తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే విజయం! | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే విజయం!

Published Thu, Jan 22 2015 3:47 AM

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే విజయం!

 మారుమూల గ్రామంలో విద్యాభ్యాసం.. సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం.. ఇంటర్మీడియెట్ పూర్తయ్యే నాటికి చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సుపై కనీస అవగాహన లేదు. ఓ విద్యాసంస్థ కరపత్రం ఆ విద్యార్థిని సీఏ కోర్సు దిశగా నడిపించింది. కఠినతరమైన సీఏలో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకునేలా చేసింది. ఇప్పుడు సీఏ- కామన్ ప్రొఫిషియన్సీ టెస్టు (సీపీటీ)కు సన్నద్ధమై, తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన  పనాస విశ్వేశ్వర రావు సక్సెస్ స్టోరీ అతని మాటల్లోనే...
 
 సక్సెస్ స్టోరీ
 శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలంలోని గీతనాపల్లి మా స్వగ్రామం. మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మ గౌరీశ్వరి, నాన్న అప్పలనాయుడు. తమ్ముడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వ్యవసాయం జీవనాధారం. ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివాను. స్థానిక ప్రైవేటు పాఠశాలలో తెలుగు మాధ్యమంలోనే పదోతరగతి పూర్తి చేశాను. 9.7 జీపీఏ సాధించాను.
 
 ఇంటర్‌లో ఇంగ్లిష్ మీడియం:
 బొబ్బిలిలోని తాండ్ర పాపారాయుడు జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్‌లో చేరాను. ఇంగ్లిష్ మీడియం తీసుకోవడంతో మొదటి మూడు నెలలు క్లాసులు అర్థం చేసుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సి వచ్చింది. అయినా కష్టపడి చదివి ఇంటర్మీడియెట్‌లో 94 శాతం మార్కులు సాధించాను.
 
 సీఏపై అవగాహన లేదు:
 ఇంటర్ పూర్తయ్యేవరకు చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సుపై అవగాహన లేదు. పదోతరగతి పూర్తికాగానే ఇంటర్మీడియెట్, తర్వాత ఇంజనీరింగ్ చదవాలనుకున్నాను. కానీ ఇంటర్ పబ్లిక్ పరీక్షల సమయంలో ఓ సంస్థ ప్రచురించిన కరపత్రాన్ని చూశాను. అందులోని అంధుడైన ఓ విద్యార్థి సీఏలో విజయం సాధించిన కథనం స్ఫూర్తిగా నిలిచింది. ఆ స్ఫూర్తితోనే సీఏ కెరీర్ గురించి తెలుసుకున్నాను. స్వల్పకాలంలోనే మంచి కెరీర్‌ను అందించే సీఏపై ఆసక్తి ఏర్పడింది.
 
 ప్రిపరేషన్:
 ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగియడంతో పూర్తి సమయాన్ని సీఏ ప్రిపరేషన్‌కు కేటాయించాను. ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు తరగతి గదిలోనే ప్రిపేరయ్యాను. సమస్యల సాధనకు మెళకువలు నేర్చుకున్నాను. ఏ రోజు నేర్చుకున్న అంశాలను అదే రోజు సాయంత్రం రివిజన్ చేశాను.
 
 సీపీటీ తీరిదీ!
 సీఏలో కామన్ ప్రొఫెషియెన్సీ టెస్ట్(సీపీటీ).. రెండు సెషన్లలో జరుగుతుంది. మొదటి సెషన్‌లో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, మర్కంటైల్ లా ఉంటాయి. అయితే ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూప్ చదవడంతో అకౌంట్స్ అంటే తెలియదు. అయినప్పటికీ ప్రాథ మిక అంశాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి అకౌంట్స్, మర్కంటైల్ లాపై పట్టు పెంచుకున్నాను. శిక్షణ పూర్తయ్యే నాటికి అకౌంట్స్ ఇష్టమైన సబ్జెక్టుగా మారింది. ఫ్యాకల్టీ బోధన ఎంతగానో ఉపయోగపడింది. రెండో సెషన్‌లో జనరల్ ఎకనమిక్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌ల్లోనూ మంచి మార్కులు సాధించాను. మొత్తం సీఏ సీపీటీలో 188 మార్కులు సాధించాను. వంద మార్కులు వస్తే చాలనుకున్నా. కానీ జాతీయ స్థాయిలో మొదటి స్థాయిలో ర్యాంకు సాధిస్తానని ఊహించలేదు.
 
 తల్లిదండ్రుల ప్రోత్సాహం:
 అమ్మానాన్న పెద్దగా చదువుకోకపోయినా వారికి చదువు విలువ తెలుసు. అందుకే చిన్నతనం నుంచి నన్ను ప్రోత్సహించేవారు. ఆ ప్రోత్సాహమే నేను సీఏ సీపీటీలో మొదటి ర్యాంకు సాధించడానికి కారణమైంది.
 
 లక్ష్యం:
 ఇప్పుడు సీఏలో రెండో దశ అయిన ఐపీసీసీకి సన్నద్ధమవుతున్నాను. ప్రస్తుత లక్ష్యం అదే. అందులో కూడా మంచి ప్రతిభ కనబర్చడానికి ప్రయత్నిస్తా. జాతీయ స్థాయి కంపెనీలో సీఈఓ స్థాయికి చేరాలనేది నా భవిష్యత్ లక్ష్యం.
 
 సలహా:
 మొదటి రోజు నుంచి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని చదవాలి. పాఠ్యాంశాలను వాయిదా వేయకుండా ఏ రోజు అంశాలను అదే రోజు పక్కాగా ప్రిపేరవ్వాలి. ఎంపీసీ నేపథ్యం ఉన్నవారు అకౌంట్స్‌ను ముందు నుంచే అధ్యయనం చేయాలి.

 పోస్ట్‌మన్/మెయిల్‌గార్డ్ పరీక్ష ప్రత్యేకం
 హైదరాబాద్: కేవలం పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది తపాలా శాఖ. ఇప్పటికే వేల సంఖ్యలో పోస్టల్ అసిస్టెంట్స్, పోస్ట్‌మన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేసిన ఏపీ పోస్టల్ సర్కిల్ తాజాగా 301 పోస్ట్‌మన్/మెయిల్‌గార్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే అభ్యర్థులు ఏ రీజియన్‌కు ఎన్ని ఖాళీలున్నాయి? పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలి?  ఏ పుస్తకాలు చదవాలి? గత ప్రశ్నపత్రాల విశ్లేషణ, మోడల్ పేపర్లు వంటి అంశాల గురించి జోరుగా ఆరా తీస్తున్నారు. అందుకే సాక్షి పోస్టల్/మెయిల్‌గార్డ్ పరీక్షకు ప్రత్యేక వెబ్‌పోర్టల్ రూపొందించింది.
 
 పోర్టల్‌లో ఏమున్నాయి?
 నోటిఫికేషన్-ఖాళీల వివరాలు
 ప్రిపరేషన్ టిప్స్ - స్టడీ మెటీరియల్
 మోడల్ పేపర్లు - గత ప్రశ్నపత్రాలు
 ఆన్‌లైన్ పరీక్షలు
 దరఖాస్తు విధానం
 
 పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగిస్తే కొలువు మీ సొంతం. మరెందుకాలస్యం లాగాన్ అవండి..
 http://www.sakshieducation.com/
 Postal/index.html
 
 

Advertisement
Advertisement