ఊపందుకున్న నామినేషన్లు | Sakshi
Sakshi News home page

ఊపందుకున్న నామినేషన్లు

Published Thu, Apr 17 2014 1:26 AM

political parties nominate a candidate to contest

 విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పోటీ  పడ్డారు. బుధవారం ఒక్కరోజే 25 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇంత వరకూ నామినేషన్లు పడని ఎస్.కోట, గజపతినగరం నియోజకవర్గాలకు కూడా బుధవారం నామినేషన్లు దాఖలు కావడంతో అన్ని చోట్లా బోణీ పడినట్టయింది. దీంతో జిల్లా అంతటా ఎన్నికల సంరంభం ప్రారంభమైంది. విజయనగరం ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి బొత్స ఝాన్సీలక్ష్మి తన నామినేషన్ సెట్లను దాఖలు చేశారు. ఆమె తన భర్త  పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌లతో కలిసి  వచ్చి కలెక్టర్ కాంతిలాల్ దండేకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
 
 కె.హరికిషన్, ఎస్ ఎల్లారావులు కూడా ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే మొత్తం జిల్లాలో బుధవారం 22 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున బొబ్బిలి నియోజకవర్గానికి   ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగారావు, పార్వతీపురం నియోజకవర్గానికి జమ్మాన ప్రసన్నకుమార్, సాలూరు నియోజకవర్గానికి పీడిక రాజన్న దొర, చీపురుపల్లిలో బెల్లాన చంద్రశేఖర్  తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.  కురుపాం నియోజకవర్గానికి సంబంధించి నిమ్మక జయరాజ్, ఇంద్రసేనవర్దన్‌లు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక్కడ తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా ఎవరు నిలుస్తారోనని చర్చించుకుంటున్నారు. సీపీఎం అభ్యర్థిగా కోలక లక్ష్మణమూర్తి, స్వతంత్ర అభ్యర్థిగా పి.రంజిత్‌కుమార్ నామినేషన్లు దాఖలు చేశారు.    
 
 గజపతినగరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడుబండి శ్రీనివాసరావు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన సందర్భంలో ప్రజలను అదుపు చేయడానికి పోలీసులు తంటాలు పడాల్సి వచ్చింది.  అలాగే గజపతినగరంలో లోక్‌సత్తా పార్టీ తరఫున దేవర ఈశ్వరరావు తన నామినేషన్ దాఖలు చేశారు. ఎస్.కోట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులుగా కోళ్ల లలిత కుమారి, గొంప సత్యవతిలు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఎల్లపు దమయంతీదేవి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెనుమత్స వరాహవెంకట సూర్యనారాయణ రాజు (సురేష్‌బాబు)నామినేషన్ దాఖలు చేశారు. సురేష్‌బాబు నామినేషన్ దాఖలు చేసినపుడు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
 
 టీడీపీ తరఫున పతివాడ నారాయణ స్వామినాయుడు, పతివాడ అప్పలనాయుడులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బడ్డుకొండ అప్పలనాయుడు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. విజయనగరం అసెంబ్లీ నియోజక వర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా మీసాల గీత, మీసాల శ్రీనివాసరావు, కాంగ్రెస్ అభ్యర్థిగా యడ్ల రమణమూర్తి, ఆప్ అభ్యర్థిగా శీర రమేష్‌కుమార్, నవభారత్ పార్టీ తరఫున వి.శివానంద నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.   వీరంతా విజయనగరం రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ బి.రామారావుకు నామినేషన్ పత్రాలను అందించారు.  ప్రధాన పార్టీల అభ్యుర్థులందరూ దాదాపుగా నామినేషన్లు దాఖలు చేశారు.  దీంతో ప్రచార పర్వాన్ని  ఈ అభ్యర్థులంతా రేపటి నుంచే ప్రారంభించనున్నారని వారి అనుయాయులు చెబుతున్నారు.  
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement