అమృతం ఎక్కడో లేదు... | Sakshi
Sakshi News home page

అమృతం ఎక్కడో లేదు...

Published Sun, Feb 1 2015 1:18 AM

అమృతం ఎక్కడో లేదు...

పోల్కంపల్లి శాంతాదేవి
‘‘దివ్య వెడ్స్ శ్రీకాంత్’’ అన్న అక్షరాలు విద్యుద్దీపాల వెలుగులో జిగేల్‌మని మెరిసిపోతుంటే, చక్కగా అలంకరించుకొన్న అమ్మాయిలు లోపలికి వస్తూన్న ఆహూతుల మీద పన్నీరు చిలకరించి అరవిచ్చిన గులాబీపువ్వులను చిరునవ్వులు చిందిస్తూ అందిస్తున్నారు.
 సౌండ్ బాక్సుల్లోంచి సినిమా పాటలు హుషారుగా వినిపిస్తున్నాయి. కొంచెం లోపలికి వెడితే యుద్ధ వాతావరణాన్ని తలపించే సన్నివేశం ఒకటి నడుస్తోందక్కడ.
 
అటు వధువూ వధువు తరఫు బంధుమిత్రులు వరుని తరఫు వాళ్ళని ఎదుర్కోలు సన్నివేశం రసవత్తరంగా సాగుతోంది! ఇరువురి మధ్య పదిపన్నెండడుగుల దూరం ఉంది; అరగంట గడిచినా ఎవరూ ఒక్క అడుగూ ముందుకు వేయడం లేదు. ఏదో పోనీలే అని ఒక్కడుగు ముందుకు వేసినా రెండడుగులు వెనక్కి లాగివేస్తున్నారు వెనుకున్న పరివారం, ‘‘నువ్వుండు! వాళ్ళే రానీ’’ అంటూ.
 
ఇరుపక్షాల వారికి ఇది ప్రెస్టేజీ ప్రశ్న అయిపోయింది. అటు పెళ్ళికూతురు దివ్య అన్న హర్ష పెద్దరికం వహిస్తే ఇటు పెళ్ళికొడుకు శ్రీకాంత్ చెల్లెలు శిరీష అన్నను కదలనివ్వడం లేదు! ‘‘వాళ్ళకే అంత బింకముంటే మనకేనా లేంది?’’ అంటూ నడుంకి చీరకొంగు చుట్టేసి అన్న చెయ్యి పట్టేసింది! వాళ్ళని రెచ్చగొడుతూ కుర్రకారు ఈలలూ, పాటలూ, అరుపులూ....
 ‘‘పెళ్ళితంతు ఇంకా చాలా ఉంది! ఇక్కడే ఆగిపోతే ఎలా? తొందరగా కానివ్వండి.’’ పురోహితులవారు గట్టిగా చెప్పడంతో మెల్లిమెల్లిగా పట్టుసడలింది.
 
గంధపురంగు పట్టుచీరలో సింఫుల్‌గా చుక్కల్లో చంద్రుడిలా కనిపిస్తున్న శిరీష మీదే చక్కర్లు కొట్టసాగాయి హర్ష చూపులు. పెళ్ళికొడుకు చెల్లెలని ఎవరో అనుకొంటుండగా విన్నాడు.
 బ్రాహ్మలు మంత్రాలు చదువుతుంటే వధూవరులు పరస్పరం పూలదండలు మార్చుకొంటుంటే మెల్లగా శిరీష పక్కకి చేరాడు హర్ష. ‘‘మీ పేరు, సత్యభామా?’’ నవ్వుతూ అడిగాడు.
 శిరీష తెల్లబోయింది. ‘‘ఎవరు చెప్పారు, సత్యభామ అని?’’
 ‘‘నడుంకి చెంగుచుట్టి మీ అన్నగారిని ముందుకు కదలనివ్వకపోతే... ఆ ఫోజూ... అదీ... నాకు సత్యభామలా కనిపించారు!’’
 
‘‘మీరు మాత్రం మీ చెల్లెలిని కదలనిచ్చారా? మీరు శిఖండిలా కనిపించారు!’’ అందామనుకొని బాగుండదేమోనని ఆపుకొంది.
 ‘‘ఖర్జూరాలు, బాదంకాయలు పెట్టిన కవరు దొరకడం లేదు. చూసిద్దువురా, శిరీ’’ అని తల్లి పిలిస్తే పరిగెత్తింది. ఇంకాస్సేపు మాట్లాడే అవకాశం లేకుండా పోయినందుకు నిట్టూర్చాడు. ‘‘శిరి’’ పేరు బాగుందనుకొన్నాడు.
 
ఎదుర్కోళ్ళ దగ్గర తప్ప ఎవరూ ఎక్కడా బెట్టుకుపోలేదు. మర్యాదలూ, లాంఛనాలూ... సక్రమంగా జరిగాయి. ‘‘మాంగల్యం తంతునానేనా...’’ వేదమంత్రాలు... అందరి ఆశీర్వచనాల మధ్య భార్యాభర్తలయ్యారు దివ్య, శ్రీకాంత్. ఆహుతులంతా భోజన తాంబూలాలు స్వీకరించి వెళ్ళిపోతుంటే దగ్గర బంధువులు మాత్రం ఆగిపోయారు. వివాహం తరువాత జరిగే తంతు పూర్తి అయ్యి ఉదయం నుండి ఉపవాసంతో ఉన్నవాళ్ళకు భోజనాలు పెట్టి అప్పగింతలకు రెడీ అవుతున్నారు.
 
మనస్సంతా బరువెక్కగా కూతురి వెంట పంపడానికి సారె చీరలు రెడీ చేస్తోంది దివ్య తల్లి పద్మావతమ్మ. కూతురితో పంపడానికి పెద్దకోడలు రాధికను, అక్క వరుసైన శారదమ్మను, ఆమె భర్తనూ పంపడానికి నిర్ణయమైపోయింది.
 గదిలో రెండు సూట్‌కేసులు ముందేసుకుని తన చీరలూ, ఆడపడుచు చీరలూ సర్దుతోంది రాధిక.
 ‘‘వదినా, ఏం చేస్తున్నావు?’’ అంటూ వచ్చాడు హర్ష. మనసులో మాట చెప్పి, ‘‘అక్కడికి వెడుతున్నావు కదా? విషయం కదిపి వాళ్ళ అభిప్రాయం కనుక్కుని రావాలి!’’ అన్నాడు.
 
రాధిక ఆశ్చర్యంతో మాట్లాడడానికి టైం పట్టింది. ‘‘నీకు ఆమె గురించి ఏం తెలుసునని ఒక నిర్ణయానికి వచ్చేశావు, హర్షా!?’’
 ‘‘భార్యగా ఎలాంటి అమ్మాయిని ఊహించుకున్నానో... ఆ లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయనిపించింది.’’
 ‘‘ఆమె అమ్మాయికాదు! అమ్మ... ఇద్దరు పిల్లలకి అమ్మ! విడో! భర్తపోయి ఏడాదవుతోంది!’’ కోపం, చిరాకు మిళితంకాగా అంది రాధిక.
 
హర్ష ముఖం పాలిపోయింది. శిరీష బాగా నచ్చింది. తొలిప్రేమ అంటారేమో! ఆమె చుట్టూ ఎన్నెన్నో ఆశలు అల్లుకున్నాడు. అక్కడితో ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికే నిర్ణయించుకున్నాడు. ‘‘పెళ్ళయింది కాని భర్తలేడు కదా? వితంతు పునర్వివాహం ఆదర్శమౌతుంది కూడా.’’
 ‘‘కొట్టానంటే ఆంజనేయుడు ముఖంలా వంకరపోతుంది తెలుసా?’’ కొడతానన్నట్లుగా చెయ్యెత్తింది కాని కొట్టలేదు రాధిక. మరిది దగ్గర ఆమెకా చనువుంది. ‘‘వట్టి వితంతువు కాదు! ఇద్దరు పిల్లలున్న వితంతువు!’’
 ‘‘మరీ మంచిది; పెళ్ళితోటే ప్రమోషన్ కూడా దొరుకుతుందన్న మాట ఇద్దరు పిల్లల తండ్రిగా.’’    
 ‘‘ఇదేం తలతిక్క?’’ నుదురు మీద కొట్టుకొంది. ఈ నిప్పును ఎంతోసేపు తన కొంగున కట్టుకోలేననుకుంది. గబగబా అత్తగారి దగ్గరికి పరిగెత్తి గుసగుసగా విషయం చేరవేసిగాని తేలికపడలేదు.
 కూతుర్ని ఓ అయ్య చేతిలోపెట్టి గుండెల మీది బరువు దింపుకొన్న సంతోషం కకావికలైపోయింది పద్మావతమ్మకు.
 
ఆవిడ ఏడవడం మొదలుపెట్టింది. ‘‘పెళ్ళి ఇంట్లో ఇదెక్కడి ముసలం పుట్టిందే? ఎంత పరువు తక్కువ? అంతటి మహాసౌందర్యవతి ఇంకెక్కడా దొరకదన్నట్టు మొగుడు చచ్చినదానిమీద మోజుపడ్డం ఏమిటి?’’ ఎంత గొంతు తగ్గించి మాట్లాడాలనుకొన్నా కోపంతో స్వరం అదుపు తప్పి హెచ్చిపోయింది.
 చుట్టుప్రక్కలున్న వాళ్ళు బిలబిల్లాడుతూ వచ్చేశారు. దగ్గరి బంధువులే కాబట్టి సంగతి దాచాలనుకోలేదు పద్మావతమ్మ. ‘‘వాడు అమెరికాలో డాక్టరు! ఎంతో మంది పిల్లనిస్తామన్నా ఒప్పుకోలేదు! చివరికి ఎటువంటి దాన్ని వలచాడో చూడండి!’’
 ‘‘అయ్యో రామ! ఇదెక్కడి చోద్యం?’’ వాళ్ళు ముక్కున వేలేసుకొన్నారు. ‘‘తావలచిన రంభ అంటారు దీన్ని!’’

 ‘‘కిందటిసారి నీ కొడుకు అమెరికా నుండి వచ్చినప్పుడు మా ప్రియాంకనిద్దామని ఫొటో చూపిస్తే పిల్లని చూడకుండానే తిరస్కరించాడు కదా? నీ కొడుక్కి కొంచెం నచ్చజెప్పి ఒప్పించరాదా అంటే ‘‘వాడికి నచ్చకపోతే నేనేం చేస్తాను?’’ అన్నావు! ఏదో ఒకటి చేసి ఆ రోజు నీ కొడుకుని ఒప్పించి ఉంటే ఈ రోజు ఈ కష్టం దాపురించేది కాదు కదా?’’ అంది వదిన వరుసైన సుమిత్రమ్మ. ఈ శిరీష నా కూతురి కంటే అందగత్తె అంటే నేనొప్పుకోను. ఏం చూసి వలచాడో నీ కొడుకు మరి!’’
 ‘‘చెప్పడానికి సందు దొరికిందా? ఆపద నుండి గట్టెక్కే మార్గం చెబుతావనుకొంటే...’’ కొంగుతో ముక్కుతుడుచుకొంటూ అంది పద్మావతమ్మ.

 ‘‘ఇంకా నా బిడ్డకు సంబంధం కుదరలేదు. నీ కొడుకును ఒప్పించు! ఆలస్యం లేకుండా పెళ్లి జరిపిద్దాం! సమస్య తీరిపోతుంది!’’
 ‘‘అప్పుడొప్పుకోని వాడు ఇప్పుడొప్పుకొంటాడా?’’
 ‘‘ఒప్పుకొంటే సరే... లేదంటే చస్తానని చెప్పు!’’
 ‘‘మా హర్ష పట్టుదల సంగతి నాకు తెలుసు! వాడొకసారి ఒక నిర్ణయం తీసుకొన్నాడంటే అది నెగ్గేదాకా వదలడు.’’
 
‘‘ఇంకేం? చేసుకో! కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే బిడ్డ పుడతాడని... ఒక్కరు కాదు... ఇద్దరు పిల్లల్తో సంతానలక్ష్మిలా అడుగుపెడుతుంది కోడలు! ఇంత అదృష్టానికి మురవాలి గాని ఏడుపెందుకు, పద్మావతొదినా!’’
 గదిలోకి పిలిచి తల్లి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినా నిరాశపడలేదు హర్ష. ఇది ఊహించిందే. ఇద్దరు పిల్లలున్న వితంతువును పెళ్ళాడతానంటే ఏ తల్లైనా ఆనందంతో హారతులివ్వదు కదా? కాని, ఏ తల్లికైనా కొడుకు సంతోషాన్ని మించింది లేదు. ఈ బలహీనతను ఆధారం చేసుకొనే తల్లి మనసు గెలుచుకోవాలనుకొన్నాడు. ముందు శిరీష ఒప్పుకొంటే అమ్మను ఎలాగైనా ఒప్పించుకొంటానన్న ధీమాతో ఉన్నాడు. అమ్మ తిడుతుందన్న భయంతో వదిన అడగలేకపోవచ్చు! తనే రంగంలోకి దిగాలి అనుకొన్నాడు.
 
అప్పగింతలయ్యి నూతన వధువుతో కారెక్కబోతున్న బావగారిని పక్కకి పిలిచి తన మనసులో మాట చెప్పేశాడు.
 ‘‘నా చెల్లి విడో అని, ఆమెకిద్దరు పిల్లలున్నారని తెలుసా?’’
 తెలుసునన్నట్టుగా తలాడించాడు హర్ష.
 ఆశ్చర్యమూ, ఆనందమూ ముప్పిరిగొన్నాయి శ్రీకాంత్ ముఖంలో. ‘‘ఈ విషయం మీ ఇంట్లో తెలుసా? ఒప్పుకొన్నారా?’’
 ‘‘ఒప్పిస్తాను! ఆ నమ్మకం నాకుంది!’’
 
‘‘మా శిరికి పెళ్ళి చేయాలని నాకెప్పటి నుండో ఉంది. నువ్వే అడగడం వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా ఉంది! థాంక్యూ, బావా! ఈ పెళ్ళి తప్పకుండా జరగాలి! మా శిరి కళ్ళలో మళ్ళీ వెలుగులు చూడాలి!’’
 ‘‘నువ్వు మనస్ఫూర్తిగా కోరుకొంటే మా పెళ్ళి తప్పకుండా జరుగుతుంది, బావా! శిరీషను ఒప్పించే భారం నీదే! కాని, ఒక రిక్వెస్ట్ ఏమిటంటే...’’
 ప్రశ్నార్థకంగా చూశాడు శ్రీకాంత్.

 ‘‘వచ్చే నెల్లోనే నేను అమెరికా వెళ్ళిపోతాను కాబట్టి ఈలోగానే మా పెళ్ళి జరిగిపోవాలి! మళ్ళీ ఆరునెలల తరువాత వస్తాను శిరీషను తీసుకుపోవడానికి. ఈలోగా వీసా, పాస్‌పోర్ట్... అంతా రెడీ కావాలి! పిల్లల్ని ఇప్పుడే నాతో తీసుకుపోలేను. మీరు ఎలాగోలా మేనేజ్ చెయ్యాలి కొంత కాలం. వాళ్ళని నాతో తీసుకుపోవడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేనుగాని కచ్చితంగా తీసుకుపోతాను.

వాళ్ళ భారం నాదే! వాళ్ళు ఇక్కడ ఉన్నా వాళ్ళ ఖర్చు నేనే పెట్టుకొంటాను. ఈలోగా అమ్మావాళ్ళు కూడా సెట్టవుతారు. అమెరికాలో అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. విడాకులు, పిల్లులున్న వాళ్ళని పెళ్ళాడడం అక్కడ కామన్. మన దగ్గర ఆ మార్పు ఎప్పుడొస్తుందో తెలియదు.’’
 ‘‘తరువాత వాళ్లు మారుతారో లేదో తెలియదు గాని ఇప్పుడు వాళ్ళ అంగీకారం లేకపోతే ఎలా, బావా? నలుగురు ఆశీర్వదిస్తేనే అది పెళ్ళవుతుంది!’’
 ‘‘ఆశీర్వదిస్తే సంతోషమే! మా కాపురం అమెరికాలో ప్రారంభమౌతుంది కాబట్టి అదొక అడ్డంకి కానేకాదు!’’
 
బావా బావమరిది దూరంగా వెళ్ళి మాట్లాడుకోవడం చూస్తున్నారు బస్సు దగ్గర నిలబడ్డ బంధువులు.
 ‘‘దుర్ముహూర్తం వస్తుంది. వచ్చెయ్యండి’’ కేకేశాడు ఓ పెద్దాయన. హర్షతో వీడ్కోలు తీసుకొని కదిలాడు శ్రీకాంత్. అతడికి చెప్పలేనంత సంతోషంగా ఉంది!

 ‘‘శిరీ... కూల్‌గా ఆలోచించు: ఒకసారి తలుపు తట్టిన అదృష్టం మళ్ళీ మళ్లీ తడుతుందనుకోకు! అమెరికా వెళ్ళిపోయేలోగా నీ జవాబు పాజిటివ్‌గా వస్తుందన్న ఆశాభావంతో ఉన్నాడు.’’
 ఎప్పటిలా కయ్‌మనలేదు శిరీష. చేస్తున్నపని ఆపకుండా  ఉదాసీనంగా ఉండిపోయింది. ఆమె మౌనం శ్రీకాంత్‌లో ఆశపొటమరించేలా చేసింది. ‘‘శిరి కొద్దికొద్దిగా మెత్తబడుతోంది!’’ అనుకొన్నాడు. ఈ పెళ్లి ప్రపోజల్ విషయమై మూడు రోజులుగా తర్జనల భర్జనల జరుగుతోంది.

ఎవరెవరో వచ్చి బుద్ధి చెబుతున్నారు అమ్మ.... అన్నయ్య... దగ్గరి బంధువులు....
 ఈసారి ఆ డ్యూటీ మేనత్త తీసుకొంది. ‘‘నీకెంతని? పాతిక దాటని వయసు! నీ వయసు వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళే కాలేదు. నువ్వు డిగ్రీలో ఉండగానే మంచి సంబంధం వచ్చిందికదా అని రవికిచ్చి పెళ్ళి చేశారు. వాడింత అల్పాయుష్కుడై నిన్నన్యాయం చేసిపోతాడని ఎవరూహించారు? పోతూపోతూ నీ మెడకు రెండు గుదిబండల్ని కట్టి మరీపోయాడు కదా?...’’    
 
అంతదాకా పేపరు చదివి, స్నానం చేసొచ్చి, ‘‘శిరీ! ఆఫీసుకి టైం అవుతూంది. టిఫిన్ తీసుకురా!’’ అని కేకేసినవాడు టిఫిన్ ప్లేట్ పట్టుకొచ్చేసరికే. ‘‘అబ్బా! నొప్పి!..’’ అంటూ గుండెల మీద నొక్కుకొంటూ కిందపడి మరీ లేవకపోతే ఎలా నమ్మాలి ఆ చావును? దువ్వుకొన్న క్రాఫు చెరగలేదు. రాసుకొన్న పౌడరు మాయలేదు. అప్పుడే పూసిన తాజా పువ్వులా ఉన్న ఆ ముఖం ఇంకా కళ్ళ ముందు కదులుతున్నట్టుగా ఉంది. భర్త చావు గుర్తొచ్చి శిరీష కళ్ళు చెమర్చడం మొదలుపెట్టాయి.
 
‘‘నా తలరాత ఇంతేనని భారంగా బ్రతుకు వెళ్ళదీయడానికి వెనుకటి కాలం కాదుగా? వితంతు స్త్రీకి మళ్ళీ పెళ్ళిని తప్పుపట్టడం లేదుకదా, అదొక అభ్యుదయంగా హర్షించే మార్పు వచ్చింది సమాజంలో. నీకు మళ్ళీ పెళ్లి చేయాలని ఎప్పటినుంచో అనుకొంటున్నాడు మీ అన్నయ్య. హర్ష నిన్ను చూసిన మొదటి క్షణంలేనో నువ్వే తన భార్యవని నిర్ణయించేసుకొన్నాడట! నీకిద్దరు పిల్లలున్నారని తెలిశాక కూడా అతడి నిర్ణయంలో మార్పురాలేదు. ఆ పిల్లల బాధ్యత తను సంతోషంగా తీసుకొంటానన్నాడు.

ఇప్పటికిప్పుడు ఆ పిల్లలను తీసుకుపోవడానికి వీసా అదీ ఇప్పుడే దొరకడం కష్టం కాబట్టి కొంత కాలంపాటు ఇక్కడే ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్‌లో ఉంచి ఆ ఖర్చు తను భరిస్తానన్నాడు. నీకింతకంటే ఏం కావాలి శిరీ?’’
 ‘‘నా నుండి నా పిల్లల్ని దూరం చేసే ఆలోచన మీకెలావచ్చిందో... దానికి నేనొప్పుకొంటానని ఎలా అనుకొన్నారో నాకు అర్థం కావడం లేదు. నా పిల్లలు ఎక్కడో అనాథల్లా పడివుంటే నేను పెళ్ళి చేసుకొని సుఖంగా ఉండగలనా?’’
 
అక్కడే ఉన్న శ్రీకాంత్ అన్నాడు: ‘‘పిల్లల్ని హాస్టల్స్ ఉంచి చదివించడం అనాథల్ని చేయడమని ఎందుకనుకొంటున్నావో నాకర్థం కావడం లేదు. ఎందరు కరోడ్‌పతులు పిల్లల్ని మంచి చదువు, మంచి నడవడిక రావాలని బోర్డింగు స్కూళ్ళలో, అమెరికా... లండన్ పంపించి చదివించడం లేదు? బయట ఉంచి చదివించడం ఇష్టం లేకపోతే పిల్లల్ని చూసుకోవడానికి మేము లేమా? నీకు పెళ్ళి చేసి మేం చేతులు దులుపుకొంటామని ఎలా అనుకొన్నావు? నువ్వు ఒడ్డున పడడం ఒక్కటే మాకు కావాలి! పెద్దాడిని నేను తీసుకుపోయి చదివిస్తాను. చిన్నా అమ్మ దగ్గరుంటాడు. నేను దివ్యని తీసుకొని ఢిల్లీ వెళ్ళిపోతే అమ్మా వాళ్ళు ఒంటరివాళ్ళు కాకుండా వాడుంటాడు. వాడితో అమ్మావాళ్ళకి మంచి కాలక్షేపం అవుతుంది.’’
 
‘‘అమ్మకి మోకాళ్ళ నొప్పులు. పిల్లల్ని పెంచి పెద్ద చేసే వయసా ఆమెది? పెద్దాడిని నువ్వు తీసుకుపోతానంటున్నావు; నీ భార్య ఒప్పుకోవద్దా? నీ బలవంతం వల్ల ఒప్పుకొన్నా ఎంతకాలమని భరిస్తుంది? ఇదెక్కడి తద్దినమని విసుక్కోదా?’’
 ‘‘అన్నీ నువ్వే అనుకొంటే ఎలా? నువ్వు దివ్య అన్నయ్యనే కదా చేసుకొంటున్నది? నా మేనల్లుడు ఆమెకీ అల్లుడే అవుతాడు’’
 
‘‘అతడిని పెళ్ళి చేసుకొని... అతడొక్కడు నావాడైతే సరిపోతుందా? అతడి కుటుంబం కూడా నాకు కావాలి! అది అసాధ్యం కాబట్టి మళ్ళీ మళ్ళీ పెళ్ళి చేసుకొని నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నాకు లేదు. ఈ జీవితానికీ అనుభవాలు చాలు! ఆయన నన్నెంతో ప్రేమించారు. ఆయన స్మృతులను తోడు చేసుకొని నా పిల్లల్ని నేను పెంచుకోగలను. ఎల్లకాలం మీకు బరువుగా ఉంటానని అనుకోవద్దు! ఏదో ఒక పని చూసుకుని నా పిల్లల్ని తీసికెళ్ళిపోతాను. నా బతుకు నేను బతుకుతాను’’.
 
శ్రీకాంత్ మనసు గాయపడింది. ‘‘ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు, శిరీ? నువ్వు మాకు భారమా? మోడుగా మారిన నీ జీవితంలో మళ్ళీ వసంతం రావాలని కోరుకోవడం తప్పా? నీ జీవితం కలకలలాడాలని కోరిక తప్ప నిన్ను వదిలించుకోవాలని కాదు. ఇంకోసారి ఆ మాట అనకు!’’
 ‘‘నా జీవితం మోడు కాదు! రామలక్ష్మణుల్లా ఇద్దరు పిల్లలు! వాళ్ళని పెంచి పెద్దజేయాల్సిన కర్తవ్యం నాముందుంది!’’
 
‘‘నీ పిల్లల కోసమే నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదనుకొంటే - నీ పిల్లలకు ఓ మంచి దారి భగవంతుడు చూపుతున్నాడే, శిరీ! మా బావగారి అమ్మాయి రుక్మిణికి పిల్లలు లేరన్న సంగతి నీకు తెలుసుననుకొంటాను. కాంట్రాక్టరుగా వాళ్ళాయన కోట్లకు కోట్లు సంపాదించాడు. నీ చిన్న కొడుకును దత్తత ఇస్తే తీసుకోవాలని ఆశపడుతోంది మా రుక్మిణి. ఊరికే కాదు. నీ పెద్దకొడుకు పేరు మీద బ్యాంక్‌లో కోటి రూపాయలు వేస్తారట. వాడి భవిష్యత్తుకు రాచబాటలు వేసుకోవచ్చు! నిన్నడగమని ఎప్పటినుంచో నన్ను పోరుపెడుతుంది మా రుక్మిణి.

హఠాత్తుగా నీ మొగుడుపోయి నీ ఆపదలో నువ్వుంటే ఎలా అడగాలో పాలుపోక అడగలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నీ చిన్న కొడుకు కోటీశ్వరుల ఇంటిలో దర్జాగా పెరుగుతాడు. దత్తు ఇచ్చినా నీకు బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు...’’
 ‘‘అత్తా!’’ అరిచింది శిరీష. ‘‘వాళ్ళేదో ఆశకొద్దీ అడిగారే అనుకో! అది మోసుకొచ్చి నాకు చెప్పబుద్ధి ఎలా అయింది? ఏ తల్లికైనా పిల్లలు బరువా?’’

 ‘‘బరువని కాదు! నువ్వేదో చిన్న ఉద్యోగమో, పాచిపనో చేసి పిల్లల్ని సాక్కోవచ్చు! వాళ్ళ కనీస అవసరాలైనా తీర్చలేక నీ తల్లి మనసు యాతనపడదా? నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచన తోటే చెబుతున్నాను. నువ్వు కొంచెం మనసు దిటవు చేసుకొంటే చిన్నా కోటీశ్వరుడవుతాడు!’’
 ‘‘నా చీకటి బతుకులో నా పిల్లలిద్దరూ నా రెండు కళ్ళు అత్తా! వాళ్ళు నాకు రెండు దీపాలు! పెద్దవాడి భవిష్యత్తు కోసం చిన్నవాడిని అమ్ముకొమ్మని చెప్పడం న్యాయమా? ఇంకోసారి నా దగ్గర ఈ సంగతి ఎత్తకు అత్తా! అన్నయ్యా, నీకు చెబుతున్నాను. మళ్ళీ పెళ్ళని నావెంటపడకు! ’’
 
దూరంగా పెళ్ళికి వచ్చిన చుట్టం ఒకాయన చిన్నాని ఎత్తుకొని ఉన్నాడు. ఆయన్ని గిచ్చుతూ, పీకుతూ కొడుతున్నాడు పెద్దవాడు వేణు. ‘‘మా తమ్ముణ్ణి మాకివ్వు!’’ అని ఏడుస్తున్నాడు.
 శిరీష పరిగెత్తింది. ‘‘భలే ఉన్నాడమ్మా, నీ పెద్దకొడుకు. తమాషాకి నీ తమ్ముడిని తీసుకుపోతానని ఎత్తుకొన్నానో లేదో ‘‘మా తమ్ముడు మాకే కావాలి! దించు!’’ అంటూ నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. తమ్ముడంటే ఎంత ప్రేమో చూడు వాడికి!’’
 
‘‘తమ్ముణ్ణి తీసుకో, అమ్మా! ఆయన తీసికెళ్ళిపోతానంటున్నాడు!’’ ఇంకా ఏడుస్తున్నాడు వేణు.
 ‘‘తాతయ్య తమాషాకి అన్నాడు లేరా! ఏం తీసుకుపోడు!’’
 ఆ ముసలాయన దగ్గర నుండి పిల్లాడిని తీసుకొనేదాకా వదల్లేదు వేణు.
 ‘‘నీ తమ్ముణ్ణి నువ్వే ఉంచుకో! నాకేం వద్దు! మా ఇంట్లోనే బోల్డెంత మంది మనుమలూ, మనుమరాళ్ళూ ఉన్నారు...’’ ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు.
 ‘‘నన్నూ ఎత్తుకో!’’ పోటీగా చేతులు చాచాడు వేణు.

 వాడిని మరో చంకనేసుకొని, ఇద్దరికీ ముద్దులు పెడుతూ గదిలోకి వెళ్ళిపోయిన చెల్లెల్ని చూసి అన్నాడు శ్రీకాంత్: ‘‘అమృతం ఎక్కడో లేదత్తా! పూలగుండెలో సుధ ఉన్నట్టు అమ్మ గుండెలో మమకారంగా ఉందది! అణువంత పిండానికి ఊపిరులూది, దానికి ఆకృతినివ్వడానికి తన రక్తమాంసాలు ధారబోసి, దాన్ని ఈ లోకంలోకి తీసుకురావడానికి ప్రాణమే పణంగా పెట్టి, ప్రాణాలన్నీ దానిమీదే పెట్టి పెంచి పెద్దజేసి నిలువెత్తు మనిషిగా తీర్చిదిద్ది ఎన్నో చేసే అమ్మ అమృతకలశం కాక ఇంకేమౌతుంది? శిరికి పిల్లల మీద ఆ మమకారమే లేకపోతే హర్ష ప్రపోజల్ సంతోషంగా అంగీకరించేది కదా? ఈ పెళ్ళి ప్రస్తావన తెచ్చి శిరిని అనవసరంగా హర్ట్ చేశాననిపిస్తోందత్తా! ఇంకోసారి శిరి మనసు నొప్పించే పని చేయను!’’  జేబులో ఫోన్ రింగయితే చేతిలోకి తీసుకొని చూశాడు. హర్ష!
 ‘‘సారీ, బావా!’’ ఇంకేం చెప్పాలో తోచక ఫోన్ కట్ చేశాడు శ్రీకాంత్.      

Advertisement
Advertisement