టూకీగా ప్రపంచ చరిత్ర 77 | Sakshi
Sakshi News home page

టూకీగా ప్రపంచ చరిత్ర 77

Published Wed, Apr 1 2015 10:52 PM

టూకీగా  ప్రపంచ చరిత్ర 77

మెసొపొటేమియాకు సమాంతరంగా నడిచిన నాగరికత ఈజిప్టుది. క్రీ.పూ 5500 కాలంలో, నైలునది ఎగువప్రాంతాన నగరాల నిర్మాణానికి పూనుకున్న ఈజిప్షియన్లు స్థానికులు కాదేమోనని కొందరి అనుమానం. ఎందుకంటే. క్రీ.పూ. 5000కు ముందు ఆ ప్రాంతంలో నివసించిన మనుషుల అవశేషాలకూ, తరువాతి కాలం అవశేషాలకూ వ్యత్యాసం కనిపిస్తుండడం వల్ల ఆదిమకాలం తరహా సంప్రదాయం ఒక్కసారిగా అంతరించి, పైపొరల్లో ఎదిగిన మనుషుల సంప్రదాయంలోని అవశేషాలు బయటపడుతున్న కారణంగా వీళ్ళు మెసొపొటేమియా నుండి వచ్చిన వలసలై ఉండొచ్చని అనుమానం.

దేవాలయాలూ, చిత్రలేఖనం వంటి నేర్పుల్లో మెసొపొటేమియాతో ఈజిప్టుకు పోలికలూ ఉన్నాయి, తేడాలూ ఉన్నాయి. నైలునదీ ప్రాంతంలో రాతికి కొరతలేని కారణంగా ఇక్కడి దేవాలయాలు రాతికట్టడాలు. ఈ దేవుళ్ళ ఆకారాలు వేరు, పేర్లు వేరు. అక్కడిలాగే ఇక్కడ కూడా అర్చకుల ఏలుబడిలో నగరపాలన మొదలైంది గానీ, పెద్ద ఆలస్యం కాకుండా ముగిసి, రాజవంశాల ఏలుబడికి సమాజం గెంతేసింది. అనాది నుండి ఈజిప్టు పాలకులు ‘ఫ్యారో’లుగా ప్రసిద్ధి. ఈ పాలకుల ప్రత్యేకత ఏమంటే -  వీళ్ళు దేవుని సేవకులు కాదు; స్వయంగా దేవతామూర్తులు.

క్రీ.పూ. 3వ శతాబ్దంలో నివసించిన ‘మ్యానెథో (క్చ్ఛ్టజిౌ)’ పేరుగల అర్చకుడొకాయన, అనాది కాలం నుండి తన జీవితకాలం దాకా  పరిపాలించిన రాజులందరిని 30 వంశాలుగా విభజించాడు. ఆ వంశాలకు విడివిడి పేర్లు లేకపోవడంతో, 1వది, 2వది, 3వది అంటూ లెక్కించడం ఆనవాయితీగా రూపొందింది. ఉత్తర, దక్షిణ నైలునదీ ప్రాంతాలను ఏకం జేసి, ఈజిప్టు మొత్తాన్ని ఒకే సామ్రాజ్యంగా నెలకొల్పిన ఘనతను అతడు ‘మెనెస్’ పేరుగల ప్రభువుకు ఆపాదించాడు. ఐతే, చారిత్రక పరిశోధనల్లో అలాంటి పేరుండే చక్రవర్తి ఆనవాళ్ళు దొరకలేదు. ‘నేర్మెర్ ప్యాలెట్   మీద, రాజలాంఛనాలు ధరించి వేటినో ఏకం చేస్తున్న భంగిమలో కనిపించే క్రీ.పూ.
 3150 నాటి ‘ఫ్యారో నేర్మర్’ చక్రవర్తే ఆ మెనెస్ అయ్యుండొచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు. అత్యంత విస్తారమైన ప్రాచీన నాగరికతగా పేరుగాంచిన ‘సింధూ’ పీఠభూమి పరిపాలనా విధానం గురించి చెప్పేందుకు ఎంతైనా ఉందిగానీ, నిరూపించేందుకు ఆధారాలు శూన్యం. తవ్వకాల్లో బయటపడిన కట్టడాల్లో స్మారకచిహ్నాలుగానీ, రాజమందిరాలుగానీ, దేవాలయాలుగానీ మచ్చుకైనా కనిపించవు. చక్కని వ్యూహరచనతో నిర్మితమైన పట్టణాలూ, ప్రతి ఇంటిని అనుసంధానం చేసే మురుగునీటి తరలింపు సౌకర్యం, ప్రామాణీకరించబడిన తూనికలూ, కొలతలూ తదితర విధానాలు పరిపాలన లేకుండా జరిగేవిగావు.

అది ఏ తరహా పాలో తెలుసుకునేందుకు గోరంత ఆధారం లేదు. ఆలయాలు గానీ, అర్చక వ్యవస్థగానీ లేకపోవడంతో సింధూ ప్రాంతీయుల ఆధ్యాత్మిక భావాలను గురించి తెలుసుకునేందుకు వీలుపడటం లేదు. ముద్రికల మీద అస్పష్టంగా ఉన్న బొమ్మల ఆధారంగా వాళ్ళు ‘పశుపతి’ని ఆరాధించేవాళ్ళని అన్వయిస్తున్నారేగానీ, యోగ ముద్రలో కూర్చోనున్నట్టు కనిపించే బొమ్మలను దేవుళ్ళతోనూ పోల్చుకోవచ్చు, కళావికాస ప్రయత్నంగానూ భావించొచ్చు.

క్రీ.పూ. 5వ శతాబ్దం వాడైన హెరొడొటస్ మొదలు క్రీ.శ.1900 దాకా ఏ చరిత్రకారునికి సింధూ నాగరికత మీద దృష్టి పడకపోయేందుకు కారణం అందులోని పౌరజీవితం నోచుకున్న ప్రశాంతత. వంచితే వంగిపోయేంత బలహీనమైన బరిసెలు, కొన్ని కత్తులు తప్ప అక్కడ ఇతర ఆయుధాల జాడ కనిపించదు. డాలు, ఖడ్గం వంటి పరికరాలు లేకుండా ఆ బరిసెలతో యుద్ధాలు చెయ్యడం సాధ్యపడదు. కొన్ని పట్టణాల చుట్టూ బలమైన గోడలు కనిపించినా, వాటి ప్రయోజనం అనూహ్యమైన వరదను అడ్డుకునేందుకే తప్ప ఆత్మరక్షణ కోసం కట్టుకున్నవిగా కనిపించదు. ఈజిప్టుకుమల్లే సింధూ పీఠభూమిది స్వయం సంరక్షిత నైసర్గిక స్వరూపం. ఉత్తరంలో హిమాలయ పర్వతాలు; పడమట బెలూచీ పర్వతాలు; దక్షిణాన అరేబియా సముద్రం, వింధ్య పర్వతాలు; తూర్పుదిశ నుండే యమునా గంగా మైదానం దట్టమైన అరణ్యం. అందువల్ల, పరాయి దండయాత్రల బెడద ఈ ప్రాంతానికి లేదు. రాచకుటుంబాల మధ్య అధికారం కోసం జరిగిన కుమ్ములాటల వల్ల చరిత్రకారుల దృష్టిని ఆకర్షించగలిగింది ఈజిప్టు. ఇతరుల దృష్టిని ఆకర్షించగల సంఘటనే సింధూ నాగరికతలో కనిపించదు. క్రీ.పూ. 1500 ప్రాంతంలో హఠాత్తుగానూ, మూకుమ్మడిగానూ, వారసులనైనా మిగల్చకుండా ఈ నాగరికత ఎలా, ఎందుకు అంతరించిందో అంతుదొరకని చిక్కుముడిగా మిగిలిపోయింది. ఆ నాగరికులు మిగిలించిపోయిందల్లా, ‘వాళ్ళు మావాళ్ళే’ నని భారతదేశంలో ఏవొక్కడైనా ఎగబడగల హక్కు.

రచన: ఎం.వి.రమణారెడ్డి
 

Advertisement
Advertisement