ప్రచార హోరు | Sakshi
Sakshi News home page

ప్రచార హోరు

Published Sat, Apr 19 2014 1:40 AM

ప్రచార హోరు - Sakshi

అరండల్‌పేట(గుంటూరు), న్యూస్‌లైన్ : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. శనివారంతో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారంలోకి దిగారు. తాడికొండ మినహా జిల్లాలోని మిగిలిన 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు, గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్ స్థానాలకు వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

తాడికొండ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి క్రిస్టీనా శనివారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం ఆయన పెదకూరపాడు అసెంబ్లీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడులు అచ్చంపేట మండలంలోని గ్రామాల్లో. సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి అంబటి రాంబాబుతో రాజుపాలెం మండలంలో విస్తృతంగా పర్యటించారు.

ఈ పార్లమెంటు పరిధిలో టీడీపీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రచారం చేపట్టలేదు. నరసరావుపేట అసెంబ్లీ టిక్కెట్టును బీజేపీకి కేటాయించడం, అభ్యర్థిని ప్రకటించినా చివరి నిముషంలో మార్చడంతో టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఇక్కడ ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.

 వెనుకబడ్డ టీడీపీ
 మాచర్ల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బోనబోయినను ప్రకటించినా ఆయన పోటీకి విముఖత చూపడం, నామినేషన్ల గడువు ముగియనున్నా ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో పార్టీ ప్రచారం చేయలే కపోతోంది. నరసరాావుపేట పార్లమెంటు టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు అసెంబ్లీ టికెట్ల కేటాయింపు పూర్తి కాకపోవడంతో ప్రచారం చేయలేకపోతున్నారు.

మాచర్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల అభ్యర్తి జంగా కృష్ణమూర్తి, వినుకొండ అభ్యర్థి నన్నపనేని సుధ, చిలకలూరిపేట అభ్యర్థి మర్రి రాజశేఖర్, నరసరావుపేట అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి అభ్యర్థి అంబటి రాంబాబులు వారివారి నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

గుంటూరు పార్లమెంటు వైఎస్సార్ సీపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, మంగళగిరి, గుంటూరు తూర్పు, పశ్చిమ అభ్యర్థులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తఫా, అప్పిరెడ్డి, పొన్నూరు, తెనాలి, తాడికొండ, ప్రత్తిపాడు అభ్యర్థులు రావి వెంకటరమణ, అన్నాబత్తుని శివకుమార్, క్రిస్టినా, మేకతోటి సుచరితలు రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. అలాగే గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు.

 బాపట్ల పార్లమెంటరీ  నియోజకవర్గ పరిధిలో...
 బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలోని రేపల్లె అసెంబ్లీ సెగ్మెంట్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే తొలివిడత ప్రచారాన్ని పూర్తిచేసుకొన్నారు. రెండో విడత ప్రచారానికి సమాయత్తమవుతున్నారు.

 ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థి సైతం ప్రచారం ప్రారంభించారు. వేమూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. బాపట్ల పార్లమెంటరీ కాంగ్రెస్ అభ్యర్థి పనబాక లక్ష్మి నియోజకవర్గం పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు మండుటెండలను సైతం లెక్కచేయకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు.

 అభ్యర్థుల హడావుడి
 పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి డివిజన్లలో ప్రచారం చేస్తున్నారు. ఈస్ట్ అభ్యర్థిని ఆ పార్టీ శుక్రవారమే ప్రకటించడంతో ఇంకా ప్రచారం ప్రారంభించలేదు. మంగళగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన తులసి రామచంద్రప్రభు పోటీకి విముఖత వ్యక్తం చేయడంతో అక్కడ పార్టీ శ్రేణులు అయోయమానికి గురవుతున్నారు.

తాడికొండలో శ్రావణ్‌కుమార్, పొన్నూరులో నరేంద్ర ప్రచారం చేస్తుండగా తెనాలిలో ఆలపాటి ప్రచారం సాగిస్తున్నారు. ప్రత్తిపాడులో అభ్యర్ధి ప్రకటన ఆలస్యం కావడంతో టీడీపీ వెనుకంజలో ఉంది. ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ సైతం పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement