కాపలా లేని గేట్లు.. మృత్యు ద్వారాలు | Sakshi
Sakshi News home page

కాపలా లేని గేట్లు.. మృత్యు ద్వారాలు

Published Thu, Jul 24 2014 12:39 PM

కాపలా లేని గేట్లు.. మృత్యు ద్వారాలు - Sakshi

మన దేశంలో 12,582 కాపలా లేని రైల్వే క్రాసింగులు ఉన్నాయి. వీటన్నింటి దగ్గరా ఏదో ఒక సమయంలో ఏదో ఒక ప్రమాదం సంభవిస్తూనే ఉంది. ఈ క్రాసింగులన్నీ మృత్యుద్వారాలుగా మారుతూ లెక్కలేనన్ని ప్రాణాలను బలిగొంటున్నాయి. ఎక్కువ శాతం ప్రమాదాలకు ఇతర వాహనాల డ్రైవర్ల తప్పే కారణం అవుతోంది. మెదక్ జిల్లాలో స్కూలు బస్సును రైలు ఢీకొన్న నేపథ్యంలో.. ఇటీవలి కాలంలో జరిగిన కొన్న ఘోర ప్రమాదాలను చూద్దాం..

2014 మే 19: ఉత్తరప్రదేశ్లోని ఖల్సాహా వద్ద కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆ రాష్ట్ర మంత్రి సతాయ్ రామ్ యాదవ్, మరో ఇద్దరు మరణించారు.

2014 మే 9: గోరఖ్పూర్ వద్ద లెవెల్ క్రాసింగుపై జీపును రైలు ఢీకొనడంతో పెళ్లి బృందానికి చెందిన 13 మంది మృతి చెందారు.

2012 సెప్టెంబర్ 26: బీహార్లోని సివాన్ ప్రాంతంలో వేగంగా వస్తున్న హౌరా-కేజీ గుడాం బాగ్ ఎక్స్ప్రెస్ రైలు కాలేజి బస్సును ఢీకొనడంతో 9 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారు. స్థానికులు ఆగ్రహంతో రైలుకు నిప్పు అంటించారు.

2012 మార్చి 20: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 296 కిలోమీటర్ల దూరంలో ప్రయాణికులతో కిక్కిరిసిన మినీ వ్యాన్ను రైలు ఢీకొనడంతో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

2012 ఫిబ్రవరి 3: అసోంలోని కామరూప్ జిల్లాలో ఓ వాహనాన్ని రైలు ఢీకొనడంతో ముగ్గురు మరణించారు, మరో 50 మంది గాయపడ్డారు.

2012 డిసెంబర్ 19: ఆంధ్రప్రదేశ్లోని మెదక్ జిల్లా శంకర్పూర్ వద్ద ఇండోర్-యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలు లారీని ఢీకొని 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది. చాలామంది గాయపడ్డారు.

2011 జూలై 7: ఉత్తరప్రదేశ్లోని కాన్షీరాం జిల్లా తనగావ్లో కాపలాలేని రైల్వే గేటు వద్ద తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పెళ్లికి వెళ్తున్న బృందంతో కూడిన బస్సును మథుర- చాప్రా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొంది. దీంతో 38 మంది మరణించగా మరో 30 మంది గాయపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement