గరుడ గర్వభంగం | Sakshi
Sakshi News home page

గరుడ గర్వభంగం

Published Sun, May 21 2017 12:13 AM

గరుడ గర్వభంగం

సత్యభామకోసం కుబేరుడి ఉద్యానం నుంచి సౌగంధిక పుష్పాలు తీసుకురమ్మని గరుడిని పంపాడు కృష్ణుడు. తానెంతో బలశాలి, శక్తిశాలి కాబట్టే శ్రీకృష్ణుడు తనను పంపాడు అన్న అహంకారంతో అమిత వేగంతో పయనిస్తూ, కొద్దిసేపటికే గంధమాదన పర్వతం మీదికి చేరాడు. రెండు కాళ్లనూ పర్వతం మీద ఉంచి ఒక్క తన్ను తన్ని పైకి లేచాడు. ఆ వేగానికి అక్కడి వృక్షాలన్నీ వేర్లతో సహా నేలకూలాయి. ఆ పర్వతం మీదనే తపస్సు చే సుకుంటున్న హనుమంతుడికి తపోభంగమైంది. పూలు కోస్తున్న గరుడుని చూసి ‘‘ఎవరు నీవు, యజమాని అనుమతి లేకుండా పూలను కోసుకోవడమేగాక ప్రళయ మారుతం సృష్టిస్తున్నావు?’’అని అడిగాడు.

వృద్ధ వానరాకారంలో ఉన్న హనుమంతుని చులకనగా ఒక చూపు చూసి, ‘‘శ్రీకృష్ణుడంతటి వాడు నన్ను పూలు తీసుకు రమ్మని పంపితే నేను ఎవరి అనుమతీ అడగనక్కరలేదు, ఎవరి ప్రశ్నలకూ సమాధానాలు చెప్పనక్కరలేదను కుంటాను’’ అన్నాడు చాలా నిర్లక్ష్యంగా. హనుమకు ఒళ్లు మండిపోయింది. ఒక్క ఉదుటున పైకి లేచి గరుడుని ఒడిసి పట్టుకుని బాహువుల కింద ఇరికించుకున్నాడు. వేగంగా ద్వారకకు పయనమయ్యాడు. గరుడునికి ఊపిరి ఆడట్లేదసలు. నిస్సహాయంగా ఉన్నాడు.

కోపంగా వస్తున్న హనుమను చూసిన కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. తన మీదకు దూసుకు వస్తున్న సుదర్శనాన్ని ఆటబొమ్మలా పట్టుకుని, తన రెండవ చంకలో ఇరికించుకుని, శ్రీకృష్ణుని మందిరంవైపు పయనం సాగించాడు హనుమ. దూరం నుంచే అంతా గమనిస్తున్న కృష్ణుడు తన పట్టమహిషులతో ‘‘ఇప్పుడు హనుమ కోపాన్ని చల్లార్చాలంటే ఉన్నఫళంగా నేను రామునిలా, మీరెవరైనా సీతలా మారిపోవడమే తరుణోపాయం అంటూనే తాను రామునిలా, రుక్మిణీదేవి సీతలా రూపుదాల్చారు. హనుమ వస్తూనే రాముని చూసి భక్తితో నమస్కరించాడు. ‘‘చిరంజీవ’’ అంటూ ఆశీర్వదిస్తూనే ‘‘హనుమా! నీ సందిట్లో ఏమో ఉన్నట్లు కనిపిస్తోందే, ఏమిటవి?’’ అంటూ అమాయకంగా ప్రశ్నించాడు కృష్ణుడు..

వాటిని వదలకుండానే హనుమ ‘‘స్వామీ, నేను ప్రశాంతంగా తపస్సు చేసుకుంటుంటే గరుడ పక్షి ఒకటి వచ్చి అల్లకల్లోలం సృష్టిస్తోంది. దాన్ని పట్టుకుని వస్తుంటే చిన్న చక్రం ఒకటి నా దారికి అడ్డంగా వచ్చింది. దాన్ని కూడా నా చేతికింద ఇరికించుకున్నాను. అయినా, మీకు సౌగంధిక పుష్పాలు కావాలంటే నన్ను అడగవచ్చు కదా స్వామీ, అల్పమైన ఈ పక్షికి చెప్పడమెందుకు, మధ్యలో ఈ చక్రాన్ని అడ్డం వేయడమెందుకు?’’అన్నాడు వినయంగా.

హనుమ మాటలతో అప్పటిదాకా తామెంతో బలశాలురమని, తన వల్లే కృష్ణుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లగలుగుతున్నాడని అనుకుంటున్న గరుడునికి, తానుండబట్టే కదా, విష్ణువు అవలీలగా శత్రుసంహారం చేయగలుగుతున్నాడు అని అనుకుంటున్న సుదర్శన చక్రానికీ గర్వభంగమై, సిగ్గుతో తలలు వంచుకున్నాయి.

Advertisement
Advertisement