ఎంత తక్కువ తిన్నా పొట్ట తగ్గడం లేదు... | Sakshi
Sakshi News home page

ఎంత తక్కువ తిన్నా పొట్ట తగ్గడం లేదు...

Published Wed, Nov 25 2015 11:08 PM

ఎంత తక్కువ తిన్నా పొట్ట తగ్గడం లేదు...

ఆయుర్వేదం కౌన్సెలింగ్
 
 ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. అది తింటే జలుబు చేస్తుందని కొంతమంది అంటున్నారు. ఆయుర్వేదశాస్త్రం ప్రకారం ఏది నిజం? వివరాలు తెలియజేయగలరు.
 - మృదుల, హైదరాబాద్

 ఆయుర్వేద శాస్త్రానుసారం శరీరానికి ఆరోగ్యప్రదాయకమైన ఓషధులలో అత్యంత శ్రేష్ఠమైనది ‘ఉసిరికాయ’. దీనికి సంస్కృతంలో అనేక పర్యాయపదాలున్నాయి. ఉదాహరణకు ఆమలకీ, ధాత్రీ, అమృతా, పంచరసా, శ్రీఫలీ, వయస్యా, శివాచ, రోచని మొదలైనవి. ఉసిరికాయ తింటే జలుబు చేస్తుందనడం కేవలం అపోహ మాత్రమే. వాస్తవానికి అది జలుబును తగ్గిస్తుంది. షడ్రసాలలో ఒక్క లవణరసం (ఉప్పు) మినహాయించి మిగిలిన ఐదు రసాలూ ఉసిరికాయకు ఉంటాయి. అవి... మధుర (తీపి), ఆమ్ల (పులుపు), తిక్త (చేదు), కటు (కారం), వగరు (కషాయరసం). దీనికి కరక్కాయకూ (హరితకీ) సమాన గుణధర్మాలు ఉంటాయి. కానీ కరక్యాయ ఉష్ణవీర్యం. ఉసిరికాయ శీతవీర్యం.

గుణధర్మాలు: ఉసిరికాయ అత్యంత శ్రేష్ఠమైన ‘రసాయనం’. అంటే సప్తధాతువులకు పుష్టిని కలిగించి ఓజస్సును వృద్ధి చేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. శుక్రవృద్ధిని చేసి సంతానప్రాప్తికి కారకమవుతుంది. శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది.  ఆకలిని పుట్టించి, అరుగుదలను పెంచుతుంది. కడుపులోని మంటను, వాయువుని, పుల్లటి తేన్పుల్ని తగ్గిస్తుంది. వాంతిని పోగొడుతుంది. ఉదరశూలను కూడా తగ్గిస్తుంది. పొట్టలోని పురుగులను నశింపజేస్తుంది  అనీమియాను, పచ్చకామెర్లను, మొలలను హరిస్తుంది. ఉసిరితో కంఠస్వరం మెరుగుపడుతుంది. ఎక్కిళ్లు తగ్గుతాయి.  దగ్గు, జ్వరాలు, కళ్లెపడటం, శిరోజాలు నెరవడం, చర్మం పొడిబారడం, దద్దుర్లు, మచ్చలు తగ్గుతాయి.  హృదయానికి పుష్టికరం.

మధుమేహవ్యాధి నియంత్రణలో దీన్ని పసుపుతో కలిపి వాడుతారు. మూత్రంలో మంట, మూత్రం కష్టంగా వెడలడం, అతిమూత్రవ్యాధులలో గుణం కనిపిస్తుంది. మంచి ఫలితాల కోసం: వాడేవారి వయసును బట్టి, కోరుకున్న ఫలితాన్ని బట్టి తీసుకోవాల్సిన మోతాదును ఆయుర్వేద వైద్యుడు నిర్ణయిస్తారు. ఏ రూపంలో సేవించాలి:  స్వరసం: అంటే పండినకాయలోంచి గింజను తీసి, దంచి, రసం తీస్తారు.  కల్కం: అంటే పిక్కను తొలగించిన పిదప మిగిలిన గుజ్జు,  చూర్ణం: పిక్కలు తొలగించి ఆ ముక్కలను బాగా ఎండబెట్టి పొడిచేసుకోవాలి. ఔషధశాలలు ప్రత్యేకంగా తయారు చేసే విధానాలు:  ఆమలకీఘృతం  బ్రహ్మరసాయనం (లేహ్యం)  అగస్త్యహరీతకీ రసాయనం (లేహ్యం)  చ్యవనప్రాశలేహ్యం. మోతాదు: ఉసిరికాయలో ‘విటమిన్ సి’ చాలా ఎక్కువగా ఉండటమే కాకుండా, పైన పేర్కొన్న వివిధ రూపాలలోకి మార్చినప్పటికీ చాలా తక్కువ శాతం మాత్రమే ఆ విటమిన్ తగ్గుతుంది. ఎక్కువ శాతం అలాగే ఉంటుంది.
 
 డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
 ఆయుర్వేద నిపుణులు,
 సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్
 
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
 
 నా వయస్సు 28 ఏళ్లు. నన్ను పొట్ట సమస్య బాధిస్తోంది. నేను ఎంత తక్కువ మోతాదులో తింటున్నా  పొట్ట మాత్రం తగ్గడం లేదు. ఎందుకు ఇలా?
 - సుధాకర్, ధర్మవరం

 పొట్ట పెరగడం అనేది సాధారణంగా శరీర తత్వాన్ని బట్టి వస్తుంది. అలాంటప్పుడు మీరు ఎంత తక్కువ ఆహారం తీసుకున్నా పొట్ట తగ్గక పోవడం జరగవచ్చు. అయితే ఇందులో కొవ్వు కాకుండా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో చూడటానికి మీరు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షలో ఎలాంటి లోపాలు లేకపోతే మీరు భయపడనవసరం లేదు. ఇది మన శరీరతత్వాన్ని బట్టి వస్తుంది. కానీ మీరు తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలను తగ్గించుకొని, సమయానికి భోజనం చేయడం వంటివి పాటించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా మీరు మీ దగ్గరలోని డాక్టర్‌ను కలిసి ఇతర రక్త పరీక్షలు కూడా చేయించుకుంటే మంచిది. సాధారణంగా మన ఎత్తును బట్టి ఎంత బరువు ఉండాలో నిర్ణయించుకోడానికి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్‌ఐ) ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఎంత ఆహారం తీసుకుంటాం, ఎంత ఖర్చవుతోంది, ఈ రెండు సమంగా ఉన్నాయా లేదా అనే విషయం కూడా చూసుకోవాలి. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే పొట్ట వల్ల కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి మీరు మీ దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి ఆహార నియమాలు పాటించి చూడండి.
 
నాకు 37 ఏళ్లు. కడుపులో నొప్పి, బరువు తగ్గడం ఉంటే డాక్టర్‌ను కలిస్తే చిన్న పేగులో క్షయ ఉందన్నారు. ఆరు నెలలపాటు మందులు వాడాను. ఇది పూర్తిగా తగ్గుతుందో లేదో తెలుపగలరు.
 - రామమోహన్‌రావు, శ్రీకాకుళం

 సాధారణంగా చిన్న పేగు క్షయ వల్ల పేగులో పుండ్లు తయారవుతాయి. ఇది టీబీ మందుల వల్ల పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. అలా కాకుంటే చిన్న పేగుల్లో స్ట్రిక్చర్ మాదిరిగా వస్తే టీబీ నియంత్రణలోకి అప్పుడప్పుడు నొప్పి వచ్చే అవకాశం ఉంది. కాని ప్రస్తుతం లభించే క్షయ మందులు వ్యాధిని పూర్తిగా తగ్గించగలవు. మీరు వెంటనే దగ్గరలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి మందులు వాడుతుంటే మీ సమస్య పరిష్కారమవుతుంది.
 
 డాక్టర్ భవానీరాజు,
 సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
 కేర్ హాస్పిటల్స్,
 బంజారాహిల్స్,
 హైదరాబాద్
 
 న్యూరాలజీ కౌన్సెలింగ్
 
 నా వయసు 38 ఏళ్లు. నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. నాకు గత ఏడాదిగా తరచుగా తలనొప్పి వస్తుంది. సాధారణ తలనొప్పే కదా అంతగా పట్టించుకోలేదు. తలనొప్పి మళ్లీ మళ్లీ వస్తుండటంతో మాకు దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించాను. డాక్టర్ రాసిచ్చిన మందులు వాడితే తాత్కాలికంగా ఉపశమనం లభిస్తోంది. రెండు మూడు రోజుల తర్వాత తలనొప్పి పునరావృతం అవుతోంది. అసలు నొప్పి ఎందుకు వస్తుంది? దయచేసి నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించగలరు.
 - భవాని, కొత్తపేట

 తరచుగా తలనొప్పి వస్తుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చాలా కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. రక్తపోటు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, రక్త ప్రసరణలో మార్పులు చేటు చేసుకోవడం, మెదడులో కణుతులు ఏర్పడటం వంటి కారణాలతో తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. తలలోకి రక్తనాళాలు ఒత్తిడికి గురికావడం వల్ల మైగ్రేన్ వస్తుంది. మైగ్రేన్‌లో తలకు ఒక పక్కభాగంలో నొప్పి ఉంటుంది. స్త్రీలలో ఈ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తలలోకి రక్తనాళాలు ఒత్తిడికి గురికావడం వల్ల మైగ్రేన్ వస్తుంది. మైగ్రేన్‌లో తలకు ఒక పక్కభాగంలో నొప్పి ఉంటుంది. స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు తరచుగా తలనొప్పి వస్తుందని తెలిపారు కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే న్యూరో ఫిజీషియన్‌ను సంప్రదించండి. ముందుకు మీకు ఏ కారణంతో తలనొప్పి వస్తుందో తెలుసుకోవడానికి కొన్ని రక్త పరీక్షలు, సిటీ స్కాన్ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. పరీక్షలు వచ్చిన ఫలితం ఆధారంగా చికిత్స అందిస్తారు. సూచించిన పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్ధారణ చేసుకోండి. మీకు ఏదైనా వ్యాధి నిర్థారణ అయినా ఆందోళన చెందకండి. ప్రస్తుతం తలనొప్పి సంబంధించిన అన్ని వ్యాధులకు మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చికిత్సను కొనసాగిస్తూ వైద్యుల సూచన మేరకు జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సాధ్యమైనంత వరకు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీకు కుటుంబపరంగా, ఉద్యోగపరంగా ఏమైనా ఒత్తిడికి గురవుతుంటే ముందుగా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నించండి..
 
 డాక్టర్ జి. రాజశేఖర్ రెడ్డి
 సీనియర్ న్యూరో ఫిజీషియన్
 యశోద హాస్పిటల్స్
 సోమాజిగూడ,
 హైదరాబాద్
 

Advertisement
Advertisement