్లో తలపెట్టుకుని నిద్రపోతున్న కుర్రాడు సత్యనారాయణరాజు. రామరాజు తమ్ముడు. సూర్యనారాయణమ్మ కడగొట్టు సంతానం.

మూడువారాల క్రితం ఆ రెండు ఉత్తరాలు సూర్యనారాయణమ్మ పేరుతోనే నరసాపురం చిరునామాతో బంధువుల ఇంటికి వచ్చాయి. అప్పటికి సూర్యనారాయణమ్మ నరసాపురానికి దగ్గరలోనే రుస్తుంబాదాలో కూతురి అత్తవారు, అంటే వియ్యాల వారి ఇంట ఉంది. వెంటనే అక్కడకి పంపారు బంధువులు ఆ లేఖలని.మొదటి ఉత్తరం చదువుకుందామె–గం.భా.స. సూర్యనారాయణమ్మగారికి!మీ పుత్ర సమానుడు చిటికెల భాస్కరనాయుడు నమశ్శతములతో వ్రాయు లేఖార్థములు.అమ్మా! మీరు కులాసా అని తలుస్తున్నాను. మీ కుటుంబంతో నాకు పరిచయం కలగడం దైవేచ్ఛ.

మీ పెద్ద కుమారుడు చి. శ్రీరామరాజుగారు విశాఖపట్నం జిల్లా, గొలుగొండ తాలూకా కృష్ణదేవిపేటలో మా ఇంట క్షేమంగా ఉన్నారు. మీరూ, కుటుంబ సభ్యులూ అంతా రామరాజుగారిని కలుసుకొనవలసిందని, మా ఇంటిని పావనము చేయవలసిందని సవినయంగా మనవి చేయుచున్నాను. ఇంతకాలం తరువాత మీ తల్లీకుమారులు కలుసుకొనుటకు మా ఇల్లు వేదికగా ఉపయోగపడాలని మా తల్లిగారున్నూ మిక్కిలి ఆశిస్తున్నారు. తమరు పెద్ద మనసు చేసుకుని మా కోరికను మన్నించవలసినది.బుధజన విధేయుడు చిటికెల భాస్కరనాయుడు, కృష్ణదేవిపేట. పెనుభారమేదో దించేసినట్టయింది ఆ క్షణంలో సూర్యనారాయణమ్మకి. వెంటనే కూతురుకి చెప్పాలని వెళుతుండగానే రెండో ఉత్తరం ఎవరిదా అని చూసిందామె. పైగా  పరిచయం ఉన్నట్టే అనిపించాయి అక్షరాలు.                                           


 ‘అమ్మా!’ అంటూ తన కొడుకు రాసిన ఆ ఉత్తరమే. కళ్లు తడిసి, గుండె ఆనందంతో నిండిపోయింది.‘మీ పాదపద్మములకు నమస్కరించి మీ కుమారుడు రామరాజు వ్రాయునది. నేను క్షేమం. చెల్లీ, తమ్ముడూ, మన బంధువులు అంతా క్షేమమని తలుస్తున్నాను. కృష్ణదేవిపేటలో సోదర సమానులు భాస్కరుడుగారు, వారి తల్లి, మాతృసమానురాలు సోమమ్మగారి ఆపేక్ష, ఆప్యాయతల మధ్య నేను క్షేమంగా ఉన్నాను. చెల్లీ, తమ్ముడితో కలసి మీరు కృష్ణదేవిపేట రావలసింది. ఈ నెలాఖరుకు తునిలో మన మిత్రుల ఇంటికి వచ్చి ఉండవలసింది. భాస్కరుడి గారి రెండెడ్ల బండి వచ్చి మిమ్ములను ఈ గ్రామానికి చేర్చగలదు. మరి సెలవు......రామరాజు.

ఆ మేరకే ఈ ప్రయాణం.
తల్లి పక్కనే కూర్చుని వేలాడ గట్టిన దుప్పటిని కొద్దిగా తప్పించి చెట్లని చూస్తోంది సీత.వీరిద్దరికీ ఎదురుగా ఉంది అచ్యుతమ్మ. ఆమె ఒళ్లో తలపెట్టి నిద్రపోతున్నాడు సత్యనారాయణరాజు. చెమరుస్తున్న కళ్లు తుడుచుకుంటూ హఠాత్తుగా అన్నది సూర్యనారాయణమ్మ, ‘‘ఎంత సంతోషంగా ఉందో తెలుసా అమ్మా! అసలు వాణ్ణి చూసి ఎంతకాలమైపోయిందో! దీని పెళ్లికి కూడా లేడు! ఆ దేవుడి దయ. నేను బతికుండగా వచ్చాడు’’ అంది, డగ్గుత్తికతో. కొండబాటలో, ఎగుడుదిగుడు బాటలో వెళుతోంది బండి– సూర్యనారాయణమ్మ బతుకు బండిని ప్రతిబింబిస్తూ.                                     

సూర్యనారాయణమ్మ పుట్టిల్లు భీమిలి దగ్గరి పాండ్రంగి. మందలపాటి శ్రీరామరాజు, అచ్యుతమ్మల కూతురామె. అత్తవారు అల్లూరివారు. కృష్ణాజిల్లా మోగల్లు. గోదావరి తీరంలో రాజోలుకు సమీపంలోనే అప్పనపల్లి దగ్గర ఉండేది కోమటిలంక. అదే వారి స్వస్థలం. ఆ లంకను గోదావరి ముంచేసింది. అల్లూరి వారి కుటుంబాలు గుంటూరు మండలంలో ఉన్న బొప్పూడి వలస వెళ్లిపోయాయి. కొన్నేళ్లకి అందులో రెండు కుటుంబాలు మళ్లీ గోదావరి తీరానికి వచ్చాయి. అంటే చిట్టిబాబు ముత్తాత గోపాలకృష్ణరాజు కుటుంబం ఒకటి. ఆయన కొడుకు వెంకటకృష్ణంరాజు.

 ఈయనకి ఐదుగురు కొడుకులు. వారే– రామచంద్రరాజు, వెంకటరామరాజు, రామకృష్ణరాజు, రంగరాజు, రామభద్రరాజు. ఇందులో వెంకటరామరాజుకి మేనరికం చేయాలని అనుకున్నారు. గోదావరి తీరంలోనే పొలమూరు వారి మేనమామ  ఊరు. చింతలపాటి సుబ్బరాజు ఆయన మేనమామ. మేనరికం ఇష్టం లేని వెంకటరామరాజు ఇంట్లో కొంతపైకం, బంగారం తీసుకుని బొంబాయి పారిపోయాడు. చిన్నతనం నుంచి లలితకళలంటే అభిమానం. అందుకే ఇష్టంగా ఫొటోగ్రఫీ, మ్యాజిక్‌ లాంతర్‌ విద్యలు నేర్చుకోవడంతో పాటు, చిత్రలేఖనానికి మెరుగులు దిద్దుకున్నారు. ఈ వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మల పెళ్లి 1893లో సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగింది.

వారి తొలి సంతానమే – శ్రీరామరాజు.
జూలై 4, 1897న సాయంత్రం 4 గంటలకి (హేవిళంబి నామ సంవత్సరం. ఆషాఢ శుద్ధ చవితి. ఆదివారం. 20:30 విఘడియలు. మఖా నక్షత్రం. చతుర్థ చరణయుక్త , వృశ్చిక లగ్నం) పాండ్రంగిలోనే అమ్మమ్మగారి ఇంట పుట్టాడు. మొదటి బిడ్డ కాబట్టి ముద్దుగా చిట్టిబాబు అని పిలుచుకునే వారు. వెంకటరామరాజు నరసాపురంలోను, తరువాత తణుకులోను ఫొటో స్టుడియోలు తెరిచాడు. కానీ కలసి రాలేదు. రోజులు విసుగ్గా గyýుస్తున్నాయి, ఎండ కోసం పడిగాపులు కాసే ఫొటోగ్రాఫర్‌ నిరీక్షణ మాదిరిగా.1901లో మోగల్లులోనే కూతురుని కన్నది సూర్యనారాయణమ్మ. సీత అని పేరు పెట్టారు. ఆ మరుసటి సంవత్సరమే రాజమండ్రి వచ్చి, ఇన్నిస్‌పేటలో జవ్వాదివారి కొట్లలో స్టూడియో ప్రారంభించారాయన.

తన అభిరుచికి తగ్గట్టు స్టూడియోను అలంకరించారు వెంకటరామరాజు. బొంబాయి స్టూడియోల కళ తెచ్చారు. రకరకాల ఫ్లవర్‌వాజ్‌లు, ప్లాస్టిక్‌ పుష్పగుచ్ఛాలు ఏర్పాటు చేశాడు. వెంకటరామరాజు జాతీయవాది. బొంబాయిలో ఉన్నప్పుడు తీసిన బాలగంగాధర తిలక్‌. లాలా లజపతిరాయ్, మాలవీయ, సరోజినీ నాయుడు వంటి వారి ఫొటోలు చక్కగా అలంకరించారు. ఒకవైపు కలియుగ భీముడు కోడి రామమూర్తిగారి ఫొటో ఉండేది. వెంకటరామరాజు స్వతహాగా చిత్రకారుడు. తను గీసిన ల్యాండ్‌స్కేప్‌లూ, పోర్ట్రెయిట్లు అందంగా అమర్చారు.

పక్క గదిలో మ్యాజిక్‌ లాంతర్‌ ఉండేది. రాజమండ్రి బాగా కలసి వచ్చింది. సూర్యనారాయణమ్మ ఒంటి మీదకి యాభయ్‌ తులాల బంగారం చేరింది. ఐదు వేల రూపాయలు వెనకేశారు. అక్కడే 1906లో సూర్యనారాయణమ్మ మరో పిల్లవాడికి జన్మనిచ్చింది. అతడే సత్యనారాయణరాజు. 1908లో ఆ ఫొటోగ్రాఫర్‌ కుటుంబ చిత్రం హఠాత్తుగా వెలిసిపోయింది. ఆ సంవత్సరం గోదావరి పుష్కరాలు వచ్చాయి. అవి వెళ్లాక కలరా వచ్చింది. వెంకటరామరాజు కన్నుమూశారు. సూర్యనారాయణమ్మకి జీవితం భారమైపోయింది. ఆ బాధ నుంచి కోలుకోకుండానే ఉద్యోగం సంపాదిస్తానని చెప్పి వెళ్లిపోయాడు చిట్టిబాబు. రెండేళ్లకి మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నాడు.    

 2
ఎడ్లబండి ఇంటి ముందు ఆగగానే సిద్ధంగా పట్టుకుని ఉన్న ముక్కాలి పీట వెనకాల వేశాడు నూకాలు. బండిని చూసి గబగబా రామాలయం నుంచి వచ్చిన రామరాజు ముక్కాలి పీట దగ్గరగా వెళ్లాడు. కట్టిన గుడ్డను తప్పించుకుని మొదట సూర్యనారాయణమ్మ బయటకు చూసింది.ఎదురుగా తన చిట్టిబాబు, చిరునవ్వుతో చేయి అందిస్తున్నాడు. ‘‘చిట్టిబాబూ!?’’ పిలిచిందామె, ఒక ఉద్విగ్నతతో.‘‘నేనేనమ్మా! రా, దిగు!’’ అన్నాడు ఆసరా ఇస్తూ.‘‘ఎన్నాళ్లకి చూశాన్రా నాన్నా!’’ అంటూ కంట ఆనందబాష్పాలు కారిపోతూ ఉంటే కొడుకును గుండెకు హత్తుకుందామె.సన్నగా, పొడవుగా పచ్చని ఛాయతో ఉంటుందామె. ఆ ఉద్విగ్న దృశ్యం అందరినీ కదిలించింది.  సీత, తమ్ముడు దిగి, అమ్మమ్మను దింపారు. తమ్ముడినీ, చెల్లినీ ఆప్యాయంగా చూశాడు రామరాజు.‘‘అమ్మమ్మా!’’ అంటూ వెళ్లి కాళ్లకి దణ్ణం పెట్టాడు. కళ్లొత్తుకుంటూ దీవించారామె.‘‘రండమ్మా!’’ అని పిలిచింది సోమమ్మ.


గబగబా వెళ్లింది సూర్యనారాయణమ్మ. ‘‘సోమమ్మగారా తల్లీ మీరు!?’’ అంది.ఆమె సమాధానం కోసం కూడా చూడకుండానే ‘‘మీ మేలు ఈ జన్మలో మరచి..పోలే..నమ్మా! నా చర్మంతో చెప్పులు కుట్టించి ఇచ్చినా రుణం తీరదు.’’ అంది, రెండు చేతులూ జోడించి. అంతకు మించి మాటలు దొరకలేదామెకు. గొంతు పూడుకుపోయింది.‘‘కాళ్లు కడుక్కో తల్లీ ముందు. ఎప్పుడు బయలుదేరారో!’’ ఎడం చేత్తో చీర చెంగు పట్టుకుని కళ్లు ఒత్తుకుంటూ, కుడి చేత్తో నీళ్ల చెంబు అందించారామె.గుమ్మం దగ్గర నిలబడిన భాస్కరుడు రెండు చేతులూ జోడించి సాదరంగా ఆహ్వానించారు.
 
3
పెద్దకొడుకు జ్ఞాపకం అంటే– ఆ ఒక్క ఫొటోయే సూర్యనారాయణమ్మకి.ఎప్పుడు పెట్టె తెరిచినా అపురూపంగా చూసుకుంటూ ఉంటుందామె. సరిగ్గా పదేళ్ల క్రితం చిట్టిబాబు కాకినాడ పిఠాపురం రాజావారి ఉన్నత పాఠశాలలో చదువుకున్నప్పుడు తీసిన ఫొటో.కింద స్టూడియో పేరు, 12– 12–1912 అని ఉంటుంది. మౌంట్‌కు అంటించి ఉన్న విద్యార్థుల గ్రూప్‌ ఫొటో. ‘‘ముట్టుకుంటే మాసిపోతాడన్నట్టు ఉండేవాడు. ఆ చక్కదనం చూసే వీణ్ణి నాటకంలో శశిరేఖ పాత్ర వేయించారట.’’ ముసిముసిగా నవ్వుతూ అంది అచ్యుతమ్మ.నల్లకోటు, మెడలో ఒక పతకంతో, ముద్దుగారే చిట్టిబాబు కనిపిస్తాడు అందులో. శశిరేఖా పరిణయం నాటకం వేస్తే, చిట్టిబాబు శశిరేఖ పాత్రతో పాటు నారదుడు పాత్ర కూడా ధరించాడు. ఏటా డిసెంబర్‌ 12న జార్జి చక్రవర్తి పట్టాభిషేక దినోత్సవాన్ని ఘనంగా జరిపేవారు. ఆ సందర్భంగా ప్రదర్శించినదే శశిరేఖా పరిణయం. ఆ ఫొటో ఆరోజు తీసిందే.పెట్టెలో నుంచి తెచ్చి సోమమ్మకి చూపిస్తోంది సీత, ఆ ఫొటో.

శ్రీరామరాజు చిన్నతనం మీదకి పోయింది వాళ్ల చర్చ.
ఆ పూట భోజనాలయ్యాక ఆడవాళ్లు ముగ్గురు పెరట్లో నులక మంచం మీద కూర్చున్నారు. ఎంతో అందమైన పెరడు. మధ్యలో తులసికోట. ఒకపక్క ధాన్యపు పురి. దాని మీద పచ్చటి గొడుగు వేసినట్టు దట్టమైన ఆకులతో బాదం చెట్టు. ప్రహరీ గోడని అనుకుని రెండు వేపచెట్లు, ఒక మామిడి చెట్టుతో ఆహ్లాదకరంగా ఉంది.  ‘‘వాడికి చిన్నతనం నుంచి ఉందిలెండి భక్తి! రెండేళ్లు, మూడేళ్లు ఉన్నప్పుడే నాతో కూర్చుని అన్ని పూజలు చేసేవాడు. చక్కగా పారాయణం చేసేవాడు. నా మనవడని కాదుగానీ, ఎంత శ్రావ్యమైన గొంతు వాడిది?!’’ అంది అచ్యుతమ్మ.‘‘శతకాలన్నీ వచ్చేశాయి, చిన్నతనంలోనే. కానీ ఇంగిలీసు చదువులంటేనే వాడికి గిట్టదు.’’ అంది సూర్యనారాయణమ్మ. ‘‘అది లేకపోతే ఉద్యోగం కాదాయె!’’ అన్నది సోమమ్మ.‘‘అదేనమ్మా నా రంధంతా! రాజమండ్రిలో అక్షరాభ్యాసం చేసి, బంగారయ్య బడిలో వేశారు వాళ్ల నాన్న. బుద్ధిగా వెళ్లేవాడు. వాళ్ల నాన్నగారు పోయారు. అంతే, చదువు మీద ఆ శ్రద్ధ, ఆ పొందిక, ఆ నడవడిక – ఏమైపోయాయో తెలియదు!’’ అంది కంటిలో నీటితెరతో సూర్యనారాయణమ్మ.‘‘మగపిల్లాడికి తండ్రి పోవడం శరాఘాతమే కదమ్మా!’’ అంది సోమమ్మ.‘‘అదయ్యాకే భీమవరంలో ఒక బళ్లో చేర్పించాం.’’ అన్నారు సూర్యనారాయణమ్మ.‘‘అదో ముచ్చట మళ్లీ!’’ చిన్నగా నవ్వుతూ చెప్పారు అచ్యుతమ్మ.

‘‘కొవ్వాడ అని, భీమవరం పక్కనే– మా చెల్లెలిగారి ఊరు. అక్కడ మకాం. దాని పేరు అప్పలనర్సయ్యమ్మ. ఇంతా చేస్తే రెండు మైళ్లు. రాజమండ్రిలో వాళ్ల నాన్నగారు తీసుకువెళ్లేవారు. పైగా ఇంటికి దగ్గరే బడి. కొవ్వాడ వెళ్లాక ఆ రెండు మైళ్లూ నడిచి భీమవరం వెళ్లడం వాడికి కష్టమనిపించింది. ఏం చేశాడో తెలుసా తల్లీ? వాళ్లింట్లోదే గరళపు మాత్రల సీసా, అది తీసుకుపోయాడట. ఒకటీ రెండూనా! రెండువందలున్నాయట. అన్నీ మింగేశాడట. బడి నుంచి ఇంటికొచ్చాడు, పడిపోయాడు. పేలాలు వేగిపోయేటంత జ్వరం. దక్కుతాడా అనిపించింది.’’ అంటూ ఆపింది సూర్యనారాయణమ్మ.‘‘అయ్యయ్యో!’’ అది బుగ్గలు నొక్కుకుంటూ సోమమ్మగారు.‘‘ఎలాగో చావు తప్పింది. కాస్త కోలుకుని మనిషి కావడానికి మూడు మాసాలు పట్టింది. చేతికి కర్ర కూడా వచ్చేసిందమ్మా! ఇక, చదువుకు ఎగనామం అయిపోయింది!’’ అంటూ ముగించింది సూర్యనారాయణమ్మ.

రెండు నిమిషాల మౌనం.
‘‘రాజమండ్రి అంటే బాగా ఇష్టం వాడికి. అక్కడైతే చదువుతాడేమోనని; మా బంధువులు ఒకాయన ఉన్నారు, చెమిటి రామరాజుగారని. ఆయన దగ్గర పెట్టాం. మళ్లీ మామూలే. నరసాపురంలో చదివాడు. రామచంద్రపురంలో చదివాడు. విశాఖపట్నం... కాకినాడ... వాణ్ని ఎలాగైనా ఇంగిలీసు చదువులు చదివించాలని దీని తాపత్రయం. వాడేమో వద్దు మొర్రో అనేవాడు.’’ అంది అచ్యుతమ్మ గారు నవ్వేస్తూ.వెంకటరామరాజు తమ్ముడు రామకృష్ణరాజుగారు ట్రెజరీ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి ఎదిగారు. ఆ ఉద్యోగంతో రామచంద్రపురం బదలీ అయ్యారాయన. అన్న కొడుకుని దారిలో పెట్టాలని ఆయన కూడా ఒక ప్రయత్నం చేశారు. తన దగ్గరకి రప్పించి అక్కడ జాతీయ పాఠశాలలో చేర్పించారు. ఏమైందో, 1911లో వచ్చిన రామకృష్ణరాజుని మరుసటి సంవత్సరమే బదలీ చేసేశారు. అది కూడా కాకినాడ. మళ్లీ అక్కడికి తీసుకుపోయి దద్దా, అంటే పినతండ్రి పిఠాపురం రాజావారి పాఠశాలలో మూడో ఫారంలో చేర్చారు.

దివాన్‌బహదూర్‌ డాక్టర్‌ రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రధానోపాధ్యాయుడు. ఆయన పేరు పక్కన డిగ్రీలు రామరాజుకి ఎప్పుడూ గుర్తుండేవి కావు. కాకినాడలోనే మద్దూరి అన్నపూర్ణయ్య అని, అతడు స్నేహితుడయ్యాడు. అతడు రామరాజుని ఆట పట్టిస్తూ ఉండేవాడు, వెంకటరత్నం నాయుడు గారి పేరు పక్కన ఎన్ని డిగ్రీలు ఉన్నాయో వెంటనే చెప్పమని. మళ్లీ అన్నపూర్ణయ్యే చెప్పేవాడు–  కె.టి., ఎం.ఎ., ఎల్‌టి. డి. లిట్, ఎల్‌ఎల్‌బి అని. ఇంగ్లిష్‌ విద్య పట్ల రామరాజుకు ఉన్న ఏహ్యభావాన్ని కనిపెట్టాడతడు. ఇంగ్లీషే కాదు, చదువంటేనే అనాసక్తంగా ఉండేవాడు రామరాజు. ‘నువ్వు ఎందుకు చదువుకోవు?’ అన్నాడొకసారి మిత్రుడిని. ‘‘ఇవి చదువులా?’’ అని అరిచాడు రామరాజు. ఆ ఆక్రోశం ఎవరికీ అర్థమయ్యేది కాదు. పాఠశాలకి క్రమంగా వెళ్లకపోయినా కౌతా రామకృష్ణయ్యగారి తాలింఖానాకు మాత్రం క్రమం తప్పకుండా వెళ్లేవాడు.

కాకినాడలో ఉండగానే 14వ ఏట అన్నవరం కొండమీద ఉపనయనం చేశారు.అక్కడ నుంచి మళ్లీ విశాఖపట్నం ఏవీఎన్‌ విద్యాసంస్థలో నాలుగో ఫారమ్‌లో చేర్చారు. ఈసారి స్వయంగా సూర్యనారాయణమ్మే కొడుకు దగ్గర కొంతకాలం ఉంది. మళ్లీ నరసాపురం బదలీ అయింది పినతండ్రికి. వశిష్ట గోదావరి ఒడ్డునే ఉంది టేలర్‌ పాఠశాల. ఈసారి అందులో చేర్చారు. ‘‘నరసాపురం ముచ్చట కూడా ఒకటుందమ్మా!’’ అంటూ ఆ సంగతి చెప్పింది సూర్యనారాయణమ్మ.అదే రామరాజు జీవితాన్ని పెద్ద మలుపు దగ్గరకి నడిపించింది.నరసాపురానికి దగ్గరేగానీ, గోదావరికి అవతల అంతర్వేదిలో ఏటా భీష్మ ఏకాదశికి ఉత్సవం జరుపుతారు. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉందక్కడ. డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో రామకృష్ణరాజు కుటుంబ సమేతంగా వెళ్లారు. వెంట చిట్టిబాబు కూడా ఉన్నాడు.చాలా పెద్ద ఉత్సవమే. ఎందుకో మరి, చిట్టిబాబు మనసు అంతర్వేది నుంచి చించినాడకు మళ్లింది. కొవ్వాడలో ఉండగా జరిగింది చించినాడతో పరిచయం. ఆ ఊరి మునసబుగారి పిల్లలతో చిట్టిబాబుకి ^è నువు. వారు పెంచుతున్న పెంకి గుర్రాన్ని ఎక్కి చూపించి ఒకసారి విజేతననిపించుకున్నాడు ఆ ఊళ్లో చిట్టిబాబు. ఆ గుర్రం కోసమే అంతర్వేది నుంచి చించినాడ వెళ్లిపోయాడు.

అంతర్వేది తీర్ధంలో పిల్లలు తప్పిపోవడం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. రామకృష్ణరాజు బాగా కంగారు పడ్డారు. నాలుగు రోజుల తరువాత తెలిసింది. పనివాళ్లు చిట్టిబాబుని ఇంటికి తీసుకురాగానే చెంప చెళ్లుమనిపించారు పినతండ్రిగారు. పనివాళ్ల ముందు కొట్టడం అవమానంగా తోచింది. వెంటనే తునిలో ఉన్న తల్లి దగ్గరకి వెళ్లిపోయాడు. తల్లి పోరడంతో తునిలో ఐదో ఫారంలో చేరాడు చిట్టిబాబు. అక్కడా అదే సమస్య. పాఠశాలంటేనే చిరాకు. ఎటో వెళ్లి పదిహేను రోజులకి గాని వచ్చేవాడు కాదు. ఒకసారి అక్కడ ప్రధానోపాధ్యాయుడు కూడా కొట్టాడు. ఇక జీవితంలో పాఠశాల ముఖం చూడలేదు. ఇవన్నీ చెప్పుకున్నారు ఆ ముగ్గురు మహిళలు. కొన్ని నవ్వించాయి. కొన్ని బాధించాయి. ఆ జ్ఞాపకాలు ముప్పిరిగొని వాళ్లని కొన్ని నిమిషాలు మౌనంగా ఉంచేశాయి.చివరికి సీత చేతిలో ఫొటోని మళ్లీ చూస్తూ సలహా ఇచ్చింది సోమమ్మ, ‘‘సరే, ఒకసారి పెళ్లి మాట ఎత్తి చూడకూడదా?!’’‘‘అమ్మ నాతల్లో! ఆ ఊసెత్తితే మళ్లీ వెళ్లిపోతాడేమో! నేనాపని చేయలేను. ఇప్పటికింతే కాబోలు!’’ అంది సూర్యనారాయణమ్మ, రెండు చేతులు గుండెల మీద వేసుకుంటూ.  
 

Advertisement
Advertisement