పాత గూటికి చేరిన నితీశ్‌ | Sakshi
Sakshi News home page

పాత గూటికి చేరిన నితీశ్‌

Published Fri, Jul 28 2017 1:12 AM

పాత గూటికి చేరిన నితీశ్‌

బిహార్‌ రాజకీయాలు తిరగాల్సిన మలుపు తిరిగాయి. జనతాదళ్‌–యూ నేత నితీశ్‌కుమార్‌ చేరాల్సిన గూటికి చేరారు. మహాఘట్‌బంధన్‌ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన మరుసటి రోజునే ఎన్‌డీఏ మద్దతుతో తిరిగి ప్రమాణస్వీకారం చేశారు. నాటకీయంగా జరిగిన ఈ పరిణామాలు అనూహ్యమైనవీ కావు, పర్యవసానాలు బిహార్‌కు పరిమతమయ్యేవీ కావు. 2013లో బీజేపీ, తన ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ పేరును ప్రకటించిందన్న కారణంతో ఎన్‌డీఏ నుంచి తప్పుకున్న నితీశ్‌ నేడు ఆయన మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చే శారు. దీన్ని అవకాశవాదమని, అనైతికమని, నమ్మకద్రోహమని రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) నేత లాలూప్రసాద్‌ యాదవ్‌ నుంచి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వరకు ప్రత్యర్థులంతా విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా, ఆర్‌జేడీ అవినీతి, వారసత్వ రాజకీయాలే కూటమి విచ్ఛిన్నాన్ని అనివార్యం చేశాయని నితీశ్‌ మద్దతుదార్ల వాదన. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ కుమారుడు తేజస్వినీ యాదవ్‌ చేత రాజీనామా చేయిస్తే కూటమి విచ్ఛిన్నం ఆయ్యేది కాదనే వాదన కూడా ఉంది. అందులో కొంత వాస్తవమూ ఉంది. నితీశ్‌కు అవినీతి మకిలి అంటని నేతగానే కాదు, సమర్థ పాలకునిగా కూడా పేరుంది. కారణాలు ఏవైనా కుమారుడు నిశాంత్‌ రాజకీయాలకు దూరంగా ఉండటంతో ఆయన మెడకు వారసత్వ రాజకీయాల గుదిబండా లేదు. ఆ పేరు ప్రతిష్టలతోనే 2014 సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గుకురాగలనని అనుకున్న నితీశ్‌ ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్నారు. పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తున్నానంటూ రాజీనామా చేసి జీతన్‌రాం మాంఝీకి ముఖ్యమంత్రి పదవిని ఇలా కట్టబెట్టి, అలా బలవంతంగా దించి, తిరిగి గద్దెనెక్కారు.

2015 శాసనసభ ఎన్నికల్లో లాలూ, కాంగ్రెస్‌లతో కలసి మహాఘట్‌ బంధన్‌ ఏర్పాటు చేసి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అవినీతి ఆరోపణలతో జైలుపాలైనా లాలూ జనాకర్షణÔ¶ క్తి తిరిగి పుంజుకోవడంతో... 2010లో 22 సీట్లకు పరిమితమైన ఆర్‌జేడీ ఈ ఎన్నికల్లో  80 స్థానాలతో శాసనసభలో అతి పెద్ద పార్టీగా అవతరించగా, జేడీయూ 71 స్థానాలతో రెండో స్థానంలో నిలవడం ఆయనకు మింగుడు పడలేదు. పైగా ఆర్‌జేడీలో పలువురు సీనియర్‌ నేతలను కాదని లాలూ తన పుత్రునికి ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. అంతేకాదు, కుటుంబ సభ్యులకు కీలక మంత్రి పదవులు ఇప్పించారు. ఇది చాలదని ఎప్పటికప్పుడు నితీశ్‌ను బహి రంగంగానే విమర్శిస్తూ అక్కసు ప్రదర్శిస్తూ వచ్చారు. ఇవన్నీ కలసి నితీశ్‌లో అభద్రతను రాజేశాయి. దీనికి బీజేపీనో లేక సీబీఐనో తప్పు పట్టలేరు. అవి ఆర్జేడీ స్వీయాపరాధాలు.

1970ల నాటి జయప్రకాశ్‌ నారాయణ్‌ సంపూర్ణ విప్లవం నుంచి లాలూతో పాటూ ఎదిగి వచ్చిన నితీశ్‌ 1996లోనే బీజేపీతో చెయ్యి కలిపారు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత అంతా బీజేపీకి దూరంగా ఉంటున్న కాలంలోనే ఆ పని చేయగలిగారు. ఎన్‌డీఏతో కలసి సాగిన దాదాపు దశాబ్ద కాలంలోనూ ఆయన కేంద్రంలోనో, రాష్ట్రంలోనో అధికారంలో కొనసాగగలిగారు. తిరుగులేని జనా కర్షణశక్తిగల మోదీ నేతృత్వంలోని బీజేపీకి బిహార్, ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురు కావడం, మహా ఘట్‌బంధన్‌ ప్రయోగం జాతీయస్థాయిలో విజయవంతం కాగలదనే ఆశలను రేకెత్తించింది. అందరికీ ఆమోదయోగ్యుడైన నేతగా ఎన్‌డీఏ తరఫున 2014లో ప్రధాని పదవిని చేపట్టే అవకాశం దక్కవచ్చన్న నితీశ్‌ ఆశలపై మోదీ అభ్యర్థిత్వం నీళ్లు చల్లింది.

అలా నాడు చేజారిన అవకాశం బీజేపీ వ్యతిరేక ప్రతిపక్షాల కూటమి అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో తిరిగి దక్కవచ్చనే ఆశలు నితీశ్‌కు లేకపోలేదు. కానీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాహుల్‌ బరిలో ఉండటం, లాలూ దయాదాక్షిణ్యాలతోనే తాను ముఖ్యమంత్రిగా ఉన్నానని గుర్తుచేస్తున్న ట్టుగా ఆర్‌జేడీ తనతో అతి మొరటుగా వ్యవహరిస్తుండటం కలసి ఆయన బీజేపీతో సత్సంబంధాలను నెరపేలా ప్రోత్సహించాయి. పెద్ద నోట్ల రద్దు నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు నితీశ్‌ తీరు దానినే సూచిస్తూ వచ్చింది. రెండేళ్లలోగానే సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా ఎన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నా మోదీ ప్రభుత్వానికి జానాదరణ తగ్గకపోగా, ఎన్‌డీఏకు  ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాలు ప్రజలలో విశ్వసనీయతను సంపాదించుకోలేక పోతున్నాయనేది నిస్సందేహం. ఇంకా వాస్తవ రూపం ధరించని ఆ కూటమిపై నితీశ్‌ ఆశలు వదులుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.

బీజేపీతో అనుబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడం గతంలో లాగే 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ, 2011 శాసనసభ ఎన్నికల్లోనూ లబ్ధిని చేకూరుస్తుందని నితీశ్‌ భావిస్తుండవచ్చు. ఆయన అంచనాలు తప్పవనే హామీ లేదు. బిహార్‌కు సంబంధించి బీజేపీకి స్పష్టమైన సొంత వ్యూహం ఉంది. అందులో మహా ఘట్‌బంధన్‌ విచ్ఛిన్నం  తొలిమెట్టు మాత్రమే. లాలూ మొండి వైఖరితో అందుకు సహకరించడం విశేషం. ఇక అది లాలూ జనాకర్షణశక్తిని దెబ్బ తీయడంపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. బిహార్‌లోని అవినీతికి వ్యతిరేకంగా నితీశ్‌ సాగిస్తున్న సూత్రబద్ధ పోరు అందుకు దోహదపడవచ్చు. కానీ బీజేపీ ముఖ్యమంత్రులు కొందరు, రాష్ట్ర, కేంద్ర మంత్రులు కొందరు అవినీతిసహా వివిధ అరోపణలను, కేసులను ఎదుర్కొంటున్నారు. అలాంటి మంత్రులతో కలసి పనిచేయడానికే నితీశ్‌ తన పార్టీ ప్రతినిధులను పంపబోతున్నారు. ఏ సూత్రబద్ధతాలేని ఈ అధికార పోరులో నైతిక విలువల గురించి మాట్లాడం అసంబద్ధం. కాబట్టేనేమో బిహార్‌ గవర్నర్‌గా వ్యహ రిస్తున్న తాత్కాలిక గవర్నర్‌ కేశరీనాథ్‌ త్రిపాఠీ రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలిచ్చి శాసనసభలో అతిపెద్ద పార్టీ ఆర్‌జేడీకి ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చే సే అవకాశం ఇవ్వకపోవడంపై పెద్ద చర్చ జరగడంలేదు. నితీశ్‌–లాలూ మైత్రి విచ్ఛిన్నం కావడం అంటే జాతీయ స్థాయిలో బీజేపీ, ఎన్‌డీఏ వ్యతిరేక మహా కూటమి ఏర్పాటు ప్రయత్నాలకు తూట్లు పడటమే. అలాంటి అవకాశాన్ని ప్రత్యర్థి పక్షాలే అందిస్తే దాన్ని కాదనేటంతటి వెర్రిబాగులతనం బీజేపీకి లేదు.

Advertisement
Advertisement