శ్రీదేవీ రమణీయం | Sakshi
Sakshi News home page

శ్రీదేవీ రమణీయం

Published Sun, Jun 28 2015 12:04 AM

శ్రీదేవీ రమణీయం

సోల్ మేట్
బాపు-రమణల జంటలో ఒకరైన ముళ్లపూడి వెంకటరమణ జయంతి నేడు. రమణగారు చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డారు. పదో యేటే తండ్రిగారు గతించడంతో రమణగారి తల్లిగారు పిల్లలను తీసుకుని మద్రాసు వచ్చారు. అక్కడే రమణగారు ఎస్‌ఎస్‌ఎల్‌సి వరకు చదివారు. చదువు అయిపోయాక మళ్లీ రాజమండ్రి వచ్చేశారు.


కొన్నాళ్లు చిన్నాచితకా పనులు చేశారు. ఖాళీ సమయంలో ఇంగ్ల్లీషు పుస్తకాలు చదువుతుండేవారు. అది చూసి అక్కడి ఇంగ్లీషు దొరగారు రమణగారిని అభిమానించి ‘ఇక్కడ పని మానేసి వెళ్లి మంచి ఉద్యోగం చూసుకో’ అని పది రూపాయలు చేతిలో పెట్టి పంపించారట. ఆ పది రూపాయలు, ఒక జత బట్టలు తీసుకుని, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రమణగారు మద్రాసు బయలుదేరారు. ఈ వివరాలన్నీ మనకు ఆయన ఆత్మకథలో దొరకుతాయి. అందులో లేని విషయాలు కొన్ని ఇప్పుడు ఆయన సతీమణి శ్రీదేవి మాటల్లో విందాం.  
 
సినిమాలలోకి రావడానికి ముందు రమణగారు ఏదో  చిన్న పత్రికలో ప్రూఫ్ రీడర్‌గా పనిచేశారు. అదేం దురదృష్టమో ఆ పత్రికను నెల్లాళ్లకే మూసేశారు. ఆ తరవాత ఆంధ్రపత్రికలో చేరారు. అక్కడ పనిచేయడం ప్రారంభించాక చాలా కథలు రాశారు. అయితే ఆంధ్రపత్రికలో కొంతకాలం పనిచేశాక రమణగారు ‘నేను ఒకరి కింద పనిచేయలేను’ అని పత్రిక నుంచి బయటకు వచ్చేశారు. ఉద్యోగం లేకపోయినా బతకగలను. జీతం కంటె విడిగానే ఎక్కువ సంపాదిస్తానని వారితో చెప్పి ఉద్యోగం మానేశారట. ఆయన అనుకున్నట్టుగానే డబ్బు కొద్దికొద్దిగా సంపాదించడం ప్రారంభించారు.
 
మహానటులు గోవిందరాజుల సుబ్బారావు గారి దగ్గరకు చాలామంది వస్తుండేవారు. ఆయన హోమియో వైద్యులు. ఆయన తమ్ముడి కొడుకు శ్రీనివాసరావు గారే వెంకటరమణగారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.  అప్పట్లో అజంతా గారు, విఏకె రంగారావుగారు, రావి కొండలరావు గారు వీరంతా స్నేహితులు. అందరూ కలిస్తే సరదాగా గడిపేవారట. ఆ తరవాత నెమ్మదిగా డబ్బింగ్ సినిమాలకి పనిచేశారు. తెలుగులో డూండీ గారి ‘రక్తసంబంధం’ మొట్టమొదటి సినిమా. అప్పటికే రమణగారు బాపుగారు అర్ధనారీశ్వరులయ్యారు. సినిమా కోసం ఏ కథ రాసినా ముందుగా బాపు గారితో చర్చించాక నాకు చెప్పేవారు. నాకు నచ్చితే బావుందని చెప్పేదాన్ని. లేకపోతే నా అభిప్రాయం నేను చెప్పేదాన్ని అంతే.
 

గోదావరి ప్రాణాధారం
రమణగారి సినిమాల్లో గోదావరి నేపథ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం లేకపోలేదు. రమణగారు బాల్యంలో ధవళేశ్వరం దగ్గర రాయవరంలో ఉండేవారు. అక్కడ లాంచీలు, పడవలు నడిపే వాళ్లు చాలామంది ఉండేవారు. రమణ గారి తల్లి వారందరికీ తలలో నాలుకలా ఉండేవారు. పడవ వాళ్లు దుంగలు అవీ తెచ్చి ఇస్తుంటే ఆవిడ అన్నం వండి, ఆవకాయ వేసి వాళ్లకి అన్నం పెట్టేవారు. వాళ్లు నిత్యం ఇంటికి వచ్చి వెళ్తుండటంతో రమణగారు నది ఒడ్డుకి వెళ్లి వాళ్లతోనే ఎక్కువగా ఆడుకునేవారు. ఆ పడవ వాళ్లకు రమణగారంటే చాలా ఇష్టం. వారు ఈయన్ని ఎత్తుకుని ఆడించేవారు. ఆ తరవాత మద్రాసు రావడం, మూగమనసులు చిత్రానికి ఆదుర్తి సుబ్బారావుగారితో పని చేయడం, ఆ కారణంగా గోదావరికి మళ్లీ రావడం జరిగింది. గోదావరిలో మొట్టమొదటి ఔట్‌డోర్ షూటింగ్ జరుపుకున్న చిత్రం మూగమనసులే. ఆ తరవాత చాలా సినిమాలు గోదావరిలో తీశారు. నాకు ఆయన చిత్రాలలో అందాల రాముడు అంటే చాలా ఇష్టం. ఆ సినిమా గోదావరి మీద తీసిందే.
 
బాపూ జోడీ
రమణ గారి గురించి మాట్లాడేటప్పుడు బాపు దంపతుల గురించి ప్రస్తావించకపోవడం సాధ్యం కాదు.  మా జీవితంలో ఆ దంపతులు నిత్యం ఉంటారు. బాపుగారికి మా అన్నయ్య (నండూరి రామమోహనరావు) నా ఫొటో చూపిస్తే, ఆయన వెంటనే ‘మా రమణ ఉన్నాడుగా’ అన్నారట. అలా నన్నిచ్చి వివాహం చేయడానికి అంగీకరించేశారు. మా పెళ్లినాటికి నా వయసు 20, రమణగారి వయసు 32. నేను అంతవరకు ఇల్లు కదిలిందే లేదు. అటువంటిది అందరినీ వదిలేసి ఆ చిన్న పల్లెటూరు నుంచి మద్రాసు మహానగరానికి వచ్చాను.  పెళ్లయిన మొదట్లో అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లేదాన్ని. ఆ తరవాత కొంత కాలానికి నేను ఇంటికి వెళ్లడమే తగ్గిపోయింది. బాపుగారి తల్లి సూర్యకాంతమ్మగారు... రమణగారిని, నన్ను సొంతమనుషుల్లా చూసుకున్నారు. మా అత్తగారు ఆదిలక్ష్మికి అందరి కంటె నేనంటేనే చాలా ఇష్టం. కోపం వస్తే మాట అనేసేవారు. అంతలోనే ప్రేమగా చూసేవారు.
 
బంగారు భాగ్యవతి...
బాపుగారి భార్య భాగ్యవతి నన్ను ఎంతో ఆప్యాయంగా ఆదరించింది. ఆవిడ నా కంటె నాలుగేళ్లు పెద్ద. పెళ్లయి వచ్చిన కొత్తలో నాకు ఎలా మసలుకోవాలో తెలియక మా ఇద్దరి మధ్య మాటా మాటా వచ్చినా భాగ్యవతి పెద్ద మనసుతో సద్దుకుపోయేది. ఆ తరవాత నాకే తెలిసేది నేను చేసిన తప్పేంటో. ఏదైనా సరే భాగ్యవతి కరెక్ట్‌గా చేస్తుందని కొంతకాలానికి అర్థం చేసుకున్నాను. ఇద్దరికీ మాట వచ్చినా, ఇబ్బంది వచ్చినా... జరిగిన తప్పును ఒప్పుకోవడం వల్ల వచ్చే సుఖం నాకు తెలుసు.
 
ధైర్యం ఎక్కువ

చిత్రాలు నిర్మించినప్పుడు ఎంత ఆస్తి కరిగిపోయినా, వెంకటరమణగారు ధైర్యంగా ఉండటంతో నేను కూడా ధైర్యంగానే ఉన్నాను. బాపు గారి అండ వల్ల అంత ధైర్యంగా ఉండగలిగామేమో అనిపిస్తుంది.  ఇల్లు అమ్మేసినప్పుడు ఎక్కడ ఉందామా అని ఆలోచిస్తుంటే, బాపు గారు ‘నాతో పాటే ఉండాలి’ అన్నారు. భాగ్యవతి అయితే మారు మాట్లాడనివ్వలేదు. ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు భాగ్యవతి వల్లే వచ్చింది. ఇంతకంటె మించింది లేదు. ఆ విషయం గురించి ఎవ్వరూ ఒక్కమాట కూడా అడ్డు చెప్పలేదు. నా జీవితంలో నేను ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకునే విషయం ఇది. రమణగారి పుట్టినరోజు సందర్భంగా ఒకసారి అందరినీ స్మరించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది.
 - సంభాషణ: డా. పురాణపండ వైజయంతి
 
బుడుగు...

బాపుగారి మేనల్లుడు బాగా అల్లరి చేస్తుండేవాడు. ఇకనేం డెన్నిస్ ద మినేస్ పాత్రల ఆధారంగా బుడుగు పాత్ర పుట్టుకు వచ్చింది. రమణగారిని వాళ్ల నాన్నగారు వాళ్లు బుడుగు అని, మా పెద్ద ఆడపడుచుని బుల్లులు అని పిలిచేవారు. అలా ఆ పాత్ర పేరు నిలబడిపోయింది.
 
మూత ఉండకూడదు...

రమణ గారికి భోజనం చేసేటప్పుడు గిన్నె మీద మూత పెట్టకూడదు. అలా ఉంటే ఆయన అన్నం తినడానికి ఇష్టపడరు. మూత తీసి ఉంచి, కొద్ది కొద్దిగా వడ్డిస్తూ ఉంటే తింటారు. అప్పుడే తనకు తృప్తిగా భోజనం చేసినట్టు అనిపిస్తుందనేవారు.

Advertisement
Advertisement