మోడీ.. రోజుకు 18 గంటల పని!! | Sakshi
Sakshi News home page

మోడీ.. రోజుకు 18 గంటల పని!!

Published Tue, Jul 29 2014 2:17 PM

మోడీ.. రోజుకు 18 గంటల పని!! - Sakshi

మౌనముని మన్మోహన్ సింగ్ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా సైలెంట్గానే ఉంటున్నారని, అస్సలు ఆయన పనిచేసినట్లే కనిపించడంలేదని ఇటీవలి కాలంలో కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే.. మన ప్రధానమంత్రి పని మనకు కనిపించడంలేదు గానీ, పొరుగునున్న చైనాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన తెల్లవారుజామున 5.30 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు.. అంటే దాదాపు 18 గంటల పాటు మోడీ పనిచేస్తున్నారని చైనాకు చెందిన 'గ్లోబల్ టైమ్స్' పత్రిక తన కథనంలో పేర్కొంది. పరిశుభ్రత, సమయపాలన.. ఈ రెండింటికీ మోడీ సర్కారు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఫైళ్లలో ఏ ఒక్కటీ పెండింగు ఉండటానికి వీల్లేదని ఉన్నతాధికారులకు స్పష్టం చేస్తోందని ఈ కథనంలో తెలిపారు. మంత్రులంతా తమ తమ శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ... ఉన్నతాధికారులు సమయానికి వస్తున్నారో లేదో, కార్యాలయం పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయో లేవో చూస్తున్నారని, ఏమాత్రం సరిలేకపోయినా ఊరుకోవట్లేదని ఆ కథనంలో పేర్కొన్నారు.

పాత ప్రభుత్వం కాలం నుంచి పెండింగులో ఉన్న ఫైళ్లను కూడా చకచకా క్లియర్ చేసేస్తున్నారని, అధికారులంతా ఉదయం 9 గంటలకల్లా ఆఫీసుకు వచ్చి, సాయంత్రం 6 గంటల వరకు కచ్చితంగా ఉండేలా చేస్తున్నారని వివరించారు. ఏవైనా పనులుంటే 6 గంటల తర్వాత కూడా పనిచేయిస్తున్నారు. శనివారాలు కూడా అందరూ పని చేస్తున్నారని, అధికారులు ఏమైనా పని మిగిలిపోతే ఇళ్లకు ఫైళ్లు తీసుకెళ్తున్నారని చెప్పారు. తమ శాఖల కార్యాలయాల్లో ఎక్కడా దుమ్ము ఉండకుండా, పాత ఫర్నిచర్ మిగలకుండా, ఫైళ్లు డెస్కుల మీద ఉండకుండా, కిళ్లీ ఉమ్మేసిన మరకలు కనపడకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ఆయా శాఖల కార్యదర్శులకు అప్పగించారని పేర్కొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారిక పత్రిక 'పీపుల్స్ డైలీ'కి ఇంగ్లీషు వెర్షనే ఈ 'గ్లోబల్ టైమ్స్' పత్రిక.

Advertisement

తప్పక చదవండి

Advertisement